Tuesday, January 21, 2025

గ్రంథాలయాలకు జవజీవాలు

- Advertisement -
- Advertisement -

గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు. మారుతున్న కాలానుగుణంగా వాటిని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజ్ఞానం కోసం గ్రంథాలయాలను ఆశ్రయించి ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. గ్రంథాలయం ఇప్పుడు కంప్యూటర్లలోకి చేరింది. టాబ్లెట్, సెల్ ఫోన్‌లోకి అమరిపోయింది. కాని ఎంతమందికి అవి అందుబాటులో ఉన్నాయన్నది అనుమానమే. ప్రతి వ్యక్తికీ సొంతంగా ఇంటర్నెట్, కంప్యూటర్ దానికి కావలసిన హంగులు అన్ని సమకూర్చగలమా అనేది ప్రశ్న. డబ్బు కలిగినవాళ్ళ పిల్లలకే పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇక మధ్యతరగతి, పేద పిల్లలకు అందుతుందనేది పగటి కలే. ఇంటర్‌నెట్‌లో పుస్తకం చదవడం కన్నా లైబ్రరీలకు వెళ్లి పుస్తకాలు చదివే సంస్కృతి నేర్పాలి. అయితే ప్రస్తుతం దేశంలో, ముఖ్యంగా యువతరంలో గ్రంథాయల స్ఫూర్తి లోపించినట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వం గ్రంథాలయాలను పట్టించుకోవడం లేదు.

పాత పుస్తకాలకు రక్షణ లేదు. కొత్త పుస్తకాలు తెప్పించరు. ఒకవేళ తెప్పించినా 100%లో 30% నుండి 40% వరకు మాత్రమే కొత్త పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. తెప్పించిన పుస్తకాలలో వ్యాపారుల ఒత్తిడికి లొంగి అత్యంత ఉపయోగంలేని పుస్తకాలకే ఆర్డర్లు, ఈ పుస్తకాలను చూసే ఉద్యోగులు తగినంత మంది లేకపోవడంతో వాటిని చదువుకునే వారికి ఇవ్వడం కూడా తగ్గింది. గ్రంథాలయ సెస్ మాత్రం ప్రజల నుండి ఇంటింటి వసూలు చేయబడుతూనే ఉంది. అసలు ఈ విషయం ఇంటి పన్ను కట్టే ప్రజలకు తెలియడం లేదు. వారికి దగ్గరలో ఉన్న గ్రంథాలయాల్లో సరియైన వసతులు లేవు. ఏవో ఒకటి లేదా 2, 3 పేపర్లతో మాత్రమే సరిపెడుతున్నారు. ఇక కేంద్ర గ్రంథాలయాల్లో కొత్త కొత్త పుస్తకాలతో, కొత్త శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించే కంప్యూటరీకరణతో, అన్ని హంగులతో ఏర్పాటు చేసినా అవి సంపూర్ణంగా అభివృద్ధి చెందడం లేదు. అవి ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ముఖ్యంగా సంవత్సరం సిలబస్ మారుతుంటే దానికి సంబంధించిన ప్రభుత్వ పుస్తకాలు ప్రింట్ కాక, అందుబాటులోకి రాక సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

ప్రజలలో గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని తెలియజెప్పాలి. ఎక్కడో ఒక దగ్గర మీకు తెలిసిన గ్రంథాలయానికి వెళ్ళి చూడండి. వేలాది మంది విద్యార్థులు చెట్లకింద, నేల మీద కూర్చొని చదువుకుంటారు. ఎక్కువమంది ఇంట్లో చదువుకునే పరిస్థితి లేదు. సరియైన వసతులు లేవు. మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా? లేదా అనే ప్రశ్న ఒకటైతే అవి తెలుగుభాషలో దొరుకుతాయా అన్నది మరో ప్రశ్న? గ్రంథాలయాల్లో నూతనంగా ఏర్పడే మిత్రుల వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. కంప్యూటర్ వ్యవస్థ అభివృద్ధి చెందిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా గ్రంథాలయాలను అభివృద్ధి పరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు గ్రంథాలయాల ఉద్యమం ఓ చరిత్ర.

తెలుగులో గ్రంథాలయాల కోసం ఉద్యమం నడిపిన ప్రముఖులలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య, అనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగ వెంకటప్పయ్య. దేశంలో అతి పురాతన గ్రంథాలయం. ఇలా గ్రంథాలయాలు విజ్ఞాన సముపార్జన, సంరక్షణ చేయాలనే దృక్పథం తెచ్చేందుకు ఈగ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పినట్టు చిరిగిన చొక్కానైనా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పుస్తకం నీకు కొన్ని వేల మంది వ్యక్తులకు సమానం కాబట్టి పుస్తక పఠనం అవసరం దానిని చిన్ననాటి నుండే పిల్లల్లో పెంపొందింపజేసినట్లయితే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడుతుంది. ఆ దిశగా అందరం ప్రయత్నం చేయాలి. గ్రంథాలయాలను మెరుగుపరుచుకుందాం.భావితరాల భవిష్యత్తు పునాది వేద్దాం. అపుడే నేటి యువత విజ్ఞానవంతులై రాష్ట్రానికి, దేశానికి, వారు కన్న తల్లిదండ్రులకు, మంచి పేరు తీసుకొస్తారు.

డా. మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News