Tuesday, April 1, 2025

ప్రధాని మోడీ, ఖతార్ అమీర్ ద్వైపాక్షిక చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థని మంగళవారం ఢిల్లీలో విస్తృత శ్రేణిలో చర్చలు జరిపారు. ఉభయ దేశాల మధ్య ‘ప్రగాఢ, సాంప్రదాయక అనుబంధాన్ని’ మరింత పటిష్ఠం చేస్తూ వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ఇంధన శక్తి, ప్రజల మధ్య సంబంధాలపై దృష్టితో ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా భారత్ ఖతార్ సంబంధాలను మార్చడానికి ఉభయ నేతలు నిర్ణయించారు. వారు పరస్పర ప్రయోజనకర ‘ప్రాంతీయ, ప్రపంచ సమస్యల’పై కూడా అభిప్రాయాలు తెలుసుకున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) వెల్లడించింది.

ప్రధాని మోడీ ఆహ్వానంపై ఖతార్ అమీర్ రెండు రోజుల పర్యటన చోటు చేసుకున్నది. ఇది ఆయనకు రెండవ భారత పర్యటన.ఆయన లోగడ 2015లో భారత్‌ను సందర్శించారు. ఆయన పర్యటన ‘వృద్ధి చెందుతున్న మన బహుళ దశ భాగస్వామ్యానికి మరింత ఊపు’ ఇస్తుందని ఎంఇఎ సోమవారం ఆయన పర్యటన ప్రారంభం కాక ముందు తెలియజేసింది. మంగళవారం ఉదయం ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో సాంప్రదాయక గౌరవ వందనం సమర్పించారు. ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. ప్రధాని మోడీ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత మోడీ, అమీర్ హైదరాబాద్ హౌస్‌లో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుపై భారత్, ఖతార్ మంగళవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోడీ, ఖతార్ అమీర్ సమక్షంలో ఖతార్ ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థని, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పత్రాలు మార్చుకున్నారు. ‘భారత్, ఖతార్ ప్రగాఢ, సాంప్రదాయక అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థని మంగళవారం హైదరాబాద్ హౌస్‌లో విస్తృత శ్రేణిలో చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధన శక్తి, పెట్టుబడులు, సృజన, టెక్నాలజీ, ఆహార భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలపై దృష్టితో భారత్ ఖతార్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు నిర్ణయించారు.

వారు పరస్పర ప్రయోజనకర ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైకూడా అభిప్రాయాలు పరస్పరం తెలియజేసుకున్నారు’ అని ఎంఇఎ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో వెల్లడించారు. భారత్, ఖతార్ మధ్య ప్రగాఢ చారిత్రక మైత్రి, విశ్వాసం, పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలు ఉన్నాయని, ఇటీవలి సంవత్సరాల్లో వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన శక్తి, టెక్నాలజీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా రెండు దేశాల మధ్య అనుబంధం దృఢతరం అవుతూనే ఉందని ఎంఇఎ అంతకుముందు తెలియజేసింది. ఉభయ నేతలు హైదరాబాద్ హౌస్‌లో చర్చలు జరుపుతుండగా, ఈ ‘ప్రత్యేక భారత్ ఖతార్ భాగస్వామ్యం’లో ‘కొత్త మైలురాయి’ నెలకొనబోతున్నదని ఎంఇఎ ‘ఎక్స్’ పోస్ట్‌లో సూచించింది.

భారత్, ఖతార్ మధ్య రెండు పన్నుల విధానాన్ని తప్పించేందుకు, ఆదాయంపై పన్నుల విషయంలో ద్రవ్యం ఎగవేతను నివారించేందుకు సవరించిన ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ హౌస్‌లో ఒప్పందాల మార్పిడి కార్యక్రమంలో ప్రకటించారు. ఖతార్ ప్రధాని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరస్పరం ఒప్పందం అందజేసుకున్నారు. ప్రధాని మోడీ నిరుడు ఫిబ్రవరిలో గల్ఫ్ దేశం ఖతార్‌ను సందర్శించిన దాదాపు ఏడాది తరువాత ఖతార్ అమీర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు అరుదైన మర్యాదపురస్సరంగా ప్రధాని మోడీ సోమవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఖతార్ అమీర్‌ను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News