Wednesday, January 22, 2025

స్నేహపూర్వకమే తప్ప.. పొత్తుల ప్రస్తావన రాలేదు

- Advertisement -
- Advertisement -

భేటీపై నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ వివరణ

భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాలను ఒకే గొడుగు కిందకు తీసుకురాడానికి ప్రయత్నిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని కలిగించింది. ఇద్దరు నేతలు దాదాపు గంటసేపు చర్చించుకున్నారు. తమ సంభాషణల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రాజకీయ పొత్తుల ప్రస్తావన రాలేదని, అంతా స్నేహపూర్వకంగానే జరిగిందని ఇద్దరు ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు. ఒడిశా సిఎం నివాసంలో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఇద్దరూ మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తామిద్దరం మంచి మిత్రులమని చెప్పారు. “ ఈరోజు ఎలాంటి పొత్తు గురించి చర్చ జరగలేదు.

నితీష్ భువనేశ్వర్‌కు రావడం చాలా ఆనందం కలిగించింది. మేం ఇద్దరం పాత స్నేహితులం. వాజ్‌పాయ్ క్యాబినెట్‌లో సహచర మంత్రులం.” అని పట్నాయక్ విలేఖరులతో అన్నారు. పూరీ క్షేత్రంలో 1.5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా బీహార్ ప్రభుత్వానికి టూరిస్టుల కోసం ఒడిశా ప్రభుత్వం కల్పిస్తుందని పట్నాయక్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశం తాలూకు కొన్ని ఫోటోలను పట్నాయక్ ట్వీట్ ద్వారా షేర్ చేశారు. “ బీహార్ సిఎం నితీష్‌కుమార్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బీహార్ ప్రజలతో ఒడిశా ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటుంది.

ఆయన ఒడిశాలో పర్యటించడం ఫలప్రదం కావాలని అభిలషిస్తున్నా ” అని పట్నాయక్ తన ట్వీట్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా నితీష్‌కుమార్ మాట్లాడుతూ “ మా అనుబంధం నవీన్ తండ్రి బిజూ బాబు నుంచీ కొనసాగుతోంది. నవీన్ నా పాత మిత్రుడు. అయితే కరోనా కారణంగా మేం ఇరువురుం కలుసుకోలేక పోయాం. రాజకీయ చర్చలేమీ జరగలేదు. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు ” అని వివరించారు. అంతకు ముందు మంగళవారం ఉదయం భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నితీష్ కుమార్‌కు రాష్ట్ర మంత్రి అశోక్ చంద్ర పండా, బీజేడీ ఉపాధ్యక్షులు దేవీ ప్రసాద్ మిశ్రా స్వాగతం పలికారు.

నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్‌లకు తమ పార్టీలు ఉన్నందున 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ప్రాంతీయ పార్టీల సమైక్యతకు కలిసి పనిచేయడానికి రాజకీయంగా చర్చిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నితీష్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, పట్నాయక్ మాత్రం అటు బీజేపీకి , ఇటు కాంగ్రెస్‌కు మధ్య సమానదూరం పాటిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక రాజకీయ నేతలను ఒకే తాటిపైకి తీసుకురాడానికి విపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు నితీష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ , సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌తోసహా అనేక మంది విపక్ష నేతలను నితీష్ కలుసుకుని చర్చించారు. గత నెల మార్చిలో మమతాబెనర్జీ నితీష్‌తో భేటీ అయ్యారు.

బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపదు : బీజేపీ వ్యాఖ్య
నితీష్, నవీన్ పట్నాయక్ భేటీ నేపథ్యంలో ఒడిశా బీజేపీ ప్రధాన కార్యదర్శి పృధ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ ఈ సమావేశం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపదని వ్యాఖ్యానించారు. నవీన్ పట్నాయక్ తనకు ఏది వాంఛనీయమో అదే చేస్తారని, థర్డ్ ఫ్రంట్‌లో చేరడం సహాయమౌతుందని భావిస్తే చేరతారని, సహాయపడదనుకుంటే చేరబోరని వ్యాఖ్యానించారు.

ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం నితీష్ యత్నం : బీజేడీ
బీజేడీ ఎమ్‌ఎల్‌ఎ సౌమ్య రంజన్ పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “ దేశంలో సంస్కరణాత్మకమైన, ప్రత్యామ్నాయ ఫ్రంట్ అవసరమని కుమార్ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని నవీన్ పట్నాయక్‌తో నితీష్ చర్చిస్తారు. కానీ కాంగ్రెస్‌కు , బీజేపీకి సమానదూరం బీజేడీ పాటిస్తుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశారు ” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News