Monday, December 23, 2024

బిల్కిస్ బానో కేసులో ఖైదీలకు క్షమాభిక్ష చెల్లదు

- Advertisement -
- Advertisement -

గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదు
11 మంది ఖైదీలు జైలుకెళ్లాల్సిందే
మహారాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంది
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గోద్రాలో 2002 జరిగిన అల్లర్ల సందర్భంగా బిల్రిస్ బానో అనే గర్భిణి మహిలపై అత్యాచారం జరిపి ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేసిన కేసులో కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన త్తర్వులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఖైదీల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. బాధితురాలు బిల్కిస్ బానో, మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై విచరణ జరిపిన ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 12న రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం ఆదేశాల మేరకు విడుదలైన 11 మంది ఖైదీలు రెండు వారాలలో లొంగిపోయి జైలుకు వెళ్లాలని ధర్మాసనం ఆదేశించింది.

అంతేగాక బెయిల్‌పై ఉండి మళ్లీ తాజాగా క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కూడా ధర్మాసనం ఆదేశించింది. బిల్కిస్ బానో కేసు విచారణ మహారాష్ట్రలో జరిగిందని, క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవలసింది మహారాష్ట్ర ప్రభుత్వమే తప్ప గుజరాత్ ప్రభుత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ ప్రభుత్వం జారీచేసిన క్షమాభిక్ష ఉత్తర్వులు చట్ట విరుద్ధమైనవని, ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తులను స్వీకరించడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్ ప్రభుత్వం చేజిక్కించుకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేరం జరిగిన ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది..లేక నేరస్థులు ఖైదు చేసిన ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అన్నది క్షమాభిక్షకు కొలమానం కాదని, విచారణ జరిగి నేరస్థులకు శిక్ష పడిన రాష్ట్రంలోనే వారికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం వేరే రాష్ట్రం అధికారాలను కైవసం చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధర్మాసనం పేర్కొంది. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి చట్టాన్ని ఉల్లంఘించడానికి 2022 మే 13న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉపయోగించుకున్నారనడానికి ఇది విస్పష్టమైన ఉదాహరణగా జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. 2022 మే 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులలో ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తులపై పునరాలోచన చేయాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించిందని కాని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను గుజరాత్ ప్రభుత్వం అతిక్రమించిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఖైదీలు కొంత సమాచారాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకు వచ్చారని, మహారాష్ట్ర ప్రభుత్వానికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్న విషయాన్ని దాచిపెట్టారని ధర్మాసనం తెలిపింది. గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరిగి 59 మంది కరసేవకులను సజీవ దహనమైన ఘటన తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరిగిన సందర్భంగా 2002 మే 3న దహోద్‌లో హింసాకాండ చెలరేగింది.

గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మూకలు ఆమె మూడేళ్ల కుమార్తె సలేహాతోపాటు మరో 13 మందిని చంపివేశాయి. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మంది ఖైదీలు..జస్వంత్ యలై, గోవింద్ నై, శైలేష్ భట్, రాధేశ్యాం షా, బిపిన్ చంద్ర జోషి, కేశర్‌భాయ్ బోహనియా, ప్రదీప్ మోర్ధియా, బాకాభాయ్ బోహానియా, రాజూభాయ్ సోని, మిటేష్ భట్, రమేష్ చందనను ముందుగానే విడుదల చేశారు. 15 ఏళ్ల కారాగార శిక్షను ముగించడంతోపాటు వారి వయసును, వారిలో వచ్చిన పరివర్తనను దృష్టిలో ఉంచుకుని 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుద ల చేసింది. వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను బిల్కిస్ బానోతోపాటు సిపిఎం నాయకురాలు సుషాషినీ అలీ, స్వతంత్ర జర్నలిస్టు రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ రూప్ రేఖా వర్మ, టిఎంసి నాయకురాలు మహువా మొయిత్రతోసహా పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బిల్కిస్ బానో పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పును వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News