బైక్ రైడర్లు ….హెల్మెట్ పెట్టుకోవడంలేదు
ట్రాఫిక్ కేసుల్లో భారీగా హెల్మెట్ జరిమానాలు
హైదరాబాద్‌లో 53,01,994 కేసులు నమోదు
వారం రోజుల్లో రాచకొండలో 19,866 కేసులు
హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో బైక్ రైడర్లు మొదటి స్థానంలో ఉంటున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ బాగా ఉండడంతో వేలాది మంది కార్లకంటే బైక్‌లపై ఆఫీసులకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని తమకు అనుకులంగా మల్చుకుంటున్న మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవారు. నిబంధనలు పాటించడంలేదు, బైక్‌ను నడిపే సమయంలో తప్పనిసరిగా ముందు, వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా కూడా బైక్ రైడర్లలో మార్పు రావడంలేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో వీరే ముందు ఉన్నారు. అత్యధికంగా హెల్మెట్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కువగా హెల్మెట్‌కు సంబంధించినవి ఉన్నాయి. భార్యభర్త బైక్‌పై వెళ్తున్నా ఒకరు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటున్నారు, వెనుక కూర్చున్న వారు ఎక్కువ శాతం హెల్మెట్ పెట్టుకోవడంలేదు.
చాలా వరకు కేసుల్లో వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోవడంలేదు, వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమలు చేస్తున్న నాన్ కాంటాక్ట్ పద్దతిలో జరిమానాలను వాహనదారుల ఇంటికి పంపిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 53,01,994 కేసులు నమోదు చేశారు. చాలా ప్రాంతాల్లో కుటుంబంతో పాటు బైక్‌పై వెళ్తున్నా కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. వారిని పోలీసులు సిసి కెమెరాల సాయంతో గుర్తించి జరిమానాలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ శివారులోని భైర్‌ఖాన్‌పల్లి గ్రామసమీపంలో తండ్రి, కుమారుడు కలిసి బైక్‌పై పోతుండగా బొలేరో వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు జరిమానాల కోసం మాత్రమే తమను ఆపుతున్నారని భావిస్తున్నారు తప్ప వారు మన ప్రాణాలు కాపాడేందుకు చెబుతున్నారని వినడంలేదు. కొందరు వాహనదారులు హాఫ్ హెల్మెట్ మాత్రమే ధరిస్తున్నారు. కొందరు అసలే హెల్మెట్ ధరించడంలేదు.
వారికి సిసిటివిలో చూసి ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు జరిమానాలు ఇంటికి పంపించినా మారడంలేదు. జరిమానా కూడా తక్కువ ఉండడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది యువకులు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో ట్రాఫిక్ పోలీసులు 8,42,653 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై 8,38,35,600 రూపాయలు జరిమానా విధించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో హెల్మెట్ పెట్టుకోని 19,866 కేసులు నమోదు చేసి రూ.36,45,300 జరిమానా విధించారు. వాహనదారులు జరిమానాలు కట్టేందుకు సిద్ధపడుతున్నారు తప్ప తమ ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చెబుతున్నారని మాత్రం ఆలోచించడంలేదు.
బైక్‌కు హెల్మెట్….
కొందరు వాహనదారులు హెల్మెట్‌ను బైక్‌కు సైడ్‌కు తగిలిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల 29వ తేదీన బైక్ వెళ్తున్న ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. పులిజాలా విజయ్(30), అనిల్ కుమార్(28) ఇద్దరు బైక్‌పై అత్తాపూర్ నుంచి కాటేదాన్ వైపు వెళ్తుండగా ఆరాంఘర్ అండర్‌పాస్ వద్ద బైక్ అదుపు తప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండా మార్గమధ్యలో విజయ్ మృతిచెందాడు. వీరు హెల్మెట్‌ను ధరించకుండా బైక్‌కు సైడ్‌వైపు పెట్టుకున్నారు. హెల్మెట్ ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఫ్యామిలీతో వెళ్తున్నా….
చాలామంది బైక్‌లపై కుటుంబంతో పాటు వెళ్తున్నా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలేదు, బైక్ రైడర్, వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడంలేదు. ఇలా వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకున్న భర్త ప్రాణాలతో బయటపడుతున్నా, వెనుక కూర్చున్న భార్య మాత్రం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతిచెందుతున్నారు. ఇలా సంఘటనలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషరేట్ల పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలా వెళ్తున్న వారిని పోలీసులు ఆపి కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా హెల్మెట్ పెట్టుకునేందుకు మొగ్గు చూపడంలేదు. అలాగే వాహనదారులు స్టాండర్డ్ హెల్మెట్ ధరించాలని,
నాసిరకమైన వాటిని ధరిస్తే ప్రాణాలు కోల్పోతారని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పిలియన్ రైడర్ తప్పనిసరిగా ధరించాలి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ఐటి కంపెలనీలు ఉండడంతో ప్రతి రోజు వేలాది మంది ఉద్యోగులు బైక్‌లపై వచ్చిపోతున్నారు, వారిలో చాలా మంది హెల్మెట్‌లను ధరించడంలేదని, వెనుక కూర్చునే పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. వాహనదారుల రక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని చెబుతున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ పెట్టుకోకపోవడంవల్లే తలకు గాయాలయి మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు రక్షించుకోవాలని కోరారు.