Wednesday, January 22, 2025

2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!

- Advertisement -
- Advertisement -

2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ కొంత ఆశాజనకంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు నితీశ్ కుమార్ కొద్ది కాలంగా శ్రమపడుతూ వస్తున్నారు. బహుశా 2019 ఎన్నికల తర్వాత మొదటి సారిగా విస్తృత స్థాయిలో ప్రతిపక్ష నేతలు భేటీ అవుతున్నారు.ఈ భేటీ ఆశించిన ఫలితాలు సాధించాలంటే ప్రధానంగా కాంగ్రెస్ వైఖరి పట్ల ఆధారపడి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లకు ఆ పార్టీ సిద్ధమైతేనే ఈ భేటీ ఏదైనా ఫలితాన్ని సాధించగలదు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లుగా ఒక్కొక్క రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీకి సహకరించేందుకు కాంగ్రెస్ ముందుకు రావాల్సి ఉంటుంది. బీహార్, తమిళనాడులలో కూటమిలో జూనియర్ భాగస్వామిగా ఉండేందుకు సిద్ధపడినట్లు మిగిలిన రాష్ట్రాల్లో కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. అంతేగాని, తమ విధానాలను, వ్యూహాలను బలమైన ప్రాంతీయ పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉండదు. భారత దేశంలో ఎన్నికలలో ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక ద్వారానే చాలా వరకు రాజకీయ పార్టీలు నెగ్గి, అధికారంలోకి రాగలుగుతున్నాయి. 1984 లో ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓ ప్రత్యేక భావోద్వేగ పరిస్థితులలో తప్ప ఏ పార్టీ కూడా సొంతంగా స్పష్టమైన ఆధిక్యత సాధించడం గత అర్ధశతాబ్ది కాలంలో సాధ్యం కావడం లేదు.

ప్రస్తుతం నరేంద్ర మోడీ అజేయమైన నాయకుడిగా ఉన్నప్పటికీ, గత రెండు ఎన్నికలలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ బిజెపి ఓట్ల శాతం మూడో వంతుకు మించలేదు. అందుకనే, ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీచేస్తే అధికార పక్షాన్ని ఓడించవచ్చనే అభిప్రాయం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. 1977లో నాలుగు పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి, మరో కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని మొదటి సారిగా కాంగ్రెస్‌ను ఓడించ గలిగారు. 1984 తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు పార్లమెంట్‌లో మెజారిటీ సొంతంగా సాధించలేదు. ఈ వాస్తవాన్ని గ్రహించి, ఇతర పార్టీల తో సర్దుబాటు ధోరణులను అవలంబిస్తుంటే నేడు పార్లమెంట్‌లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితిలోకి ఆ పార్టీ వచ్చెడిది కాదు. ఒకనాడు దేశ రాజకీయాలు కాంగ్రెస్, -కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు మాదిరిగా ఉంటూ ఉండెడివి.

కానీ నేడు బిజెపి, బిజెపి వ్యతిరేక రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. ఈ వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ గుర్తించాలి. వాస్తవాలు గుర్తించి బిజెపి సర్దుబాటు ధోరణి అవలంబిస్తూ వచ్చిన కారణంగానే గతంలో వాజపేయి, తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వాలను ఏర్పర్చగలిగారు. అయితే, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దశాబ్దాల పాటు బిజెపితో కలిసి ప్రయాణించిన శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు ఆ పార్టీకి దూరమయ్యారు. చిన్న చిన్న ఉప ప్రాంతీయ పార్టీలు మినహా చెప్పుకోదగిన ప్రాంతీయ పార్టీలు ఏవీ ఆ పార్టీ వెంటలేవు. ఎన్‌డిఎ సహితం ఇప్పుడు ఉత్సవ విగ్రహంగా మారిపోయింది. గత తొమ్మిదేళ్లుగా ఎన్‌డిఎ కన్వీనర్ అంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. మొత్తంగా గల 543 లోక్‌సభ స్థానాలలో కనీసం 450 స్థానాల్లో బిజెపిలో ముఖాముఖిగా తలబడగలిగితే ఆ పార్టీని ఓడించవచ్చనే అభిప్రాయాన్ని నితీశ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.అయితే పాట్నా భేటీకి హాజరవుతున్న వివిధ పార్టీల మధ్య విరుద్ధ ప్రయోజనాలున్నాయి. వారు తమ తమ రాష్ట్రాలలో ఉమ్మడిగా పోటీకి అంగీకరిస్తారా?అన్నది ప్రశ్నార్ధకమే.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు. అదే విధం గా కాంగ్రెస్‌తో కలసి ప్రయాణించేందుకు ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, పంజాబ్, ఢిల్లీలలో అరవింద్ కేజ్రీవాల్ సిద్ధపడే సంకేతాలు కనిపించడంలేదు.బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్ లతో పొత్తుకు మమతా బెనర్జీ అంగీకరించే అవకాశం లేదు. ఇక, తెలుగు రాష్ట్రాలు, ఒడిశా వంటి రాష్ట్రాలలో ఈ కూటమి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. వామపక్షాలతో సర్దుబాట్లకు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు.

