Monday, December 23, 2024

పీడితులకు గొంతునిచ్చిన జర్నలిస్టు అంబేడ్కర్

- Advertisement -
- Advertisement -

వందేండ్ల కిందట భారత పత్రికా రంగం ఎట్లా కులాధిపత్యం తో సామాజిక ఉద్యమాలను, బహుజన నాయకులను తొక్కి పెట్టిందో, బద్నావ్‌ు చేసిందో ఇవ్వాళ ఇండియాలో మీడియా అదే పద్ధతిని మరింత పదునుబెట్టి ఆచరిస్తోంది. పీడితుల పక్షాన నిలబడినట్లు నటిస్తూనే అగ్రకులాల వాళ్ళు అభ్యుదయ, ప్రగతిశీల, వామపక్ష, హక్కుల సంఘాలు, పౌరసమాజం, ఎన్జివోలు, మీడియా ఇట్లా వివిధ ముసుగులు ధరించి తమ బ్రాహ్మణీయ, మనువాద భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. వీరికి వందకు వందశాతం మీడియా మద్దతు ఉంటుంది. అన్ని విధాలుగా సహకరిస్తుంది. వీళ్ళు బహిరంగంగా కులాన్ని వ్యతిరేకిస్తూ, కుల నిర్మూలన సంఘాలను నిర్మిస్తుంటారు. ఇట్లా నిర్మిస్తున్న సమయంలోనే బాధితులకు, పీడితులకు తెలియకుండానే కులం గురించి ఎంక్వయిరీ ప్రారంభిస్తారు. డైరెక్ట్‌గా కాకుండా మీ తండ్రి, తాతలు ఏ వృత్తిలో ఉండేవారు అని ఆరా తీస్తారు. అంతేగాకుండా భుజం మీద చేయివేసి ఆదరిస్తున్న అనునయిస్తున్న ఫోజు పెడతారు. భుజం మీద చేయి వేసిండ్రంటే లోపల జంధ్యం ఉన్నదా? లేదా అనే తెలుసుకునే ఉద్దేశమే అనేది బాధితులకు, పీడితులకు అప్పుడు తెలియదు.

ఇదొక చీకటి కోణం.
వందేండ్ల కన్నా ముందు బాలగంగాధర్ తిలక్ నడిపించిన ‘కేసరి’ మొదలు, మదరాసులో ‘ది హిందూ’ వరకూ అన్ని పత్రికలూ బ్రాహ్మణ సామాజికవర్గం ప్రయోజనాలు కాపాడేందుకు పాటుపడ్డవే! ఈ పత్రికల్లో పని చేసేది, బయటి నుంచి రాసేదీ మెజారిటీగా బ్రాహ్మణులే! ఇట్లా మ్యూచ్యువల్ అండర్‌స్టాండింగ్‌తో నడిచే పత్రికల స్థానంలో నిజమైన ప్రజాభిప్రాయం ప్రతిఫలింపజేసే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేడ్కర్ 1920 జనవరి, 31న ‘మూక్ నాయక్’ పత్రిక ప్రారంభించారు. ‘మూక్ నాయక్’ పత్రిక ప్రారంభ వార్తనే కాదు, అడ్వర్టయిజ్‌మెంట్ కూడా ప్రచురించేందుకు ‘కేసరి’ పత్రిక తిరస్కరించిందంటే వారి కులోన్మాదం అర్థమయితది.

నిజానికి పత్రికలు వ్యాపార సంస్థలుగా మారి లాభాలు దండుకుంటున్న సమయంలో విరాళాలు, చందాలు సేకరించి అంబేడ్కర్ పత్రికలను నడిపించారు. పత్రికలను నడిపించడం ఒక బాధ్యత గా, స్వార్థత్యాగంగా ఆచరించిండు. చైతన్యస్ఫూర్తిని నింపిం డు. అయితే ఇప్పటి వరకు తెలుగు పాఠకులకు జర్నలిస్టుగా అంబేడ్కర్ చేసిన కృషి వివరంగా తెలియదు. ఈ విషయమై అంబేడ్కర్ జీవిత చరిత్రలు, సమగ్ర రచనల్లో భాగంగా అక్కడక్కడా కొంత సమాచారమున్నది కానీ పూర్తిగా ఆయన జర్నలిస్టు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం లేదు. ఆ కొరతను తీర్చడానికి ఈ పుస్తకంలో ప్రయత్నించడమయింది.
ఏవిషయమైనా పోలిక తీసుకురాకుండా పరిశీలన, అధ్యయనం చేయడం కష్టం. వాటి ఫలితాలను ప్రకటించినా అంత ఈజీగా జనాలకు అర్థం కాదు. అంబేడ్కర్ చదువు, చేసిన కృషి, పోరాటం, త్యాగం, రచనలు కూడా ఈ కోణంలోనే చూడాలి.

