గువాహటి: రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని అంతం చేసేందుకు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఒక బిల్లును అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం వెల్లడించారు. బిల్లు ముసాయిదాను న్యాయ శాఖ ప్రస్తుతం పరిశీలిస్తోందని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిచండానికి రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఒక బిల్లును తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల ఉత్తరాఖండ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)పై చట్టం చేయనున్నారని, ఆ బిల్లు గురంచి తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని శర్మ తెలిపారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టంపై అధ్యయనం జరిపి దాన్ని పూర్తిగా అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 28న మిగియనున్నాయి.