Thursday, January 23, 2025

Bilkis case: బిల్కిస్… నువ్వు ఒంటరివి కాదు

- Advertisement -
- Advertisement -

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అన్నది ఆర్యోక్తి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది దాని సారాంశం. అర్దరాత్రి స్త్రీ స్వేచ్ఛగా సంచరించినప్పుడే దేశానికి స్వాతంత్య్రము వచ్చినట్లుగా భావించాలని మహాత్ముడు అన్న మాటలు నీటి మూటలుగానే నేటికి మిగిలిపోయినయ్. ప్రపంచంలో ఇప్పటి వరకు వేదనాభరితమైన, ఆవేదనాభరితమైన, వ్యవస్థీకృతమైన హింసను ఎదుర్కొంటున్న ప్రాణి, జాతి ఏదైన ఉందంటే ఈ భూమిపై అది స్త్రీ జాతి మాత్రమే. నిత్యం ఎక్కడో చోట, ప్రపంచంలో ఎదో మూలన స్త్రీలపై ఎదో ఒక రకమైన హింస జరుగుతున్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయ్, అలాగే ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ మహిళ అత్యాచారం చేయబడ్తుందనేది విశ్లేషకుల అంచనా. దీనిని బట్టి మహిళల రక్షణ కొరకు చేసిన చట్టాలు ఎంతమేరకు వారికి రక్షణ కల్పిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

జాతి ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు స్త్రీలు వంచితులుగానో, బాదితులుగానో మిగలడం అనేది నేటికి కొనసాగడం అత్యంత బాధ కల్గించే అంశం. ప్రతి వ్యక్తికి ఎన్నో కలలు, ఆశలుంటాయి కొత్త సంవత్సరం కొత్త ఆశలను మోసుకోస్తుందని ఆశపడ్డ గుజరాత్ లోని మైనారిటీలకు 2002 ఫిబ్రవరి నెల మతోన్మాదుల దాడితో ఉడికిపోయింది. ప్రాణాలు కోల్పోయినవారు కొందరు, మానాలు కోల్పోయిన వారు మరి కొందరు, సర్వస్వం కోల్పోయిన బాధితులు ఇంకొందరు. అలాంటి వారిలో బిల్కిస్ బానో కథ కడుపులో పేగులు మెలిపెట్టే సంఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది, కడుపులో పెరుగుతున్న పసి కందును కూడ చూడకుండా తనకల్ల ముందే కుటుంబం మొతాన్ని చంపి పదకొండు మంది రాక్షసుల్లాగా ఉన్మాదం నెత్తికెక్కి అత్యంత పాశవికంగా అమానవీయంగా అత్యాచారం చేయటం అంటే మొత్తం మానవ జాతికే కలంకితమైన సంఘటన అది. ఇటీవలే ఆ పదకొండు మందిని గుజరాత్ హైకోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టడం, వారికి అత్యంత ఘనంగా, దేశం కోసమో లేదా సరిహద్దులో శత్రు మూకలను తరిమిన సైనికులను సన్మానించినట్లుగా స్వాగతం పలకటం అంటే సమాజం ఎటుపోతుందో చీము నెత్తురు ప్రవహించే మనుషులుగా కాస్తైనా ఆలోచించాలి? బిల్కిస్ బానోకు జరిగిన పరాభవం నేపధ్యంలో సోదరుడు బిళ్ళ మహేందర్ సంపాదకత్వంలో వచ్చిన సంఘీభావ కవిత్వంలోకి ఒకసారి వెళ్లి వద్దాం.

వాళ్ళూ!/ ఆ పవిత్ర పాదాలకు నమస్కరించడం తోటే/ నాదేశ సంస్కారం గర్వంగా తలెత్తుకుంది/ నా మాతృ భూమి/ మానభంగపర్వం మర్చిపోయి/ పవిత్రతకు వాళ్లు మారు పేరని/ టెండర్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది/ ఇక అడుగడుగునా/ కీచకులు,/ దుశ్శాసనులు/ టెస్ట్ ట్యూబ్ బేబీల్లా / పుట్టుకొస్తారని వాగ్ధానం చేసింది ఈ దేశం!/ ఈ కవిత ఇబ్రహీం నిర్గుణ్ గారి చెరచబడ్డ మీ జన్మస్థానం శీర్షికలోనిది. చదవగానే ఎప్పుడో బాల్యంలో వచ్చిన ప్రతిఘటన సినిమాలోని ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రువులు చిందిస్తు రాస్తున్నా శోకంతో, మర్మస్థానం కాదది నీ జన్మ స్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం, శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే ఏమైపోతుంది ఈ సభ్యసమాజం, ఏమైపోతుంది ఈ భారత దేశం అన్న వేటూరి గారి ఈటెల్లాంటి మాటలు గుర్తుకొచ్చాయి. బిల్కిస్ బానో సంఘటన జరిగి రెండు దశాబ్ధాలు గడిచిపోయినవి, ఈ రెండు దశాబ్దాల కాలంలో అత్యాచారం చేయబడిన స్త్రీలు ఎంత మంది అనేది లెక్కేలేదు. ఇక బిల్కిస్ బానోకు న్యాయం జరుగుతుందని ఎలా ఆశించగలం. సమాజంలో సగభాగమైన స్త్రీలు మరొక సగభాగమైన పురుషులతో అణగదొక్కబడటమంటే ఒక జాతి మరొక జాతిని అంతరింపచేస్తున్నట్లుగానే భావించాలి.

ఇక ఇబ్రహిం గారి కవితలోకి వద్దాం ఆగష్టు 15, 2022 న బిల్కిస్ బానో కేసులో నిందితులుగా ఉన్న 11 మంది ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేయడం సంచలనం కల్గించింది. రెండు దశాబ్దాల అనంతరం, జైలు జీవితం గడిపిన వారు పునీతులు అయినట్లుగా భావించాలా? లేకా అస్సలు ఆ నేరంలో వారికి సంబంధం లేదా? అని ఆలోచించాలి. ఇదంతా ఒక ఎత్తైతే వారికి ఘనంగా సన్మానించి ఆహ్వానించటం మొత్తం మానవ జాతికే అవమానకర సంఘటన అది./ ఇన్సానియత్ సే జుదా అయిన తర్వాత/ ‘సర్ తన్ సే జుదా’ హింసా నినాదం కాదు/ మన్ తన్ సే జుదా అయిన తర్వాత/ అసహజమైనవన్నీ సహజమౌతాయి / కొందరి మనోభావాలకు మాత్రమే/ రాజ్యం పహార కాస్తుందంటే/ చేపల చెరువును దొంగజపపు కొంగ కాపలా కాస్తున్నట్టే / ముఖ్ సే ముఖడా జుదా కర్నేకా వక్త్ ఆగాయా / మెడకాయ మీద తలకాయ ఉన్న / ప్రతి మనిషీ తెలివిడిగా బ్రతకడం నేర్చుకోవాలె/ టీకా మందు శీర్షికతో ఉన్న కవితలోనివి పై వాక్యాలు ఇవి. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి జ్వలిత గారు వ్రాసిన కఠోరమైన వాస్తవాలు అవి. మతం ప్రాతిపదిక మీదనే విడిపోయిన తర్వాత ఇంకా గొడవెందుకు? అహింసా విధానం ద్వారా స్వేచ్ఛను పొందినంక హింసాత్మక ఘటనలెందుకు, మనస్పూర్తిగా విడిపోయిన తర్వాత మతోన్మాదమెందుకు, రాజ్యం కొందరికి మోదం, మరికొందరికి ఖేదంలా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు? ముఖం చూసి గుర్తుపట్టి వేరు చేసే మతోన్మాదం బయలుదేరింది.

ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని, కరోనాకు టీకా మందు కనిపెట్టినట్లుగానే మతోన్మాదులకు కూడా విరుగుడు మందు టీకా వుంటే బాగుండు అని సూచించటం మంచి ముగింపు. మతోన్మాదపు మరియు మూఢత్వపు మూర్ఖులకు ఏ టీకా మందు పని చేయదు, ఎందుకంటే మతం ఇప్పుడు ఫక్తు రాజకీయ రంగు పులుముకొంది కదా! ఊసరవెల్లి రంగులు మార్చుతున్నట్లు, పగటివేషాలు వేసే నాయకులపట్ల జాగ్రత్తగా ఉండకపోతే లౌకిక వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. / బిల్కిస్… నువ్వలా చూడకు/ నీ చూపులకు ఎగుర వేసిన జెండా / ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నది / నీలాగే / అచ్చం నీలాగే/ కాషాయపు ముడిలో చిక్కుకుని / స్వేచ్ఛకై నినదిస్తున్నది / మనదీ / కర్మ భూమి కదా బిల్కిస్/ గంజి తాగే నోటిలో ‘అమృతం’ కురుస్తుందా చెప్పు? / మగసిరిని బజార్లో ఎత్తుకొని / ఊరేగిస్తూ జేజేలు కొడుతున్న దేశం మనది / నీ కన్నీటి చుక్కల్ని ఎవరు తుడుస్తారు చెప్పు బిల్కిస్?/ పచ్చి గాయాల వాసన శీర్షికతో వున్న ఈ కవితను బిళ్ళ మహేందర్ గారు వ్రాసినది. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తను కోల్పోయి తనవారిని కోల్పోయి దిక్కు లేని పక్షిలా దిక్కులు చూస్తున్న బిల్కిస్ బానోకు అప్పటి వరకు వున్న ఆశ కాస్తా ఆగష్టు 15 న (స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా) ఆవిరైంది.

ఒక్క బిల్కిస్ బానోకు మాత్రమే కాదు బిల్కిస్ లాంటి బాధితులందరికి ఇది నిరాశ కల్గించే విషయం. కోర్టుమెట్లు ఎక్కితే న్యాయం జరుగుతుందా? అని ఆత్మ విమర్శ చేసుకునేలా చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం కల్గించిన ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో ఏం జరిగిందో అందరికి తెల్సిన విషయమే, స్త్రీ వివక్ష అనేది నేటికి కూడా కొనసాగటం దురదృష్టకరం దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుండి స్త్రీ స్వేచ్ఛ, మహిళా సాధికారత గూర్చి మరియు బేటీ బచావో, బేటీ పడావో అంటూ ప్రసంగించిన కొద్ది గంటల్లోనే బిల్కిస్ బానో అత్యాచార నిందితులు గుజరాత్ జైలు నుండి సత్ప్రవర్తన కల్గిన వ్యక్తులుగా విడుదలవడం అంటే ఈ దేశం జెండా కూడా పచ్చి గాయాల వాసనేస్తున్నది…!/ చెప్పే ఉంటావు అసలే మగాడివని / చెయ్యి అందించటమంటే / కరచాలనం కాదని / ఉక్కు పిడికిలిలో నలిపెయ్యడమని/ జీవితమంటే కలిసి నడవటం కాదని / బరాబరా ఊడ్చుకు పోవటం కావొచ్చని / నువ్వు చెప్పే ఉంటావు /సరిగా అర్ధం చేసుకోవటంలో/ కాలాతీతం చెయ్యవద్దనీ / పరోక్షంగా చెప్పే ఉంటావు/ నీ మైకంలో పడి / నేనే మనసు చెవులు మూసేసి ఉంటా! / అమృత మహోత్సవమంటే / స్వేచ్ఛ రెక్కలు విప్పుకుని / సమతావాదం ఆకాశానికి ఎగబాకుతుందని బొంకుతావు / నా రక్తంతో నాలుకలు తడుపుకున్న హైనాల్ని / జైలు గోడలు బద్దలు కొట్టించి బైటకు తీసుకొచ్చి / వీర తిలకాలు దిద్దుతావు / ఘర్ ఘర్ తిరంగా అంటే / ఒక్క వర్ణానికే ప్రతీకని/ ఆ వర్ణమూ పురుషుడేనని నిరూపించావుగా ! / ఎన్ని స్వతంత్య్రాలు వచ్చినా / అది మీ మగ సమాజానికే !!/ ఒక దేశం – ఒకే వర్ణం శీర్షికతో వున్న కవిత లోనివి పై వాక్యాలు.

ఈ కవితను ప్రముఖ రచయిత్రి వైష్ణవి శ్రీ గారు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేల వ్రాశారు. ఆడ-మగ ఎప్పుడు సమానం కాదని ప్రతి ఇంటి మీద జెండా ఎగిరినంత మాత్రాన స్వాతంత్య్రం రాలేదని ఎన్ని స్వేచ్ఛ స్వాతంత్య్ర దినోత్సవాలు వచ్చినా అవి మీ మగ వారికే అని అనటంలో నాకైతే వాస్తవమే అనిపించింది. మహిళలకు రక్షణ లేని, మహిళలకు రక్షణ కల్పించలేని స్వాతంత్య్రము ఎందుకు? ఆజాదికా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఈ డ్బ్బై ఐదు సంవత్సరాలుగా మహిళలకు ఏం ఇచ్చామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్క బిల్కిస్ బానో కేసునే ఉదాహరణగా తీసుకుంటే కోర్టు మెట్లెక్కని కేసులు ఎన్నో? నిర్భయ చట్టాలు దిశ చట్టాలు ఎన్ని వుంటే ఏం లాభం? ఏం తినాలో ఏం తినకూడదో? ఏ బట్టలు ధరించాలో వారే నిర్ణయిస్తే నిజంగా స్త్రీకి స్వేచ్ఛ మనం ఇస్తున్నట్లేనా? చదువు విశాలమైన ఆలోచనా దృక్పదానికి ఉపయోగపడాలి కాని నానాటికి మతముతో కూడిన అద్దాలు ధరించి చూడటం సంకుచితపు ఆలోచనకు నిదర్శనమే అవుతుంది. నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి అన్న వాక్యాలు నేటికి అమలులో ఉండటం మౌడ్యపు ఆలోచనా విధానం కాకపోతే ఏమిటి? అసలు స్వాతంత్య్రపు ఫలితాలు ఎవరు ఎక్కువగా అనుభవిస్తున్నారనేది అసలైన ప్రశ్న, స్కై బాబా గారన్నట్లుగా 75 వసంతాలు కాదు జాతి ఆవిర్భావం నుండి స్త్రీకి దక్కిందేమిటి? అడగడుగున అవమానాలు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, ఇవేగా చరిత్రకు సాక్ష్యాలు? కడుపులో పెరుగుతున్న శిశువు ఈ ప్రపంచాన్ని చూడకుండానే భ్రూణహత్యలు చేయటం ఘోరం.

