Monday, December 23, 2024

‘బింబిసార’ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు..

- Advertisement -
- Advertisement -

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్‌రామ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంగళవారం నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “ఎన్నో చందమామ కథలు విన్నాం, చదివాం. కొన్నింటిని మనం వెండి తెరపై చూశాం. తాతగారు చేసిన పాతాళ భైరవి, గులేబకావళి కథ, జగదేక వీరుని కథ, బాబాయ్ చేసిన భైరవ ద్వీపం, ఆదిత్య 369, చిరంజీవి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మా తరంలో తమ్ముడు చేసిన యమ దొంగ, రామ్‌చరణ్ చేసిన మగధీర, ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలు గమనిస్తే… అందమైన సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.

అలాంటి అందమైన గొప్ప చందమామ కథ ‘బింబిసార’ను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఆ సినిమాలను ఆదరించినట్లే ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఏడాది మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ వందవ పుట్టిన రోజు సంవత్సరంగా లెజెండరీ నటుడైన ఆయనకు ‘బింబిసార’ సినిమాను అంకితం చేస్తున్నాను” అని అన్నారు. దర్శకుడు వశిష్ఠ్ మాట్లాడుతూ.. “కొత్త దర్శకుడైన నేను చెప్పిన కథ విని నమ్మి ఈ సినిమా చేసిన నిర్మాత హరికి, ప్రతి నిమిషం నువ్వు చేయగలవు అని చెబుతూ ప్రోత్సహించిన నా బింబిసారుడు కళ్యాణ్‌రామ్‌కి థాంక్స్. ఆగస్ట్ 5న మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో థియేటర్స్‌లో చూస్తారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్తా మీనన్, క్యాథరిన్ తదితరులు పాల్గొన్నారు.

BIMBISARA Trailer Launches

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News