Thursday, January 23, 2025

బిల్కిస్ బానో కేసు… దోషుల విడుదలపై సుప్రీంలో సవాల్

- Advertisement -
- Advertisement -

Bilkis Bano Case: Petition against Convicts in SC

న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి విడుదల కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. వారి విడుదలను రాజకీయ పార్టీలు ఖండించాయి. తాజాగా ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఆ దోషులకు రెమిషన్ మంజూరు చేసి, విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. మహిళా హక్కుల కార్యకర్తలు ఈ పిటిషన్ వేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసని, దోషులకు రెమిషన్ మంజూరు వెనుక ఉన్న నిబంధనలను మాత్రమే తాము సవాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందకు సుప్రీం అంగీకరించింది. 2002లో గోద్రారైలు దహన కాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది.

బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో గోద్రా సబ్ జైలు నుంచి ఇటీవల విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ బానో, ఆమె భర్త తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Bilkis Bano Case: Petition against Convicts in SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News