Monday, December 23, 2024

తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం

- Advertisement -
- Advertisement -

భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో మన సహజ ప్రపంచాన్ని రూపొందించే అన్ని రకాల జీవులు -రకరకాల జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు. ఈ జాతులు, జీవులలో ప్రతి ఒక్కటి సమతుల్యతను కాపాడుకోవడానికి ఒక సంక్లిష్టమైన నెట్‌వర్క్ లాంటి పర్యావరణ వ్యవస్థలలో కలిసి పని చేస్తాయి. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 22న జరుపుకుంటారు. 2010 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఏటా ఒక్కొక్క నినాదంతో జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుతారు.

ఈ ఏడాది ఒప్పందం నుండి చర్య వరకు: బిల్ బ్యాక్ బయోడైవర్సిటీ అనే థీమ్‌తో జరుపుకుంటున్నాం. జీవవైవిధ్య దినోత్సవం నాడు మానవ భవిష్యత్తుకు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు. మన దేశంలో దాదాపు 1,00,696లకు పైగా జంతు జాతులున్నా యి. 48,653లకు పైగా జాతుల మొక్కలున్నాయి. ఇవి కనుమరుగు కాకుండా 2002లోనే దేశంలో ప్రత్యేక జీవవైవిధ్య చట్టం వచ్చింది. దీంతో విచక్షణారహితంగా చెట్లను నరకటం, క్రిమి సంహారకాల ఇష్టానుసార వినియోగం, అడవుల్లోని వన్య ప్రాణులను, సముద్ర జలాల్లో జలచరాల వేటను కట్టడి చేశారు. మనిషి మనుగడకు ఇతర జీవరాసుల అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఈ విషయం తెలియజేయడమే జీవ వైవిధ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం.

జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి; అందులో ప్రధానంగా నివాస విధ్వంసం, ఫ్రాగ్మెంటేషన్, వనరులను అధికంగా దోపిడీ చేయడం, ఆక్రమణ జాతుల పరిచయం, వాతావరణ మార్పు, కాలుష్యం, వ్యాధులు. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది, దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికిపైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్ర తీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు, అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం.

అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి. విశేషమేమిటంటే మన దేశంలో ఆదివాసులు (గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువ మందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతాని కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం.
జీవ వైవిధ్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. అరుదైన పక్షి జాతులు, విభిన్నమైన చేపల రకాలు, సీతాకోకచిలుకల, ఇతర జంతు జాతులు ఇలా అనేక ప్రత్యేకతలను రాష్ట్రం సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పోచారం, మంజీరా, అనంతగిరి, జన్నారం, ఎటిఆర్, ఖమ్మం, వరంగల్, పాకాల తదితర ప్రాంతాల్లో అద్భుతమైన జీవ వైవిధ్యం అలరారుతోంది. అడవులు, జలవనరులు, ప్రకృతి సేద్యం మధ్య ఒక సమన్వయ బంధం ఏర్పడితే అన్ని జీవరాసులు సుహృద్భావ వాతావరణంలో మెలుగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణకే ప్రత్యేకమైన కొన్ని రకాల చేపలు, గుడ్లగూబలు, పావురాలు, 400 వరకు రకాల వివిధ పక్షులున్నాయి. జీవవైవిధ్యం పెంపుదలకు పులులు, చిరుత పులుల వంటివి కీలకమైనవే అయినా అవేసర్వస్వం కాదని మొక్కలు, పక్షులు, ఇతర జంతువుల మనుగడ, పురోభివృద్ధి కూడా ముఖ్యమేనని పర్యావరణవేత్తల వాదన. ఇటు తెలంగాణలోని 500 నుంచి 600 రకాల ఔషధ మొక్కలూ కీలక భూమికను నిర్వహిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2,800 రకాల వృక్షాలు, మొక్కల జాతులు, 166 రకాల చేపలు, 376 రకాల పక్షులు, 155 సీతాకోక చిలుకలు, 13 రకాల రొయ్యలు, 4 రకాల ఎండ్రకాయలు (పీతలు), 28 రకాల తూనీగలు, 53 రకాల మోథ్స్, 46 రకాల సాలెపురుగులు, 12 రకాల తేళ్లు, 107 రకాల ఇన్వర్టెబ్రేట్స్, 41 రకాల నత్తలు, 17 రకాల కప్పలు, 60 రకాల పాములున్నాయి. ఇక 376 రకాల పక్షి జాతుల్లో భాగంగా గుడ్లగూబలు, బాతులు, పావురాలు, కొంగలు, రామచిలుకలు, పిట్టలు, రాబందులు 70 రకాల జంతువుల్లో భాగంగా పులులు, చిరుతపులులు, వివిధ జాతుల కోతులు, జింకలు, ఎలుకలు, ముంగిసలు, నీల్గాయిలు, నక్కలు వంటివి ఉన్నాయి.

రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవులు రాష్ట్రంలో 8 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. ప్రాణహిత, శివరం, ఏటూరునాగారం, నాగార్జున సాగర్-శ్రీశైలం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, పులులు, నక్కలు, మొసళ్లు, కొండచిలువలు ఇతర జంతువులున్నాయి.ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ -2,166 చదరపు కి.మీ., కవ్వాల్ టైగర్ రిజర్వ్-892 చదరపు కి.మీ. మేర పులుల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి, అలాగే పలు జాతీయ పార్కులు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం అయిన హరిత హారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో, పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తున్నాయి.
జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహార గొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహార పంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే 90 శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారాలుగా ఉంటాయి. మొక్కలు నశిస్తే వాటి మీద ఆధారపడిన జంతువులు నశిస్తాయి. పక్షులు నశిస్తే మొక్కలు పెరగడం, పంటలు పండటం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణకు ఘనమైన జీవవైవిధ్య వారసత్వ సంపద ఉంది. రకరకాల మొక్కలు, వృక్షాలు, జంతువుల జాతులతో వైవిధ్యమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వీటిని పరిరక్షించుకునే విషయంలో సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచాలి. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం నుంచి మనం ఏమి పొందుతున్నాం, వాటి వల్ల ప్రయోజనాలు కొనసాగాలంటే ఏ విధంగా వాటిని సురక్షితంగా ఉంచుకోవాలన్నది వారు తెలుసుకోగలగాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. స్థానికంగా పండించే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఔషధ మొక్కల వల్ల ఆరోగ్య పరిరక్షణకు అవకాశం ఏర్పడుతోంది, వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, అది మనందరి బాధ్యత.

కందగట్ల శ్రవణ్ కుమార్
8639374879

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News