కళ్ళ ముందున్న శిశువును తనకళ్ళ ముందే గోడకు కొట్టి చంపటం, కుటుంబ సభ్యులను తల మొండెం వేరుచేసి అత్యంత దారుణంగా చంపటం ఉన్మాదపు పరాకాష్ట సంఘటన అది. బిల్కిస్ బానోది రాతిగుండెకావొచ్చు, ధైర్యాన్ని, కసిని పెంచుకొని జీవితంపై కలుగుతున్న విరక్తి భావాన్ని దిగమింగుకొని రెండు దశాబ్దాల పాటు పోరాటం చేయటం అంటే మామూలు మాట కాదు, ఆ స్థానంలో ఎవరున్నా దాదాపుగా పిచ్చివారుగా మారుతారు. ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు కుటుంబ సభ్యులందరు కళ్ళేదుటె చంపబడ్డారు, ఆత్మవిశ్వాసంతో, స్వచ్చంద సంస్థల సహకారంతో పోరాడింది, ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటాను అన్నట్లుగా బిల్కిస్ నీకు జరిగిన అవమానం కంటే నిందితులు సత్పవర్తనతో జైలు నుండి విడుదల అవటం న్యాయస్థానాల మీద నమ్మకం పోయేలా చేసింది. ఫీనిక్స్ పక్షిలా లేచి నిలబడు, ధర్మం నీవైపు వుంది నీవు తప్పక గెలుస్తావ్ సత్యమేవ జయతే.

బిల్కిస్ నువ్వు ఒంటరివి కాదు దేశంలో హక్కుల కోసం స్వేచ్ఛ కోసం పోరాడే వారందరికి నువ్వు ఆదర్శం, నీ పోరాటం ఓ స్ఫూర్తి మంత్రం. న్యాయం చచ్చిపోయిన మానవత్వం ఇంకా బ్రతికేవుంది బిల్కిస్ నువ్వు ఒంటరివి కాదు అనేక గాయాల నినాదపు గొంతుకవి, కరుడు గట్టిన మతోన్మాద గుండెల మీద నిలబడి ఎగురుతున్న అనేక దు:ఖాల జెండావు. ఔను కుల, మతాలకతీతంగా బాధ్యత గల పౌరులుగా బిల్కిస్ బానోకు సంఘీభావం ప్రకటిద్దాం. గాయం ఎవరికైనా వచ్చేది రక్తమేగా, నష్టం ఎవరికి జరిగినా కలిగేది బాధే కదా అందుకే మనిషిగా మానవత్వంతో స్పందిద్దాం.

ఇక కవితా సంకలనం విషయానికొస్తే అక్కడక్కడ కొన్ని అచ్చు తప్పులు ఉన్నప్పటికి మొదటి కవితా దేశం రేప్ చేయబడింది వడ్డెబోయిన శ్రీనివాస్ గారితో మొదలుకొని చివరి కవిత (35 వది) క్షమాభిక్ష ఫణి మాధవి కన్నోజు గారితో ముగించబడింది. ఇంకా ఇందులో మహేజా బీన్, స్కై బాబా, డా.బండారి సుజాత తండ హరీష్ గౌడ్, అన్వర్, పల్లిపట్టు నాగరాజు, డా.పసునూరి రవీందర్ మొదలగు వారు తమదైన శైలిలో స్పందించిన తీరు బాగుంది. ప్రశాంతంగా జీవించే హక్కునివ్వండి పేరుతో బిల్లా మహేందర్ న్యాయం కావాలి పేరుతో ముందుమాట రాసిన కొండవీటి సత్యవతి గారు హెచ్చరిక పేరుతో ముందుమాట రాసిన స్కై బాబా పుస్తకానికి మరింత బలం చేకూర్చారు.

డా. మహ్మద్ హసన్
9908059234

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News