కరోనాపై ప్రధాని ఇమ్రాన్‌తో చర్చలు
ఇస్లామాబాద్: గొప్ప దాతగా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం మొట్టమొదటిసారి పాకిస్తాన్‌ను సందర్శించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమయ్యారు. దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలతో పాటు దేశంలో పోలియో నిర్మూలనకు చేస్తున్న ప్రయత్నాలను గురించి బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన బిల్ గేట్స్ గౌరవార్థం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. అనంతరం గేట్స్ కరోనా వైరస్ కట్టడి కోసం ఏర్పాటు చేసిన నేషల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్(ఎన్‌సిఓసి)లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. సెంటర్ అధిపతి, ప్రణాళిక మంత్రి అసద్ ఉమర్‌తో ఆయన చర్చలు జరిపారు. పాకిస్తాన్‌లో గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్ల గురించి, జినోమ్ సీక్వెన్సింగ్ గురించి గేట్స్‌కు వివరించినట్లు ఎన్‌సిఓసి ఒక ప్రకటనలో తెలిపింది.