Monday, December 23, 2024

జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ

- Advertisement -
- Advertisement -

అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ఐక్యరాజ్యసమితి మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటున్నాం. పీల్చేగాలి, తినే ఆహారం, మరెన్నో ఇతర ప్రయోజనాల కోసం మనం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నప్పటికిని దాని వల్ల సహజ వనరులను, జీవవైవిధ్యాన్ని నష్టపరుస్తున్నామని గుర్తించలేకపోతున్నాము. రాబోయే దశాబ్దాల్లో అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని, ఇలా జీవజాతులు అంతరించిపోతే ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమాదం ఉన్నదని, ఈ ప్రభావం మానవ జాతిని కూడా ప్రమాదంలో పడేస్తుందనే నిజాన్ని మానవులు గుర్తించక పోవడం దురదృష్టకరం. జనాభా పెరిగిపోవడం, అడవులు తగ్గిపోవడంతో కాలుష్యంపెరిగి వాతావరణంలో మార్పులు జరిగి జీవజాతులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ చట్టాలతో వాటిని రక్షించుకోవాలని మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ కోసం 1972లో చట్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం పక్షులను, జంతువులను, చెట్లను సంరక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. జీవవైవిధ్యంతోనే మానవ మనుగడని, లేదంటే మానవ జాతికి ప్రమాదమని, అందుకే వన్యప్రాణులవల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి. మనుషుల స్వార్థానికి అరణ్యాలను నరకడం వల్ల, అడవుల్లో నివసించే లెక్కలేనన్ని వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడింది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూపోతే, చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి. భారత దేశంలో దాదాపు 551 వన్యప్రాణుల అభయారణ్యాలు, 18 జీవవైవిధ్య అభయారణ్యాలు, 104 నేషనల్ పార్కులు ఉన్నాయి.

వన్యప్రాణులను, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. దేశంలోని 5.1 శాతం భూభాగాన్ని 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం ఉపయోగిస్తోంది. ప్రపంచంలోని దాదాపు 60 శాతానికి పైగా జీవవైవిధ్యానికి ఆశ్రయం కల్పిస్తున్న పదిహేడు దేశాలలో భారత్ ఒకటి. రకరకాల చర్యలతో ప్రకృతి సమతుల్యత గతి తప్పి వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం కలుగుతోంది. మన దేశంలో దాదాపు 132 జీవజాతులు అంతరించిపోయే పరిస్థితులకు చేరువగా ఉన్నాయని నివేదికలో హెచ్చరించింది. మన జాతీయ జంతువైన పులి మొదలుకొని చిన్న జంతువులు వరకు, రాబందులు మొదలుకొని పిచ్చుకల వరకు గల పక్షుల సంఖ్య గడచిన శతాబ్దకాలంలో గణనీయంగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87 లక్షల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయని, వీటిలో పది లక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని ఒక సర్వేలో తేలింది. 2030 నాటికి భూమ్మీద మనుగడ సాగిస్తున్న వాటిలో ప్రమాదం అంచుల్లో ఉన్న 30 శాతం జీవ జాతులను కాపాడుకోవాలని, 2050 నాటికి అంతరించిపోయే స్థితిలో ఉన్నవాటిలో 50 శాతం జీవజాతులను రక్షించుకోవాలని ధృఢసంకల్పం అయితే ఉంది.

ప్రపంచ మానవాళి ఉనికికే ప్రధాన కారణమైన వన్యప్రాణులను కాపాడుతూ, మానవ శ్రేయస్సుకు పునాదులు వేసుకుందాం. అరుదైన జీవులను అంతరించకుండా కాపాడుకోవడం, వాటి పెరుగుదలకు చేయూత ఇవ్వడం, వన్యప్రాణం పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయడం, వన్యప్రాణుల ప్రాధాన్యతలను వివరించడం లాంటి చర్యలు చేపట్టడం వల్ల కొంతైనా ప్రయోజనం ఉండవచ్చు. ఇప్పటికైన మనిషి వన్యప్రాణుల పట్ల అవగాహన కలిగి వాటి జీవన విధానాన్ని కొనసాగించేలా ప్రవర్తించాలని కోరుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News