Monday, December 23, 2024

కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయేవాడిని: బిహార్ సిఎం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయే వాడిని
రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా
ఖమ్మం బిఆర్‌ఎస్ సభకు వెళ్లక పోవడంపై నితీశ్ కుమార్ వ్యాఖ్య
ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై వెళ్లాలన్నదే నా డ్రీమ్

పాట్నా: ఖమ్మంలో బుధవారం జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు పలువురు జాతీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శిడి రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసేతర ప్రతిపక్షాల ఐక్యత భేటీగా భావిస్తున్న ఈ సభకు విపక్షాలకు చెందిన పలువురు సిఎంలు, మాజీ సిఎంలు హాజరు కాలేదు. వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒకరు.

గత ఏడాది ఎన్‌డిఎనుంచి బైటికి వచ్చిన నితీశ్ కుమార్, కెసిఆర్‌లు వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా జాతీయ పార్టీలయిన బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు నితీశ్ సాయం కోరుతూ గతంలో కెసిఆర్ పాట్నాకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో ఖమ్మంలో బిఆర్‌ఎస్ సభకు నితీశ్ తప్పకుండా హాజరవుతారని అందరూ భావించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. దీంతో బీహార్ సిఎం రాకపోవడానికి కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కెసిఆర్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నేతల భేటీకి హాజరు కాకపోవడంపై గురువారం విలేఖరుల సమావేశంలో నితీశ్‌కుమార్ స్పందించారు.

కెసిఆర్ చేస్తున్న ర్యాలీ గురించి తనకు సమాచారం లేదన్నారు. తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నానన్నారు. ఒక వేళ సభకు కెసిఆర్ ఆహ్వానించినా హాజరుకాలేకపోయే వాడినని నితీశ్ చెప్పారు.రాష్ట్రంలో సమాధాన్ యాత్ర, వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు తదితర కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున ఖమ్మం సభకు వెళ్లే వీలుండేది కాదన్నారు. కెసిఆర్ సారథ్యంలోని పార్టీ చేపట్టిన సభకు ఆహ్వానం అందిన నేతలు కచ్చితంగా వెళ్లి ఉంటారని నితీశ్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు విపక్షాలన్నీ కలిసి ముందుకెళ్తే చూడాలన్నదే తన కల అని నితీశ్ అన్నారు.

తనకేమీ అవసరం లేదని, కాకపోతే ప్రతిపక్ష నేతలంతా ఒక తాటిపై ముందుకెళ్తే చూడాలన్న ఒకే ఒక డ్రీమ్ ఉందన్నారు. తద్వారా దేశానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. సమాధాన్ యాత్ర పూర్తి చేసిన తర్వాత ప్రతిపక్షాలను సంఘటితం చేయడానికి దేశంలో పర్యటిస్తారా అని ఓ విలేఖరి ప్రశ్నించగా,‘ అప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాలో కూడా సూచిస్తారేమో. మీ సూచనను పాటిస్తాను’ అని నవ్వుతూ నితీశ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News