నిన్నటి వరకు నేను ఒబిసి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే అందరూ నన్ను అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు అని చెప్పిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవ్వాళ ప్రతిపక్షాలు ఈ దేశాన్ని కులపరంగా విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి అని విమర్శించారు. అంటే రాజకీయ లబ్ధి కోసం బిసి మేకప్ వేసుకోవడమే తప్ప ఆ వర్గం పట్ల ఆయనకు ఎలాంటి ప్రేమలేదని మరోసారి రుజువైంది. దాదాపు మూడు దశాబ్దాలుగా బిసి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండ్‌పై ఆగిపోయిన ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్’ బిల్లుని పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది. నిజంగానే బిసిల పట్ల మోడీకి ప్రేమ ఉన్నట్లయితే అన్ని పక్షాలు మద్దతు పలుకుతున్న బిసి మహిళలకు కూడా ‘కోటాలో వాటా’ ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొచ్చేవారు. కానీ అట్లా జరగలేదు. ‘దొర’ల స్థానంలో ‘దొరసాను’లను కూర్చోబెట్టే చట్టాన్ని తీసుకొచ్చారు.
ఇవ్వాళ రాహుల్ గాంధీ మొత్తం 93 మంది కేంద్ర కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఒబిసి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వాళ్లు మొత్తం బడ్జెట్‌లో కేవలం 5 శాతం మాత్రమే హ్యాండిల్ చేస్తారు. మిగతా 95 శాతం ఆధిపత్య కులానికి చెందిన ఐఎఎస్ ఆఫీసర్లు తమ ఇష్టానుసారం వినియోగిస్తున్నారు అని చెప్పకనే చెప్పిండు. జనాభాలో 56 శాతానికి పైగా ఉన్నటువంటి ఒబిసిలను మభ్యపెట్టి, రామజన్మభూమి ఉద్ఘాటన పేరుతో మతం పేరిట ఓట్లను దండుకోవాలని చూసిన బిజెపికి బీహార్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన ఫలితాలు ఆశనిపాతంలా తగిలాయి. దాంతో విలవిల్లాడుతూ ప్రధాని కొత్తగా కులం పేరిట దేశాన్ని విభజించేందుకు ప్రతిపక్షాలు పాపానికి ఒడిగడుతున్నాయని అంటూ మోడీ మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సోమవారం ప్రసంగించారు. ఈ దేశంలో 29 శాతం కేంద్ర మంత్రి పదవులిచ్చింది బిజెపి సర్కారు అని, మొత్తం 1358 మంది బిజెపి ఎమ్మెల్యేల్లో 365 మంది అంటే 27 శాతం మంది, 163 ఎమ్మెల్సీల్లో 65 మంది అంటే 40 శాతం ఒబిసి సామాజికవర్గం వారే అని వాదిస్తున్నది. నిజమే కావొచ్చు. కానీ కులపరమైన లెక్కలు చేసినట్లయితే వచ్చే నష్టమేందో చెప్పడం లేదు. నిజానికి కులమనేది సామాజిక వాస్తవం. ప్రతి ఊరిలో ఎవరు ఏ కులం వారు? వాళ్ల ఆధిపత్యం ఎలా ఉన్నది అనేది అక్కడున్న అందరికీ తెలుసు. ఆ విషయాలపై స్పష్టత ఇవ్వకుండా పనికిమాలిన సోది చెబుతున్నారు. బీహార్ బిజెపి నాయకుల స్పందన చూస్తే అర్థమయితున్నది. బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు తెలంగాణకు చెందిన కె.లక్ష్మణ్ కులగణన చేయాల్సిన అవసరమే లేదని వాదించి అభాసుపాలయ్యిండు.
ఇప్పటికే సేకరించిన కులగణన వివరాలను బిజెపి బయటపెడితే లేదా కొత్తగా చేపడితే వచ్చే ఉపద్రవమేదో తెలియదు. నిజానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మేము 85 శాతం, ఆధిపత్య కులం వారు 15 శాతం మంది. లెక్క తేలిపోయింది. ఇద్దరం కలిసి దేశ ప్రగతిలో పాలు పంచుకుందాం అని పిలుపునిచ్చారు. దీని వల్ల ఎలాంటి నష్టం లేదే? అట్లాంటిది కేంద్రం ఎందుకు కులగణనకు మోకాలడ్డిందో తెలియదు. అంతేగాదు బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు న్యాయపరంగా అవరోధాలు కల్పించింది. నిజానికి దేశంలో కులగణనకు బీహార్ ప్రభుత్వం ఎన్నో న్యాయపరమైన చిక్కులను, పాలనపరమైన అవరోధాలను ఎదుర్కొని, సాహసోపేతంగా కొత్తదారిని వేసింది. 1948 సెన్సస్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రమే జనాభా లెక్కలు సేకరించాలని ఉన్నది. ఇట్లా ఒక రాష్ర్టం లెక్కలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు, కోర్టుకెక్కారు. అంతేగాదు ఈ గణన ద్వారా ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తున్నారు అని మరో కేసుని దాఖలు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అంటూ బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణనను అడ్డుకునేందుకు ఆధిపత్యకుల వాదులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఈ వాదనకు పాట్నా హైకోర్టు లొంగిపోయి ఒకానొక దశలో కులగణనపై ‘స్టే’ విధించింది. ఆ తర్వాత బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అక్కడ కూడా భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘విపరీతమైన పరిణామాలు’ చోటు చేసుకుంటాయి అని చెబుతూ కులగణనకు అడ్డుతగిలే ప్రయత్నం చేసిండు. ఇన్ని అవరోధాలను అధిగమించి ఇవ్వాళ బీహార్ ప్రభుత్వం 500 ల కోట్ల రూపాయలను వెచ్చించి మొత్తం 215 కులాల వారి వివరాలను సేకరించింది. తద్వార దేశంలోని అన్ని రాష్ట్రాలు కులగణన చేపట్టేందుకు దిశానిర్దేశం చేసింది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వమే ఈ గణన చేస్తే మరీ మంచిది. గతంలో కులగణన చేపట్టిన తెలంగాణ, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలు వాటిని బహిర్గతం చేయాలనే డిమాండ్‌కు కొత్తగా జీవం పోసినట్లయింది. అట్లాగే ఇంతవరకు లెక్కలు చేపట్టని రాష్ట్రాలు అందుకు చర్యలు తీసుకోవాలని వత్తిడి పెరుగుతున్నది. కులగణన విషయంలో బీహార్ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసింది. దీన్ని ‘ఇండియా’ కూటమి తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ స్వాగతించాడు. కాంగ్రెస్ పార్టీ 2011లో సెన్సస్ చట్టం ప్రకారం గాకుండా ‘సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్’ని సేకరించింది. ఈ లెక్కల సేకరణను కుట్రపూరితంగా అప్పటి బ్రాహ్మణ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు అడ్డుకున్నారు. లేకుంటే చట్ట ప్రకారమే కులాల వారీగా లెక్కలు సేకరించేందుకు అవకాశముండేంది. సెన్సస్ చట్ట ప్రకారం గాకుండా చేపట్టిన ఈ సర్వే కోసం అదనంగా 4500ల కోట్ల రూపాయలను కేంద్రం ఆనాడు ఖర్చు పెట్టింది. నిజానికి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ గణాంకాలను ప్రజలకు వెల్లడి చేసి ఉన్నట్లయితే ఇవ్వాళ తమకు తాము ఒబిసిల చాంపియన్‌లుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్‌కు ఒక అవకాశముండేది. కాంగ్రెస్ పార్టీ చర్యల వల్ల దూరమైన ఒబిసిలు ఇవ్వాళ కొంత బిజెపి వైపు వెళ్ళిండ్రు. దానికి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలి.
కర్నాటకలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఆ రాష్ర్టంలో కులగణన చేసింది. వాటి విశ్లేషణ జరిగి, వివరాలన్నీ క్రోడీకరించారు. అయినప్పటికీ వాటిని ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు. ఇప్పుడు కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.