Sunday, January 5, 2025

రేపిస్టులు సంస్కారవంతులా?

- Advertisement -
- Advertisement -

Bilkis Bano case convicts released by gujarat govt

ఆ పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావటంతో కోర్టు జీవితకాల శిక్ష విధించింది.బేటీ పఢావోబేటీ బచావో అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ర్టం, మోడీ కనుసన్నలలో నడిచే గుజరాత్ బిజెపి ప్రభుత్వం సత్ప్రవర్తన పేరుతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్వేచ్ఛ నిచ్చి వారిని సభ్యసమాజంలోకి వదిలింది. అదే రోజు నరేంద్ర మోడీ మహిళా సాధికారత గురించి కూడా ఎర్రకోట మీద నుంచి ఆజాదీ కా అమృతోత్సవ ప్రవచనాలు పలకటం కొసమెరుపు. ఖైదీల విడుదలకు ఏకగ్రీవ సిఫార్సు చేసిన పదిమంది కమిటీలో ఇద్దరు బిజెపి మహిళలు కూడా ఉన్నారు. జైలు నుంచి వెలుపలికి రాగానే నేరస్థులకు పూలదండలు వేసి, మిఠాయిలు పంచి ఘనమైన స్వాగతం పలికారు. కొందరు మహిళలైతే వారికి వీర తిలకాలు దిద్దారు. విశ్వగురువుల ఏలుబడిలో మన పుణ్య భారత దేశం ఎలా మారుతోందో కదా! ఆహా మేకిన్ ఇండియాలో ఎలాంటి సరకు తయారవుతోంది !

ఇదంతా గోధ్రా బిజెపి ఎంఎల్‌ఎ సికె రావుల్జీ సమక్షంలో జరిగినట్లు వార్తలు. అంతేకాదు “వారు బ్రాహ్మలు, బ్రాహ్మలకు మంచి సంస్కా రం (విలువలు) ఉంటుందని తెలిసిందే. కొంత మంది దుష్ట వాంఛ ప్రకారం వారిని శిక్షించాలని వారి మీద నేరాన్ని నెట్టి ఉండవచ్చు” అని కూడా సదరు ఎంఎల్‌ఏ సెలవిచ్చారు. దీని మీద దేశమంతటా తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వెలువడినా ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా అతన్ని కనీసం మందలించిన వారు కూడా లేరు. ఇదంతా ఒక ఎత్తయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారిని విడుదల చేశారంటూ మహారాష్ర్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో చెప్పారు. 2002లో జరిగిన గోధ్రా అనంతర మారణకాండలో భాగంగా జరిగిన దుండగాల్లో బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం, మూడు సంవత్సరాల కుమార్తెతో సహా 14 మంది కుటుంబ సభ్యుల హత్యకేసులో ముంబై సిబిఐ కోర్టు 2008 జనవరి 21న నిందితులకు శిక్ష విధించింది. దాన్ని హైకోర్టు కూడా నిర్ధారించింది. ఈ కేసులో ఏడుగురు బిల్కిస్ బాను కుటుంబ సభ్యులను హతమార్చారు. మరో ఏడుగురు బంధువులను కూడా చంపారని బిల్కిస్ చెబుతుండగా వారు కనిపించటం లేదని పోలీసులు చెప్పారు. వారి ఆచూకీ ఇంతవరకు లేదు. దారుణం జరిగినపుడు 21 ఏండ్ల బిల్కిస్ ఐదు నెలల గర్భవతిగా ఉంది. తమ శిక్షను తగ్గించాలని నేరస్థులు దాఖలు చేసిన పిటీషన్ను విచారించిన సుప్రీంకోర్టు సదరు వినతిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచింది. దాన్ని అవకాశం గా తీసుకొని విడుదల చేశారు.

అత్యాచార నేరగాండ్లను విడుదల చేయాలని తాము ఆదేశించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ గురువారం నాడు చెప్పారు. నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై స్పందిస్తూ “నిర్దేశిత విధానం ప్రకారం శిక్షను తగ్గించే వినతిని పరిశీలించండి అని మాత్రమే కోర్టు చెప్పింది. దాని మీద బుర్రను ఉపయోగించారా లేదా అన్నదాన్ని చూడాల్సి ఉంది. విధానం ప్రకారం అనేక మందికి ప్రతి రోజు శిక్షలు తగ్గిస్తున్నారు” అన్నారు. రెండు వారాల తరువాత తదుపరి విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, పదకొండు మంది నేరస్థులను కక్షిదారులుగా చేస్తూ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. బిల్కిస్ బాను కేసులో నేరగాండ్ల శిక్ష తగ్గించి విడుదల చేసిన అంశాన్ని మహారాష్ర్ట శాసన మండలిలో ఎన్‌సిపి ప్రస్తావించింది. ఈ అంశాన్ని సభలో చర్చించాల్సిన అవసరం లేదని బిజెపి నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతూ పద్నాలుగేండ్ల శిక్షను గడిపిన తరువాత వారిని విడుదల చేశారు. నేరగాండ్లు నేరగాండ్లే వారిని సన్మానించటం తప్పు, అలాంటి వాటిని సమర్ధించకూడదు అన్నారు. ఆ కేసులో నిందితులకు శిక్షలు విధించిన మాజీ జడ్జి ఉమేష్ సాల్వీ మాట్లాడుతూ శిక్ష తగ్గింపు చట్టబద్ధమే కానీ వారికి తగ్గించటం తగని పని అన్నారు. బిల్కిస్ బాను కావచ్చు, మరొకరు కావచ్చు రాజకీయాలు, భావజాలాలు, కాలాలకు అతీతంగా వారికి మద్దతునివ్వాలి. నిందితులకు శిక్షను తగ్గించటం మానవత్వం, స్త్రీత్వాలకే అవమానం అని బిజెపి నాయకురాలు కుష్బూ ట్వీట్ చేశారు.

