Wednesday, January 22, 2025

ప్రపంచ ఆర్థికవేత్తగా ఎదిగిన రవీందర్ రేనా

- Advertisement -
- Advertisement -

ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయంకృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా, ఆసియా, -పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా బోధన, పరిశోధనా రంగాల్లో రవీందర్ రేనా ప్రతిభను గుర్తించి ఆయా దేశాలు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఆయన ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పిహెచ్‌డి (గోల్డ్ మెడల్), ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఎ పూర్తి చేశారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్ ఎల్‌బి పూర్తి చేశారు. తమిళనాడు అన్నామలై విశ్వవిద్యాలయం లో బి.ఇడి. (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) పూర్తి చేశారు. కాకతీయ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో బిఎ పూర్తి చేశారు.

2011లో నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ పరిశోధకుడి అవార్డును అందుకున్నారు. 2012 లో అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది అవార్డు అందుకున్నారు. 2012 నుంచి 2022 వరకు విద్యా రంగంలో ఆయన అందించిన సేవలకు పలు అవార్డులు అందుకున్నారు.2022లో డర్బన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఉత్తమ పరిశోధకుడిగా గుర్తింపు లభించింది. 2023లో ఇంటర్నేషనల్ కౌన్సిల్‌ఫర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారిచే ఏకలవ్య అవార్డు అందుకున్నారు. 2023 ఒలింపస్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (యుఎ) అవార్డును అందుకున్నారు. ఆయన పరిశోధన, రచనల ఆధారంగా, అమెరికన్ హిస్టారికల్ సొసైటీ, అమెరికా వరల్డ్ హూ ఈజ్ హూ ఇంటర్నేషనల్‌లో ఆయన ప్రొఫైల్‌ను నమోదు చేసింది. ప్రపంచంలోని టాప్ 01% పరిశోధకులలో ఒకడు. డబ్లిన్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ లో అండర్ గ్రాడ్యుయేట్ (యుఎ) అవార్డు, గ్లోబల్ ఎకనామిక్స్ జడ్జిస్ ప్యానెల్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. అంతర్జాతీయ స్థాయి లో తెలంగాణ వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం.

రవీందర్ రేనా కరీంనగర్ జిల్లా, ఎర్రబెల్లి గ్రామంలో నిరుపేద రైతు కుటుంబానికి చెందిన చంద్రమౌళి, రాజమ్మ దంపతులకు సెప్టెంబర్ 18, 1969నాడు జన్మించారు. 1975 నాటి కాలం లో ఎర్రబెల్లి గ్రామం ఎలాంటి సౌకర్యాలు నోచుకోని పల్లె కనీసం బస్సు, కరెంటు, తాగు నీరు సౌకర్యం లేని గ్రామం. ఎర్రబెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. గురువులు రవీందర్‌కి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ప్రోత్సహించేవారు. గురువుల ప్రోత్సాహమే ఆయనలో పట్టుదల పెంచింది. కనీసం చదవడానికి కరెంట్ సౌకర్యం లేనప్పటికీ మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా కిరోసిన్ దీపం సహాయంతో మొక్కవోని దీక్షతో చదివారు. ఆ తర్వాత ఎనిమిదో తరగతి చదువుకునేందుకు గ్రామంలో పాఠశాల లేనందున ఎర్రబెల్లి నుండి భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల వరకు ప్రతి రోజు కాలినడకన వెళ్లి ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పూర్తి చేశాడు. 10వ తరగతి చదువుతున్నప్పుడు పుస్తకాలు, పరీక్ష ఫీజులు కట్టేందుకు డబ్బులు లేని సమయంలో తల్లి

వద్ద డబ్బులు లేవని గ్రహించి ఊళ్ళో కూలి పనులు చేసి పుస్తకాలు కొని చదివి పాసయ్యాడు. చదువుపై ఆయనకున్న ఆసక్తికి ఇది నిదర్శనం. హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి, ప్రాథమిక పాఠశాలలో సోమలింగం వంటి చాలా మంది ఉపాధ్యాయుల నుండి ప్రేరణ పొందారు. హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో బట్టల దుకాణంలో నెలకు 80 రూపాయల జీతంతో దినసరి కూలీగా పని చేస్తూ డిగ్రీ పాసయ్యారు. బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతోనే గడిచింది. తల్లి గ్రామంలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తల్లి కష్టాలు చూడలేక చలించిపోయారు, తనను నమ్ముకున్న కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చదువు సరైన మార్గమని, కష్టాలను అధిగమించేందుకు చదువు ఆయుధమని భావించారు. తర్వాత పైచదువుల కొరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్నచిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ పిఎచ్‌డి పూర్తి చేశారు.ఆయన ప్రతిభకు పిహెచ్‌డిలో గోల్డ్ మెడల్ రావడం విశేషం, ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఎ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బి, తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ నుంచి బిఇడి, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బిఎ పూర్తి చేశారు.

ఉన్నత చదువులు చదివి, అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నప్పటికీ ఆయనది ఎంతెత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం. బాల్యమంతా బాధలతోనే గడిచినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నించి విజయాలను సొంతం చేసుకున్నారు. మూర్తీభవించిన మానవత్వానికి మరో పేరు రవీందర్ రానే. పలు దేశాలలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ స్వదేశం పై మమకారంతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా శ్రీశ్రీ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా, న్యూఢిల్లీలోని స్పర్ష్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, తన కొడుకు, కుమార్తెను కూడా స్వదేశంలోనే చదివిస్తుండడం ఇది దేశంపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. బోధన, పరిశోధనలో 31 సంవత్సరాల అనుభవం. భారతీయ సేవా 5 సంవత్సరాలు; 26 ఏళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ప్రపంచ స్థాయి వేదికలపై పలు సామాజిక, ఆర్ధిక సమస్యలపై విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ 42 కంటే ఎక్కువ దేశాలు సందర్శించారు.ఎరిట్రియా, పాపువా న్యూగినియా, నమీబియా, దక్షిణాఫ్రికా, రష్యా, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో పని చేశాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీందర్ రానే జీవితం నిరుపేద విద్యార్థులకు ఆదర్శం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News