బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్‌ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి అస్సాం లోని టిన్‌సుకియా వెళ్తున్న రైలు బుధవారం రాత్రి రఘునాథ్‌పుర్ స్టేషన్ సమీపంలో రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున రైల్వేశాఖ గురువారం ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున అందించనున్నట్టు తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను రక్షించడానికి స్థానికులు ప్రయత్నించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన రైలును పట్టాలపై నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌చౌబీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని మంత్రి అశ్వినీ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని పాట్నా లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నట్టు తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను, విపత్తు నిర్వహణ శాఖ , ఆరోగ్యశాఖ, బక్సర్, భోజ్‌పూర్ జిల్లా అధికారులతో మాట్లాడినట్టు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్ తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని ఉషాభండారి, ఆకృతి భండారి, అబూజైద్, నరేంద్రగా గుర్తించారు