ఈ కేసులో నిబంధనలకు తమకు అనువైన భాష్యం చెప్పి నేరగాండ్లను బిజెపి ప్రభుత్వ విడుదల చేసిందన్నది విమర్శ. వచ్చిన వార్తల ప్రకారం 1992 విధానం ప్రకారం తమ శిక్షను తగ్గించాలని నేరగాండ్లు గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు. 2014లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మానభంగం, హత్య ఉదంతాలలో శిక్షను తగ్గించకూడదంటూ గుజరాత్ సర్కార్ తిరస్కరించింది. తరువాత వారు గుజరాత్ హైకోర్టుకు వెళ్లగా శిక్ష విధించింది బాంబే హైకోర్టు గనుక తమ పరిధిలోకి రాదని పిటీషన్ కొట్టివేసింది. తరువాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నేరం జరిగింది 2002లో అప్పటికి 1992 శిక్ష తగ్గింపు నిబంధనలు అమల్లో ఉన్నందున ఇలాంటి కేసుల్లో గతంలో అనుసరించిన వాటిని పరిగణనలోకి తీసుకొని వారి అర్జీపై గుజరాత్ ప్రభుత్వమే మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నది కొందరి భాష్యం. ఆమేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశీలన కమిటీ నిర్ణయం మేరకు విడుదల చేశారని సమర్ధిస్తున్నారు. గురువారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ బుర్రను (వివేకాన్ని) ఉపయోగించారా లేదా అన్నదాన్ని చూడాల్సి ఉంది అన్నమాటలను గమనించాలి. నిజంగా సుప్రీంకోర్టు శషభిషలకు తావు లేకుండా తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ పిటీషన్ను పరిష్కరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించటాన్ని అవకాశంగా తీసుకొని నేరగాండ్లను విడుదల చేశారన్నది స్పష్టం. సిపిఎం నేత సుభాషిణీ ఆలీ మరికొందరు సుప్రీంకోర్టులో విడుదల నిర్ణయాన్ని సవాలు చేసినందున అసలేం జరిగింది, సుప్రీం ఏం చెప్పింది అన్నది విచారణలో వెల్లడికానుంది. ఈ ఉదంతంలో బిజెపి ఎంఎల్‌ఎ సికె రావుల్జీ తీరును పార్టీ ఇంతవరకు తప్పుపట్టనందున ఆ పార్టీ ఎలాంటిదో వెల్లడించింది. రేపిస్టులు బ్రాహ్మలని వారికి మంచి విలువలు ఉంటాయని చెప్పారు. శిక్షా కాలంలో వారు సత్ప్రవర్తనతో మెలిగారని కూడా కితాబు నిచ్చారు. సదరు ఎంఎల్‌ఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని ఇద్దరు బిజెపి ఎంఎల్‌ఎలలో ఒకరు. పదకొండు మంది రేపిస్టులలో ముగ్గురు బ్రాహ్మలు కాగా ఐదుగురు ఒబిసి, ఇద్దరు ఎస్‌సి, ఒక బనియా ఉన్నట్లు ది ప్రింట్ పత్రిక విలేకర్లు వెల్లడించారు. ఎవరు ఏ కులస్థులన్నది పేర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ కులంవారు ఎందరన్నది కాదు, వారు చేసిన దుర్మార్గం ఏమిటన్నది కీలకం. కశ్మీరులోని కథువా ఉదంతంలో రేపిస్టులకు బిజెపి ఎంఎల్‌ఎలు, మంత్రులు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ప్రభుత్వమే నిందితులకు రక్షణ ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి.

