ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయొద్దని మందలించినందుకు భర్తనే అంతమొందించింది ఒక భార్య. బీహార్ లోని ఖోడాబండ్ పూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
కూలీ పని చేసుకుని జీవించే మహేశ్వర్ రాయ్ (25)కి, రాణికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. రాణికి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసి, పోస్ట్ చేయడం అలవాటు. ఆమెకు ఇన్ స్టా పదివేలమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇంతవరకూ 500 రీల్స్ పోస్ట్ చేసింది. ఆదివారంనాడు మహేశ్వర్ తన అత్తవారింటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్య రీల్స్ చేస్తూండటంతో ఆమెను కోప్పడ్డాడు. దాంతో ఆగ్రహించిన రాణి, తన సోదరులతో కలసి భర్త మెడకు ఉరి బిగించి హత్య చేసిందని పోలీసులు చెప్పారు.
ఆదివారంనాడు మహేశ్వర్ కోసం అతని సోదరుడు రుడాల్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ ను ఎత్తిన రాణి సోదరుడు రుడాల్ ను నానామాటలూ తిట్టి ఫోన్ పెట్టేశాడు. అనుమానంతో తన తండ్రిని తీసుకుని రుడాల్… మహేశ్వర్ అత్తవారింటికి వెళ్లాడు. తాము వెళ్లేసరికి తన కుమారుడు మహేశ్వర్ మృతదేహాన్ని రాణి సోదరులు ఎక్కడికో తరలిస్తున్నారని, తాను అడ్డుపడటంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్నామని చెప్పారని తండ్రి రామ్ ప్రవేశ్ చెప్పారు. రామ్ ప్రవేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి, మహేశ్వర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు.