బిల్, మెలిండా గేట్స్ విడాకులు
దాతృత్వంలో కలిసి పనిచేస్తామని ప్రకటన
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వీరువురు విడాకులు తీసుకోనున్నట్టు సోమవారం ప్రకటించారు. ‘మా సంబంధంపై చాలా ఆలోచనలు, పరస్పరం చర్చలు చేసిన తర్వాత వివాహ బంధానికి ముగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని ట్విట్టర్ ద్వారా వారు ప్రకటించారు. ‘మేము పిల్లలను అద్భుతంగా పెంచాం, మేము నిర్మించిన ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం, మంచి జీవితాలను అందించేందుకు కృషి చేస్తోంది’ అని వారు పేర్కొన్నారు. జీవితం తరువాతి దశలో ఇకపై కలిసి ముందుకు సాగలేం, అయినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం దాతృత్వంలో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అన్నారు.
కొత్త జీవితం ప్రారంభించేందుకు గాను తమ కుటుంబానికి ప్రదేశం, గోప్యత కోరుతున్నామని అన్నారు. బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ఆయన ఆస్తుల విలువ 100 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. బిల్, మిలిండాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బిల్ గేట్స్, మిలిండా మొదట 1987లో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు భార్యాభర్తలుగా 1994లో అంగీకరించారు. అయితే 2019లో అత్యంత సంపన్నుడు, అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్, మకెంజీ బెజోస్‌లు కూడా విడాకులు తీసుకున్నారు. మకెంజీకి అమెజాన్‌లో 4 శాతం వాటా అంటే 36 బిలియన్ డాలర్లు ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు తన సొంత దాతృత్వ కార్యకలాపాలపై దృష్టిపెట్టారు.