Sunday, December 22, 2024

బీహార్‌లో 16మంది ఇంజనీర్ల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీహార్‌లో గడచిన 15 రోజుల్లో పది వంతెనలు కూలిపోయిన పర్యవసానంగా రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్లు 16 మందిని సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బీహార్ అభివృద్ధి విభాగం కార్యదర్శి చైతన్య ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విషయంగా పరిగణిస్తున్నదని చెప్పారు. వంతెనల నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టర్ల జాడ తీస్తామని, వారిపై చర్య తీసుకుంటామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని శరణ్ జిల్లాలో గురువారం పదవ వంతెన కూలిపోయింది. గడచిన 24 గంటల్లో శరణ్ జిల్లాలో కూలిన మూడవ వంతెన అది. కూలిపోయిన పది వంతెనలు శివన్, శరణ్, మధుబని, అరారియా, తూర్పు చంపారణ్, కిషన్‌గంజ్ జిల్లాలో ఉన్నాయి. ‘అన్ని పాత వంతెనలపై సర్వే చేయాలని, తక్షణ మరమ్మతులు అవసరమైన వాటిని గుర్తించాలని బుధవారం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి (నితీశ్ కుమార్) అధికారులను ఆదేశించారు’ అని ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విలేకరులకు తెలియజేశారు. వంతెనలు కూలిపోవడంపై దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు.

కాగా, జూన్ 18 నుంచి బీహార్‌లో 12 వంతెనలు కూలిపోయాయని ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ‘జూన్ 18 నుంచి బీహార్‌లో 12 వంతెనలు కూలిపోయాయి. బీహార్‌లో ఈ సంఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇద్దరూ మౌనం వహించారు. సత్పరిపాలన, అవినీతి రహిత ప్రభుత్వం ప్రకటనలకు ఏమైంది?’ అని తేజస్వి ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి శాఖలో అవినీతి ఎంతగా ప్రబలిపోయిందో ఈ సంఘటనలు సూచిస్తున్నాయి’ అని తేజస్వి ఆరోపించారు. బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ ఒక వంతెన నిర్వహణ విధానాన్ని సిద్ధం చేసి, సాధ్యమైనంత త్వరగా తన ప్లాన్‌ను రూపొందించవలసిందిగా గ్రామీణ పనుల శాఖను కోరింది.

తేజస్వి యాదవ్ 15 నెలలకు పైగా గ్రామీణ పనుల శాఖను నిర్వహించినప్పుడుఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ఏమీ చేయలేదని రాష్ట్ర గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి విమర్శించారు. ‘పూర్వపు మహాఘట్‌బంధన్ ప్రభుత్వ హయాంలో 15 నెలలకు పైగా తాను ఈ మంత్రిత్వశాఖను నిర్వహించిన విషయాన్ని ఆర్‌జెడి నేత (తేజస్వి యాదవ్) గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆయన ఏమి చేశారు? ఈ సంక్షోభానికి పూర్వపు ఆర్‌జెడి సారథ్య బీహార్ ప్రభుత్వాన్ని, ఆయనను బాధ్యులను చేయాలి’ అని అశోక్ చౌదరి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News