హిందూ సంఘాల జోక్యంతో అరెస్, బిజెపి పాలిత అసోంలో ఘటన
దిస్పూర్ : పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై నాటకం ప్రదర్శించినందుకు కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన బిజెపి పాలిత అసోం రాష్ట్రంలోని నౌగావ్ జిల్లాలో జరిగింది. బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బోరాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అసలు ఏంటా నాటకం?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా, తన సహ నటి పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయితుంది, నడి రోడ్డుపై బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య మాటామాటా పెరుగుతుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అందులో పిలుపునిస్తారు. ఇది హిందూ సంఘాలకు ఆగ్రహాన్ని తెప్పించింది.