న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం కులగణన సర్వే నివేదికను విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ అదే విధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన సర్వే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనివల్ల సామాజిక న్యాయం సిద్ధించడమే కాకుండా సామాజిక సాధికారత కార్యక్రమాలు నిర్వహించడానికి పటిష్టమైన పునాది ఏర్పడుతుందని సూచించింది. బీహార్ కులగణన సర్వే ఆ రాష్ట్రంలో 84 శాతం మంది ప్రజలు ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టిలుగా తేలిందని, జనాభా ప్రకారం ప్రజలకు వారి హక్కులను అందజేయాల్సిన అవరసం ఉందని తెలియజేసిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం లోని మొత్తం 90 సెక్రటరీలలో కేవలం ముగ్గురే ఒబిసికి చెందిన వారని, దేశ బడ్జెట్‌లో కేవలం 5 శాతమే వారు నిర్వహిస్తున్నారని ఉదహరించారు. అందువల్ల దేశం లోని కులగణాంకాలు తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఎక్స్ (ట్విటర్) లో హిందీలో రాహుల్ వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ దీనిపై స్పందిస్తూ వాస్తవానికి యుపిఎ 2 ప్రభుత్వం ఇలాంటి కులగణన సర్వేను ఎప్పుడో పూర్తి చేసిందని, కానీ ఆ ఫలితాలను మోడీ ప్రభుత్వం వెల్లడించలేదని విమర్శించారు. బీహార్ ప్రభుత్వం కులగణన సర్వే ఫలితాలను విడుదల చేయడాన్ని అభినందిస్తూ కర్ణాటక వంటి ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాలు కులగణన సర్వేలను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. బీహార్ ప్రభుత్వం కులగణన సర్వే ఆ రాష్ట్రంలో సామాజికంగా వివిధ తరగతుల వాటాను సూచిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా జాతీయ స్థాయిలో కులగణన సర్వేను చేపట్టకుంటే , కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చేపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు దేశానికి అలాంటి కులగణన సర్వే అవసరమని, దానివల్ల జనాభా ఆధారంగా వారి ప్రాతినిధ్యం నిర్ణయించగలుగుతామని తెలిపారు. కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులగణన సర్వే చేపడుతుందని, దానికి తామెప్పుడూ అనుకూలంగానే ఉంటామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.