న్యూఢిల్లీ: జెడియు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా శనివారం నియమితులయ్యారు. శనివారం నాడిక్కడ జరిగిన జెడియు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా(స్పెషల్ కేటగిరి స్టేటస్) లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన జెడియు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటులో తమ పార్టీ పోషిస్తున్న ముఖ్య పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేసింది. జెడియు అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన శనివారం నాడిక్కడ సమావేశమైన జెడియు జాతీయ కార్యవర్గం ధరల పెరుగుదల, నిరుద్యోగతను దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలుగా పేర్కొంది. వీటిని పరిష్కరించడానికి కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోగలదన్న విశ్వాసాన్ని తన తీర్మానంలో జెడియు వ్యక్తం చేసిది. కేంద్ర పోటీ పరీక్షల విశ్వసనీయతను పరిరక్షించేందుకు నీట్ పేపర్ లీకేజీ కేసులను విస్తృతంగా దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని జెడియు కోరింది.
పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు బలమైన చట్టాలను పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం ఉందని జెడియు పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసీలకు రిజర్వేషన్లను 65 శాతం పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేయడంపై జెడియు ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయ పరిధి నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జెడియు తన తీర్మానంలో కేంద్రాన్ని కోరింది. కాగా..ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీని బీహార్‌కు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని జెడియు కేంద్రాన్ని కోరడం బిజెపితో సంత్సంబంధాల కొనసాగింపు కోసం నితీశ్ కుమార్ ఒక మెట్టు దిగినట్లుగా భావించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. బిజెపితో మంచి సంబంధాలు నెరపుతున్న సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలన్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజ్యసభలో జెడియు నాయకుడిగా కూడా ఆయన ఉన్నారు. బిజెపి నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలు రాబట్టడంలో సంజయ్ ఝా సఫలీకృతం కాగలరని,
అంతేగాక అస్థిరమైన సంబంధాలు గల రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ఆయన ఏర్పర్చగలరని పార్టీ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. జెడియు వర్కింగ్ ప్రెసడింట్‌గా నియమితులైన అనంతరం ఝా మాట్లాడుతూ బీహార్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం ఆసక్తిని కనబరుస్తున్నారని చెప్పారు. బీహార్‌కు ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలన్న తమ డిమాండును ప్రధాని నెరవేర్చగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన జెడియు కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర మంత్రులు లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, ఇతర సీనియర్ నీయకులు పాల్గొన్నారు.