Friday, November 22, 2024

సింఘు వద్ద మహిళల కోసం బయో టాయిలెట్లు

- Advertisement -
- Advertisement -

Bio-Toilets At Delhi Border For Women

ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ

న్యూఢిల్లీ: ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు వద్ద రైతు ఆందోళనలో పాలు పంచుకోవడానికి వచ్చే మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడం కోసం ఒక స్వచ్ఛంద సంస్థ రీసైకిల్డ్ మెటీరియల్‌ను ఉపయోగించి తయారు చేసిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేసింది. గత నవంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలనుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోని వివిధ ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని అక్కడే బైఠాయించి ఆందోళనను కొనసాగిస్తున్న విషయం తెలిసందే. అయితే ఈ శిబిరాల వద్ద పరిశుభ్రమైన టాయిలెట్లు, స్నానాల గదులు లేకపోవడంతో ఆందోళనలో పాలు పంచుకోవడానికి వచ్చిన చాలా మంది మహిళలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడం కోసం ‘బేసిక్‌షిట్’ అనే స్వచ్ఛంద సంస్థ సింఘు వద్ద బయో టాయిలెట్లను ఏర్పాటు చేసింది.

‘ ఆందోళన చేస్తున్న చోట మేము ఒక ప్రాజెక్టు చేయడం ఇదే మొదటి సారి. పూర్తిగా మలమూత్రాదులతో నిండిపోయిన ఇక్కడి ఓ వీధి చిత్రాన్ని ఎవరో నాకు పంపారు. అందుకే ఇక్కడికి వచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలని మేము నిర్ణయించుకున్నాం’ అని శానిటేషన్ అంశాలపై కృషి చేస్తున్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ అగర్వాల్ చెప్పారు. ప్రతి టాయిలెట్‌కు పదడుగుల గొయ్యి ఉంటుంది, దుర్వాసనను పోగొట్టడానికి రంపపు పొటు ్ట(సా డస్ట్), బొగ్గు (చార్‌కోల్)ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ గుంతలను రోడ్డుపక్కన తవ్వుతారు. రీసైకిల్డ్ మెటీరియల్‌ను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తారు. ఒక్కో టాయిలెట్‌కు దాదాపు 60 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఈ సంస్థ ఇప్పటికే ఇక్కడ ఒక టాయిలెట్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు వంద మంది మహిళలు, దివ్యాంగులు ప్రతి రోజూ ఈ టాయిలెట్‌ను ఉపయోగించుకుంటున్నారని అగర్వాల్ చెప్పారు. మరిన్ని టాయిలెట్లను ఏర్పాటు చేయడం కోసం ఈ సంస్థ విరాళాల సేకరణ కూడా మొదలుపెట్టింది. ఇలాంటి బయోటాయిలెట్‌ను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని తమ వెబ్‌సైట్‌లో అందుకు సంబంధించిన పలు డిజైన్లు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. గుంతలను తవ్వడానికి, టాయిలెట్లను ఏర్పాటు చేసుకోవడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బేసిక్‌షిట్ సంస్థకు చెందిన సహజ్ ఉమంగ్ సింగ్ చెప్పారు. అంతేకాదు తాము వాడేసిన నెయ్యి, నూనె ఖాళీ డబ్బాలను మూత్ర విసర్జన కోసం వాడడానికి రైతులు తమకు ఇచ్చారని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News