Tuesday, January 21, 2025

పులితోనే జీవవైవిధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నేడు ప్రపంచ పులుల దినోత్సవం

హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా మన పర్యావరణ వ్యవస్థలలో పులులు పోషించే కీలక పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెద్దపులి అంటే శక్తి, అందం యొక్క చిహ్నాలు మాత్రమే కాదు.. అవి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే కీ స్టోన్ జాతులు అని మనమందరం గ్రహించాలని కోరారు. పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఎటిఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కెటిఆర్)లను చాలా బాగా నిర్వహించడంతో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. మేనేజ్ మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) నివేదికలో టైగర్ రిజర్వుల నిర్వహణలో రాష్ట్రానికి చెందిన అమ్రాబాద్ 78.7 శాతం స్కోర్ తో వెరీ గుడ్ క్యాటగిరిలో, కవ్వాల్ 74.2 శాతం స్కోర్ తో గుడ్ కేటగిరీలో నిలిచిందన్నారు.
ప్రత్యక్షంగా.. పరోక్షంగా పులులతో మానవాళి మనుగడ..
ప్రత్యక్షంగా, పరోక్షంగా పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి మనుగడకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. పులుల ఆవాసాల సంరక్షణ, విస్తరణకు ప్రజల మద్దతు అవసరమని, పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వెల్లడించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి పులుల రాక..
తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగినసంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండడంతో పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల్లో పులుల ఇక్కడకు తరలి వస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి కలిస్తోందని చెప్పారు. వన్యప్రాణులు మానవుల మధ్య సంఘర్షణ నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. పులులకు భద్రత, వాటి సహజ ఆవాసాల సమీప ప్రాంతాలలో నివసించే ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే విధంగా టైగర్ ప్రాజెక్ట్ను పునరావిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అటవీ అవాసాల పునరుద్దరణలో భాగంగా కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశామని ఈ సందర్భంగా తెలిపారు. కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కల్పించి రిలోకేట్ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News