Thursday, December 12, 2024

మహిళలకు ఆలంబన ‘బీమా సఖి’

- Advertisement -
- Advertisement -

ఎల్‌ఐసి ఒక వినూత్న ప్రయోగం చేస్తోంది. ఏజెంట్ వ్యవస్థ ద్వారా వ్యాపారాన్ని సాగించే ఈ బీమా సంస్థ తమ వ్యాపార వృద్ధికి మహిళా సాధికారతను జోడిస్తోంది. 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పానిపట్ (హర్యానా)లో ఎల్‌ఐసి వారి విశేష మహిళా ఏజెంట్ వ్యవస్థ ‘బీమా సఖి’ని ఆరంభించారు. అదే కార్యక్రమంలో మొదటి బ్యాచ్ బీమా సఖిలకు నియామక పత్రాలు అందజేశారు. ఎల్‌ఐసి ఏజెంట్ అంటే తెలియనివారు ఉండరు. ఏ బీమా సంస్థలో పని చేసినా ఎల్‌ఐ సి ఏజెంట్ అని చెబితేనే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఏజెంట్‌గా పని చేసేందుకు కేవలం మహిళలతో కూడిన ఒక దళాన్ని ఆ సంస్థ తయారు చేస్తోంది. బీమా సఖిగా భారత స్త్రీలు బీమా పాలసీల సేకరణలో మగాళ్లతో పోటీపడనున్నారు. ఇప్పటికి మహిళలు బీమా ఏజెంట్లుగా ఉండవచ్చు. అయితే అందులో తమ భార్యల పేరు మీద ఏజెన్సీ తీసుకొని పనిచేసే ఉద్యోగ పురుషులే ఎక్కువ. పాలసీలకు, ఆఫీసుకు మగమనిషే తిరుగుతాడు. పాలసీదారు కూడా ఇతనే ఏజెంట్ అనుకుంటాడు. ఈ చాటుమాటు వ్యవహారం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఇతర ఆదాయవృత్తులు చేపట్టకూడదు. బీమాసఖి ద్వారా మహిళలే పూర్తిగా వృత్తి బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తోంది. స్త్రీలు ఆర్థికంగా నిలబడేందుకు, సొంతంగా వ్యాపార మెళకువలు పెంచుకునేందుకు ఇదెంతో ఉపయోగపడుతోంది. వాస్తవానికి బీమా ఏజెంట్ కావడం సులభమే. ఏజెంట్ నియామక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా వందల మంది తమ పేర్లను నమోదు చేసుకుంటుంటారు. 18 ఏండ్లు దాటి, పదవ తరగతి పాసైన వారెవరైనా అర్హులే. డెవలప్‌మెంట్ ఆఫీసర్ల ప్రధాన విధుల్లో ఏజెంట్ల నియామకం ఒకటి. వ్యాపారాన్ని బట్టి ఏజెంట్‌కు కమీషన్ ఉంటుంది. కాబట్టి ఏజెంట్ల సంఖ్య కంపెనీకి లాభమే కానీ భారంకాదు. ఏజెంట్‌కు ఏ బీమా సంస్థ ఉద్యోగుల మాదిరి జీతభత్యాలు ఇవ్వదు. ఏజెన్సీ తీసుకున్నాక పాలసీలు చేయించే శక్తిసామర్థ్యాలు లేనివాళ్లు తప్పుకోవచ్చు.దానికి బీమా సంస్థ ఎలాంటి అభ్యంతరం చెప్పదు. పాలసీ చేయిస్తే మొదటి సంవత్సరం ఆ ప్రీమియం సొమ్ములో 35% దాక కమీషన్‌గా లభిస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో 7.5% నుండి 5% కమీషన్‌ను పాలసీ ప్రీమియం చెల్లించినంతకాలం పొందవచ్చు. అలా పాలసీల అమ్మకం బట్టి ఆదాయం పెరుగుతుంది. సర్వీసు కాలాన్ని బట్టి రూ. 2 లక్షల దాక గ్రాట్యుటీ, వైద్యసదుపాయం లభిస్తాయి.
ఈ లెక్కలన్నీ చూస్తుంటే పట్టుదల గల మహిళలకు బీమా సఖి మంచి ఆదాయాన్ని చేకూర్చే అవకాశం ఉంది. పదవ తరగతి పూర్తి చేసిన 18 నుండి 70 మధ్య వయసు గల స్త్రీలు బీమా సఖికి అర్హులు. ఈ యోజనకు ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఎంపికైన వారికి తగిన శిక్షణతో పాటు మూడేళ్ల పాటు ఉపకార వేతనం లభిస్తుంది. ఇంతవరకు ఎల్‌ఐసి తమ ఏజెంట్లకు ఎలాంటి స్టైపెండ్ ఇవ్వలేదు. స్త్రీలను ఈవైపు మళ్లించేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. మొదటి సంవత్సరం నెలకు రూ. 7 వేలు, రూ. 6 వేలు, రూ. 5 వేలు వరుసగా రెండో, మూడో సంవత్సరానికి వీరికి ఇస్తారు. ఈ ఏడాది 25 వేల మందిని, మూడేళ్ళ కాలంలో 2 లక్షల బీమా సఖిలను ప్రభుత్వం నియమిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బీమా సఖిలకు ఎల్‌ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్లు అయ్యే అవకాశం కూడా ఉంది. నెలకు రెండు లేదా ఏడాదిలో 24 పాలసీలు చేస్తే వీరికి కమీషన్ చెల్లింపు జరుగుతుంది. పాలసీలు చేసినా, చేయకపోయినా స్టైపెండ్ మాత్రం నిరాటంకంగా లభిస్తుందని ఎల్‌ఐసి చైర్మన్ సిద్ధార్థ మహంతి అంటున్నారు. మూడేళ్ళ స్టైపెండ్ కాలం తరవాత వీరు తమ లక్ష్యాన్ని సాధించని యెడల బీమా సఖి నుండి తొలగించబడతారని ఆయన నిబంధనలు వివరించారు. నేడు సక్రియాత్మకంగా ఉన్న ఎల్‌ఐసి ఏజెంట్ నెలకు కనీసం రూ. 15 వేలు సంపాదిస్తున్నారు. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో సాటి స్త్రీని ప్రోత్సహించాలని ఆ ఉద్యోగులు బీమా సఖికే తమ పాలసీని ఇచ్చే అవకాశం ఉంది. విరామ సమయాల్లో గృహిణులు పెద్దగా శారీరక శ్రమపడకుండా పాలసీలు పొందవచ్చు. ఇంటర్‌నెట్ సౌకర్యం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఏజెన్సీ గురించి నలుగురికి తెలియజేసి వ్యాపారాన్ని పొందవచ్చు. ఇప్పటికే మహిళలు యూట్యూబర్లుగా విజయాలు సాధిస్తున్నారు. వంటల కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి చేరువై ఆదాయ మార్గాలను వెదుక్కుంటున్నారు. చీరల, దుస్తుల అమ్మకాలు కూడా ఆన్‌లైన్ వేదికగా మహిళా సారథ్యంలో సాగుతున్నాయి. ఇలాంటి అవకాశాలు నగర, పట్టణ స్త్రీలకు అనుకూలంగా ఉన్నాయి. బీమా సఖి మాత్రం దేశవ్యాప్తంగా, గ్రామీణ స్త్రీలకు కూడా మేలు చేస్తుంది. మన దేశంలోని 145 కోట్ల జనాభాలో కేవలం 52 కోట్ల మంది మాత్రమే జీవిత బీమా చట్రంలో ఉన్నారు. అంటే సగానికి పైగా దీనికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ సౌకర్యం పొందినవారిలో స్త్రీలు 36% మాత్రమే ఉన్నారు. బీమా వ్యాపారానికి ఇంకెంతో అవకాశం ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా జీవిత బీమా పాలసీ తీసుకుంటే నష్టమేమి ఉండదు. బీమా సఖిలను ప్రోత్సహించేందుకైనా చిన్నదో, పెద్దదో పాలసీ కొనేందుకు అందరు ముందుకొస్తే మహిళా సాధికారిత కొంతైన ముందుకు సాగుతుంది. అయితే బీమా సఖి ఎంపికలో అల్పాదాయ, దిగువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటే లక్ష్యం మరింత ఫలిస్తుంది.

బి.నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News