న్యూఢిల్లీ : బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమనరీ పరీక్షల్లో అవతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం వేలాది మంది విద్యార్థులు పాట్నా లోని గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. వారిని అడ్డుకోవడానికి పోలీస్‌లు జలఫిరంగులు ప్రయోగించి, లాఠీ ఛార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. డబుల్ ఇంజిన్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు.
ఈ చలిలో విద్యార్థులపై జలఫిరంగులు ప్రయోగించడంం, లాఠీ ఛార్జి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండుసార్లు విద్యార్థులను చిత్రహింసలకు గురి చేసిందని మండిపడ్డారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్‌లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం మరిచిపోయిందన్నారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.