ముంబై : మహానగరం ముంబైలో ఓ బైక్‌వాలా నడిరోడ్లపై ధూంధాం స్టంట్లకు దిగాడు. ట్రాఫిక్, జనం ఇతర ప్రపంచంతో నిమిత్తం లేనట్లుగా యూత్‌జోష్‌తో సాగిన ఈ యువకుడి బైక్ స్టంటు 13 సెకండ్ల వీడియోగా వెలుగులోకి వచ్చింది. చూసేవాళ్లకు ఒళ్లు కళ్లు తిరిగేలా చేసింది. ఏ రోడ్డుపై ఈ స్టంటు జరిగిందనేది తెలియలేదు. బైక్‌వాలా స్పీడుగా వెళ్లుతూ ముందటి చక్రాన్ని పైకి లేపడం ఆయన ముందు ఓ యువతి, వెనుక ఓ యువతి బిగియారా పట్టుకుని ఉండటం వీడియోలో కన్పించింది. యువకుడి చుట్టూ కాళ్లేసుకుని కూర్చుని ఉన్న యువతి ఆనందంతో కేరింతలు కొట్టడం , విక్టరీ సంకేతాలు చూపడం వంటి దృశ్యాలను ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో బంధించి సామాజిక మాధ్యమంలో పెట్టాడు.
దీనితో స్థానిక బికెసి పోలీసు స్టేషన్‌లో ఈ ముగ్గురిపై కేసు దాఖలు అయింది. బైక్ నడిపిన వ్యక్తి ఎవరనేది ఆచూకీ తెలుసుకుంటున్నామని ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. ఎవరికైనా ఈ త్రయం ఎవరు? అనేది తెలిసే తమకు సమాచారం పంపాలని పౌరులకు సూచించారు. వీరిపై ఫైన్‌కు ఫైన్ దీనితోపాటు కేసు తరువాత తగు విధంగా శిక్ష పడుతుందని వివరించారు. బైక్‌స్టంటుకు దిగిన వ్యక్తికి కానీ ముందు వెనుక ఉన్న యువతులకు కానీ హెల్మెట్లు కూడా లేవని వెల్లడైంది. ఈ స్టంట్‌కు దిగిన వ్యక్తిపై ప్రధాన కేసు పెట్టారు. కాగా ఇద్దరిపై రెచ్చగొట్టిన వారి పరిధిలో కేసులు దాఖలు చేశారు. 114 ఐపిసి పరిధిలో ఎఫ్‌ఐఆర్ రికార్డు చేశామని పోలీసు అధికారి తెలిపారు.