న్యూఢిల్లీ: సామూహిక హనానికి పాల్పడే ఆయుధాల సేకరణ కోసం నిధులు సమీకరణపై నిషేధాన్ని విధిస్తూ మంగళవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఇలాంటి కార్యక్రమాల కోసం నిధులు సేకరిస్తున్న వారి ఆస్తులను సీజ్ చేసే విధంగా కేంద్రానికి మరిన్ని అధికారాలు ఇవ్వనున్నారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సవరణ బిల్లును కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ప్రవేశ పెట్టారు. పెట్రో ధరలను నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. 2005 లోనూ డబ్లుయ ఎండీ బిల్లు పాసైనా అప్పుడు కేవలం ఆయుధాల ఉత్పత్తిని నిషేధిస్తూ మాత్రమే చట్టాన్ని చేశారు. ఆయుధాల సవరణ బిల్లుపై మంత్రి వివరణ ఇస్తూ డబ్లుఎండీల వ్యాప్తి, డెలివరీ వ్యవస్థల నియంత్రణ కోసం ఆంక్షలను విస్తరించినట్టు ఆయన చెప్పారు. తాజా బిల్లులో కొత్తగా 12ఎ సెక్షన్ జోడించారు. దాని ప్రకారం ఆయుధాల కోసం ఎవరూ ఆర్థిక నిధులను వెచ్చించరాదు.