ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ బుధవారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో బిలావల్ పాత్రపై గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు దీంతో తెరపడింది. అధ్యక్ష నివాసం ఐవాన్ ఇ సదర్‌లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో 33 ఏళ్ల బిలావల్ చేత విదేశాంగ మంత్రి పాక్ అధ్యక్షుడు ఆలిఫ్ అల్వి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)కి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు. 2018లో జాతీయ పార్లమెంట్‌కు మొదటిసారి ఎన్నికైన బిలావల్‌కు అత్యంత కీలకమైన విదేశాంగ మంత్రి పదవి దక్కడం విశేషం. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కడం కూడా ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌కు మూడుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్. 2007లో రావల్‌పిండిలో ఒక రాజకీయ ర్యాలీలో జరిగిన బాంబు దాడిలో బేనజీర్ భుట్టో మరణించారు. బేనజీర్ తండ్రి మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో.