Saturday, November 16, 2024

పాటలతో మురిపించి నాలుగు రాష్ట్రాల్లో ఆరుగుర్ని పెళ్లాడాడు

- Advertisement -
- Advertisement -
పాటలతో మురిపించి నాలుగు రాష్ట్రాల్లో ఆరుగుర్ని పెళ్లాడాడు
బావమరిదికి చిక్కిన అంతర్రాష్ట్ర పెళ్లి కొడుకు

పాట్నా : బీహార్‌కు చెందిన చోటూ ఓ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ అందర్నీ అలరిస్తుంటాడు. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తుండేవాడు. అయితే నాలుగు రాష్ట్రాల్లోని ఆరుగురు యువతులు ఆయన పాటలకు ముగ్ధులై మనసు పారేసుకున్నారు. అంతేకాదు ఆ ఆరుగురినీ ఆయన పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. ఒక భార్యకు నలుగురు, మరోభార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడడం విశేషం.

చివరికి ఓ భార్య సోదరుడు ఈ గుట్టును కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంతర్రాష్ట్ర పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. సోమవారం సాయంత్రం కోల్‌కతాకు వెళ్లేందుకు జముయి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రెండోభార్య మంజు సోదరుడు వికాస్, మరో భార్యతో చోటూ ఉండడం చూసి పట్టుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2018లో తన కుమార్తె మంజూను చోటూ పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి కోబియా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి ఇద్దరు పిల్లలున్నారని తెలిపింది.

ఏడాదిన్నర కిందట మందులు తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్లిన చోటూ ఇంటికి తిరిగి రాలేదని ఆమె ఆరోపించింది. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన కళావతి దేవీని అతడు మొదట పెళ్లి చేసుకున్నాడని, వారికి నలుగురు పిల్లలున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు చోటూను ప్రశ్నించగా, నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నట్టు చోటూ చెప్పాడు. బీహార్ లోని చిన్వారియా , సుందర్‌కండ్ ప్రాంతాలకు చెందిన మహిళలతోపాటు జార్ఖండ్ లోని రాంచీ, సంగ్రాంపూర్, ఢిల్లీ, దేవ్‌గఢ్‌లకు చెందిన యువతులను పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్యలందరితో పిల్లలను కలిగి ఉన్నట్టు చెప్పారు. రెండో భార్య మంజూ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఫిర్యాదు చేశారని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News