పాట్నా: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసలు కొత్త పార్లమెంట్ భవనం అవసరమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఏమాత్రం పాలుపంచుకోని వారిని ప్రస్తావిస్తూ అసలు చరిత్ర మార్చేస్తున్నారని, ఆ ప్రయత్నమే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభమని విమర్శించారు. పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కానీ, రాజ్యసభ ఛైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను కానీ పిలవక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆక్షేపించారు. ఆదివారం జరగనున్న పార్లమెంట్‌భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు జెడి(యు) ప్రకటించింది.
పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనుండడంపై నిరసనగా ఆదివారం రోజంతా నిరాహార దీక్ష పాటిస్తామని తెలిపింది. పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి ముఖ్యమైన భాగమని, రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నారని,నరేంద్రమోడీ ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్రపతిని ఆహ్వానించవలసి ఉందని రాష్ట్ర జెడి(యు) అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా పాత్రికేయులతో అన్నారు. నీతి అయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడంపై నితీష్ కుమార్‌ను అడగ్గా, ఉదయం పూట సమావేశం ఏర్పాటు చేశారని, పాట్నాలో పగటిపూట తనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయని, అందుకని ఢిల్లీకి వెళ్లలేక పోయినట్టు తెలిపారు. అదే మధ్యాహ్నం ఏర్పాటు చేసి ఉంటే హాజరయ్యేవాడినని చెప్పారు.
ఆ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరవుతారని వారి జాబితా పంపగా, దానికి కేంద్రం నుంచి స్పందన లేదని, అందువల్ల బీహార్ నుంచి నీతి అయోగ్ సమావేశానికి ఎలాంటి ప్రతినిధులు హాజరు కావడం లేదన్నారు. 2000 నోట్ల రద్దుకు రిజర్వుబ్యాంకు తీసుకున్న నిర్ణయంపై మొదట వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశారని, ఇప్పుడు 2000… వారి ఆలోచనేమిటో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందుగా బీజేపీయేతర పార్టీలన్నీ విపక్షాల ఐక్యతపై ఇక్కడ చర్చలు జరపడాన్ని అడగ్గా దాని గురించి తరువాత మాట్లాడుతానని చెప్పారు.