బర్మింగ్ హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. అయితే బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు.
అయితే చివరి రౌండ్‌లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం లభించింది.