మహారాష్ట్రాలో ఎన్‌సిపి, శివసేన (థాకరే), కాంగ్రెస్ ఒక కూటమిగా ఉన్నప్పటికీ వీరి మధ్య సీట్ల సర్దుబాటు ఎంత సాఫీగా జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్ కూటమిలో చేరాలంటే పంజాబ్, ఢిల్లీ వెలుపల తగు సంఖ్యలో లోక్‌సభ సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది. అందుకు మిగిలిన పార్టీలు సుముఖత వ్యక్తం చేయగలవా? ఇక, ప్రస్తుతం తమ రాష్ట్రాలలో అధికారంలో ఉండి, ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్యం కానీ బిఆర్‌ఎస్, బిజెపి, వైసిపి వంటి పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశం లేదు.

మొన్నటి వరకు బిజెపి వ్యతిరేక స్వరం వినిపించిన కర్ణాటకలోని జెడిఎస్ ఇప్పుడు ఆ పార్టీ పట్ల సానుకూల ధోరణి వెల్లడిస్తున్నది. తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు కోసం సానుకూల సంకేతాలు ఇస్తున్నది. ఇక బిఎస్‌పి ప్రతిపక్ష కూటమిలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో 450 సీట్లు కాకపోయినా కనీసం 350 సీట్లలో బిజెపితో ముఖాముఖిగా తలబడే విధంగా పాట్నా భేటీ కార్యాచరణకు పూనుకోగలదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. మరో ప్రధానమైన లోపం బిజెపి వ్యతిరేకత, మైనారిటీల సంరక్షణ, అసహనం వంటి కొన్ని పడికట్టు పదాలు తప్ప నిర్దుష్టంగా బిజెపి వ్యతిరేక రాజకీయ, ఆర్థిక కార్యాచరణను ప్రతిపక్షాలు ప్రజల ముందుంచలేకపోతున్నాయి. కర్ణాటక, మరికొన్ని చోట్ల కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నాయి.

మరో ప్రధాన ప్రశ్న మోడీకి వ్యతిరేకంగా ఎవ్వరు? ఈ విషయం లో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం లేదు. ఒక బలమైన నాయకుడిని ప్రజల ముందుంచకుండా మోడీని ఓడిస్తామంటే అంత తేలికైన అంశం కాబోదు. కాంగ్రెస్ కేవలం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నది. అయితే, మిగిలిన ప్రతిపక్షాలు ఏవీ రాహుల్ నాయకత్వాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేవు. రాహుల్ గాంధీ ప్రకటనలు తరచూ వివాదాలకు కేంద్రం అవుతూ ఉండడంతో ఇతర ప్రతిపక్షాలను సహితం ఆయన ఇరకాటంలో పడవేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఉమ్మడి భేటీలు మాత్రమే కాకుండా ఉమ్మడి కార్యాచరణకు సహితం సిద్ధపడాలి. అందుకు ఒక విధంగా విశేష రాజకీయ అనుభవం, కార్యచతురత, సహనం గల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక విధంగా కాంగ్రెస్ ను ఇతర పార్టీలతో దగ్గరకు తీసుకెళ్లడానికి దోహదపడే అవకాశం ఉంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు పిలవగానే ఖర్గే ఫోన్ చేసి సానుభూతి, సంఘీభావం వ్యక్తం చేశారు. ఆ విధంగా ఖర్గే ఫోన్ చేయడం కాంగ్రెస్ నేతలకు ఆశ్చర్యంకలిగించింది. బహుశా ఇటీవల కాలంలో కేజ్రీవాల్‌తో ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆ విధంగా ఖర్గే సృష్టించిన సానుకూల వాతావరణం కారణంగా పాట్నా భేటీకి క్రేజీవాల్ హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. మొదటిసారిగా కాంగ్రెస్‌తో కలిసి ఒక వేదికను పంచుకోబోతున్నారు. ఇటువంటి సానుకూల ధోరణిని రాహుల్ గాంధీ ఇతర నాయకులు, రాజకీయ పక్షాల పట్ల ప్రదర్శింపగలగడం ప్రతిపక్షాలు దగ్గరయ్యేందుకు దారితీస్తుంది.

అయితే, ప్రతిపక్షాలు ఈ విధంగా భేటీ అవుతుంటే బిజెపి ప్రేక్షక పాత్ర వహిస్తుందని భావించలేము. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు పావులు కదుపుతుంది. మరికొందరు ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వల విసిరే అవకాశాలు లేకపోలేదు. మరోవంక, ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసిన ఎన్‌డిఎను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతం లో ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్, జెడిఎస్, టిడిపి వంటి పార్టీలను తిరిగి చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది. అయితే, అందుకు ఆయా రాష్ట్రాల్లో స్థానిక బిజెపి నేతల నుండే వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇప్పటి వరకు వరుసగా ఎన్నికలలో విజయాలు తీసుకొస్తున్న హిందుత్వ, మోడీ ఇమేజ్ లకు పరిమితులు ఉన్నాయని కర్ణాటక ఎన్నికలు నిరూపించాయి. ఢిల్లీలో లైంగిక వేధింపులపై రేజర్ల ఆందోళన, మణిపూర్‌లో హింసాకాండ, ఒడిశాలో రైల్వే ప్రమాదం పాలనాపరంగా ప్రభుత్వ అనిశ్చితిని వెల్లడి చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టి సారించాలని, స్థానికంగా బలమైన నాయకులను ప్రోత్సహించాలని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఏమేరకు బిజెపి నాయకత్వం గుణపాఠాలు నేర్చుకోగలదో చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News