బిల్కిస్ కేసును విచారించిన మాజీ జడ్జి ఉమేష్ సాల్వీ ఒక టిబి ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా చెప్పారు. “ఎవరైనా హిందూత్వ గురించి మాట్లాడేవారు ఇలాంటి నీచమైన నేరానికి పాల్పడ్డవారిని ఈ విధంగా సత్కరిస్తారా? అది హిందూత్వను నిందించటమే. అది కానట్లయితే, రాజకీయ పక్షాలకు అలాంటి ఉద్దేశం లేనట్లైతే వ్యవస్థ శిక్షించిన వారి పట్ల అలా ప్రవర్తించరు. నేరగాండ్లు నేరానికి పాల్పడలేదని చెప్పటమే, న్యాయ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయటమే. ఈ పదకొండు మంది నేరగాండ్లకు స్వాగతం పలకటం తగనిపని. కొంత మంది ఇది హిందూత్వలో భాగం అనుకుంటున్నారు లేదా ఒక హిందువుగా ఇలా చేశారు. అది తప్పు. కొంతమంది వారు బ్రాహ్మలని చెబుతున్నారు, అలా చెప్పటం సరైంది కాదు. వారు కమిటీ గురించి ఏమి చెబుతారు? దాన్లో సభ్యులు బిజెపి నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరైనా కావచ్చు తేడా ఏముంటుంది. తొలుత వారు మానవమాత్రులుగా ఉండాలి, అది ముఖ్యం. ఈ కేసును విచారించిన జడ్జిని వారేమైనా అడిగారా? అలాంటిదేమీ లేదని నేను చెప్పగలను. కేసును విచారించింది సిబిఐ, అలాంటి ఉదంతాలలో రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర సలహా కోరాలి. వారా పని చేశారా, నాకు తెలియదు, కోరి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పింది? శిక్షను తగ్గించేటపుడు ప్రభుత్వం బాధితురాలిని అదే విధంగా నేరానికి పాల్పడిన వారినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విధంగా చేశారని నేను అనుకోవటం లేదు. విడుదలైన నేరస్థులు అపరాధ భావన వెలిబుచ్చారా లేదా క్షమాపణ కోరారా? వారు తమకు స్వాగతం పలకటాన్ని, పూలదండలు వేయటాన్ని అంగీకరించారు. దీన్ని చూస్తుంటే వారు చేసిందేమిటో, అపరాధభావంతో ఉన్నట్లు కనిపించటం లేదు” అన్నారు.
శిక్ష తగ్గింపు మీద సిఫార్సు కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఒక పెద్ద ప్రహసనం. పది మంది కమిటికీ జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు. పంచమహల్ జిల్లా ఎస్‌పి, గోధ్రా జిల్లా జడ్జి, గోద్రా జైలు సూపరింటెండెంట్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, బిజెపికి చెందిన ఎంఎల్‌ఎలు సికె రావుల్జీ, సుమన్ బెన్ చౌహాన్, గోధ్రా తాలుకా బిజెపి నేత సర్దార్ సింహ్ బారియా, గోధా బిజెపి మహిళానేత వినితాబెన్ లీలీ, బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు పవన్ సోనీ ఉన్నారు. ఈ కమిటీ ఏకగ్రీవంగా నేరగాండ్ల విడుదలకు సిఫార్సు చేసింది. 2012 నాటి నిర్భయపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దేశం పెద్ద ఎత్తున స్పందించింది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడింది. బిల్కిస్ బానుపై అత్యాచారం, నేరగాండ్ల విడుదలపుడు నిర్భయ మాదిరి నిరసన, స్పందన ఎందుకు వెల్లడికాలేదని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. బిల్కిస్ బాను ఒక మైనారిటీ మతానికి చెందిన వ్యక్తిగా చూడాలా లేక ఒక మహిళగా పరిగణించాలా అన్న ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. దేశంలో ముస్లిం విద్వేషాన్ని తీవ్రంగా రెచ్చగొడుతున్న పూర్వరంగంలో ఇలాంటి ప్రశ్న తలెత్తటం సహజం.

తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ఉండాలని కోరుతున్న వారిలో కొందరు హిజాబ్, బుర్ఖాలను ధరించే స్వేచ్ఛ తమకు ఉండాలని కోరుతున్న మహిళల డిమాండ్‌ను వ్యతిరేకిస్తుండటం ఒక సామాజిక వైరుధ్యమే కాదు, ఆందోళనకర పరిణామం. హిందూ బాలికల వైపు ముస్లిం కుర్రాళ్లు కన్నెత్తి చూసినా సరే ముస్లిం మహిళలపై అత్యాచారాలు చేసి కడుపులు చేయాలంటూ రెచ్చిపోయిన సాధ్వి విభానంద గిరి, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపురిలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు జరపాలంటూ బహిరంగంగా పిలుపు ఇచ్చిన మహంత భజరంగ మునిదాస్‌లు స్వేచ్ఛగా తిరుగుతున్న పవిత్ర నేల ఇది. కోర్టులో శిక్షలుపడిన నేరగాండ్లు సంస్కారవంతులని కితాబులిచ్చిన పాలకులు ఏలుతున్న గడ్డ ఇది. తోటి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నేరగాండ్లకు శిక్ష తగ్గించాలన్న బిజెపి శీలవతుల సంస్కారంతో భారత మాత మురిసిపోతున్నదా ?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News