కె. హరిప్రసాద్ తమ ప్రభుత్వాన్ని కులగణన ఫలితాలను వెల్లడి చేయాలని మంగళవారం (3 అక్టోబర్, 2023) డిమాండ్ చేశారు. ఇదే సిద్దరామయ్య మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపి ప్రభుత్వాన్ని కులగణన ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేసిండు. ఇప్పుడు ఇదే సిద్దరామయ్యపై ఫలితాల ప్రకటన కోసం వత్తిడి పెరుగుతున్నది. ఇది వరకు తాము అధికారంలో ఉన్నప్పుడు మహిళా బిల్లులో బిసిలకు వాటా ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మాలి అంటే ముందుగా కర్నాటక ప్రభుత్వం కులగణన ఫలితాలను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బీహార్ ప్రభుత్వం కేవలం కులాల వారీ డేటాను మాత్రమే ప్రకటించింది. ఇంకా విశ్లేషణ జరుగుతున్నది. కానీ కర్నాటక విషయంలో అలా కాదు. కుల గణన చేసి ఎనిమిదేండ్లు అవుతున్నది. వాటి విశ్లేషణతో సహా వివరాలను టాబ్యులేట్ చేసిండ్రు. అందుకే ముందుగా ఈ వివరాలను ప్రజలకు వెల్లడించి సిద్దరామయ్య ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
నిజానికి దేశంలో 1931 తర్వాత తొలిసారిగా కులగణన చేసిన రాష్ర్టం తెలంగాణ. సమగ్ర కుటుంబ సర్వే పేరిట 2014లో ఉద్యోగులందరూ ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా చేపట్టిన లెక్కలు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేవు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని వివరాలు చెప్పినవే ఆనాడు పత్రికల్లో పతాక శీర్షికల్లో అచ్చయినాయి తప్ప ఏ సామాజిక వర్గం వారు, ఏ జిల్లాలో ఇంకా చెప్పాలంటే ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంత శాతం ఉన్నారు అనే వివరాలు అందుబాటులో లేవు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ లెక్కలను ప్రజలకు వెల్లడించి ఈ దేశంలో కులగణనకు తామే చాంపియన్ అని నిరూపించుకోవాల్సిన అవసరమున్నది. ప్రస్తుతం బీహార్ సందర్భం కాబట్టి ఆ రాష్ర్టం ప్రకటించిన కులగణన గురించి చర్చించుకుందాం! ప్రకటించిన లెక్కల్లో మొత్తం 13,07,25,310 (13 కోట్ల ఏడు లక్షల 25 వేల 310) జనాభాలో 27% అంటే 3,54, 63, 936 (మూడు కోట్ల యాభై నాలుగు లక్షల 63 వేల 936 మంది) ఒబిసిలు కాగా, అత్యంత వెనుకబడిన వర్గాలు 36 శాతం మంది అంటే 4, 70, 80, 514 మంది ఉన్నారు. 1980లో నివేదిక సమర్పించిన మండల్ కమిషన్ ఒబిసిల జనాభా 52 శాతంగా అంచనా వేసింది. అయితే అది ఇవ్వాళ 63 శాతంగా తేలింది.
అదే సమయంలో వచ్చే సంవత్సరం జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించుకొని ఎన్నికలకు వెళ్లాలని బిజెపి యోచిస్తున్నది. ఇట్లా మళ్ళొక్కసారి భారత రాజకీయాలు మండల్ వర్సెస్ కమండల్‌గా మారనున్నాయి. ఈ కులగణన బిజెపి మత రాజకీయాలకు తెరదించనున్నది. ఒబిసిల్లో రాజకీయ చైతన్యాన్ని ప్రోదీ చేయనున్నది.
సోమవారం గాంధీ జయంతి రోజున ప్రకటించిన ఒబిసి కులగణనలో బీహార్‌లో లార్జెస్ట్ కమ్యూనిటీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు చెందిన యాదవులు 14.26 శాతం, కుశ్వాహాలు 4.21 శాతం, ముఖ్యమంత్రి నితిష్ కుమార్ సామాజిక వర్గమైన కుర్మీలు 2.87 శాతం, బనియాలు 2.31 శాతం ఉన్నారు. అత్యంత వెనుకబడిన కులాల్లో చిన్న చిన్న సామాజిక వర్గాల వారు ఉన్నారు.
ఇందులో తేలి 2.81 శాతం, ధనుక్ 2.13 శాతం, ప్రజాపతి (కుమ్మరి) 1.40 శాతం ఉన్నట్టుగా తేలింది. అట్లాగే ఎస్‌సిలు 19.7 శాతం, ఎస్‌టిలు 1.7 శాతమున్నారు. ఆధిపత్య కులాల జనాభా 15.5 శాతమున్నది. ఇందులో బ్రాహ్మణులు 3.65 శాతం కాగా రాజ్‌పుత్ 3.45 శాతం, భూమిహార్లు 2.87 శాతం కాగా కాయస్థులు 0.60 శాతమున్నారు. ఈ రాష్ర్టంలో ముస్లింలు 17.7 శాతమున్నారు. 81.99 శాతం మంది హిందువులున్నారు. క్రిస్టియన్, సిక్కు మతస్థులు వేలల్లోనే ఉన్నారు. 2146 మంది తమకు మతం లేదని చెప్పుకున్నారు. ఈ లెక్కలను బట్టి తేలేదేమిటంటే ముస్లింల్లోని కొంత శాతం మందిని బ్యాక్‌వర్డ్ క్లాస్‌గా గుర్తించి ఇబిసి, ఒబిసిల్లో చేర్చినట్లు అర్థమయితున్నది. ఆ రాష్ర్ట జనాభాలో 82 శాతం మంది హిందువులున్నారు. వీరిని పక్కదారి పట్టించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు కులగణన కాదు, నితీశ్ ప్రభుత్వం ప్రగతి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అంటే తాము మద్దతు ప్రకటించిన కులగణన చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించకుండా కాలుగుంజే ప్రయత్నం చేస్తున్నారంటేనే వారెంత డిఫెన్స్‌లో పడ్డారో అర్థమయితున్నది. ఈ కులగణన దేశానికి దిశా నిర్దేశం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంగిశెట్టి శ్రీనివాస్
9849220321