ఆయన నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం. నిరంతరం అణగారిన వర్గాల అభ్యున్నతికి చింతన చేసిండు. దార్శనికతతో మెలిగిండు. గాంధీ, అంబేడ్కర్ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో భారత రాజకీయ రంగం మీదికి వచ్చిండ్రు. వయసులో అంబేడ్కర్ కన్నా 22 ఏండ్లు పెద్దోడు గాంధీ. అయినా వీరిద్దరూ కొంచెం అటూ ఇటుగా 1917 ఆ ప్రాంతంలో రాజకీయ రంగంలోకి వచ్చిండ్రు. అయితే వీరికి గుర్తింపు, గౌరవం దక్కడంలో కులమే కీలక భూమిక పోషించింది. అంబేడ్కర్ న్యాయమైన గుర్తింపు పొందలేదు. బ్రాహ్మణీయ పత్రికలకు గాంధీ ఎత్తుబిడ్డగా మారిండు. అంబేడ్కర్ అనాథ అయిండు. ఇట్లా మీడియా ప్రొజెక్షన్‌లో పక్షపాతం, వివక్ష ఉండడంతో చాలా విషయాలు మరుగునపడ్డాయి.

కింది కులాల వారికి జరగాల్సినంత మేలు జరగకుండా ఈ మీడియా ప్రతిబంధకంగా ఉండింది. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే ఆనాటి పరిణామాలు తెలుసుకోవాలి.ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. 1890ల నుంచి బొంబాయి కేంద్రంగా ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’ అనే పత్రిక కె. నటరాజన్ నడిపించాడు. ఈ పత్రిక ఆనాడు సంఘ సంస్కరణకు కేంద్ర బిందువుగా ఉండింది. ఈ పత్రిక 1918 నుంచే గాంధీ గుజరాతీ భాషలో రాసిన వ్యాసాలను తర్జుమా చేసి పాఠకులకు అందించింది. అయితే సామాజిక సంస్కరణ కోసం పాటు పడుతున్నామని చెప్పుకునే ఈ పత్రిక ఎప్పుడూ అంబేడ్కర్ రచనలు అచ్చేయలేదు.అప్పటికి అంబేడ్కర్ బొంబాయిలోనే నివసిస్తున్నారు. అయినా ఆ పత్రిక ఆయన రచనలు వెలువరించలేదు. ఈ పత్రిక బ్రాహ్మణుల కోసం, మదరాసు నుంచి వచ్చిన కామాక్షి అనే ఇంటి పేరుగల బ్రాహ్మణ కుటుంబీకుల సంపాదకత్వంలో పని చేసింది.

అగ్రకులాల నేతృత్వం లో పని చేసే సంస్థలూ, వ్యక్తులూ ఈ పత్రికలో తమ గురించి రాస్తే చాలు అనే భావనతో ఉండేవారు. అంటే ఈ పత్రిక ఎంత ప్రభావశీలంగా ఉండిందో అర్థమయితుంది. దీనికి కొనసాగింపుగా టైవ్‌‌సుఆఫ్ ఇండియాకు అంబేడ్కర్ వ్యాసం రాస్తే ప్రచురించడానికి నిరాకరించారు. ఇట్లా వాళ్ళు చెప్పేది ఒకటి ఆచరణ మరోటి అయినప్పటికీ సంస్కర్తలుగా కీర్తించబడేవారు. అంతెందుకు గాంధీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిన విషయాన్ని పత్రికలు ఏనాడూ ఎత్తి చూపలేదు. ఆయన గుజరాతి పత్రికల్లో వ్యాసాలు రాసినప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాలని ప్రబోధించిండు. అదే ఆంగ్ల పత్రికల్లో అంత కటువుగా గాకుండా ‘హరిజన్’లను ఆదరించాలని సంస్కర్త రూపమెత్తిండు.

అంబేడ్కర్‌ని విమర్శిస్తూ దాదాపు ఆనాటి అన్ని పత్రికలూ వివిధ సందర్భాల్లో కార్టూన్లను ప్రచురించాయి. ఆనాడు అది సర్వసాధారణ విషయంగా ఉండింది. అదే సమయంలో గాంధీని దేవుడిగా భ్రమింపజేస్తూ బొమ్మలు గీసిం డ్రు, అచ్చేసిండ్రు. అంబేడ్కర్ బ్రాహ్మణాధిపత్యాన్ని, మనువాదాన్ని నిలదీస్తే పత్రికల వారు ‘భుజం’ తడుముకునేవారు.
మహారాష్ర్టలో అత్యంత ఆదరణ పొందిన స్కాలర్ ఆర్.జి.భండార్కర్ (18371925). సంస్కర్తగా, ఆచార్యులుగా, ప్రార్థన సమాజ్ సభ్యులుగా బహుముఖాలుగా పనిచేసిండు.ఈయన మనవరాలు మాలినీదేవి (కూతురు కూతురు) అనే ఆమె 1927లో గులాబ్‌ఖాన్ బషీరుద్దీన్ అనే విద్యావంతుణ్ణి ప్రేమించి పెండ్లి చేసుకుంది. దీంతో బొంబాయిలోని అన్ని పత్రికలు ఈ వివాహాన్ని ఖండిస్తూ సంపాదకీయాలు రాసినయి. రోజూ ఆ వివాహాన్ని ఖండిస్తూ వార్తలు ప్రచురించి ప్రజల్లో ఒకరకమైన వ్యతిరేకమైన అభిప్రాయాన్ని కూడగట్టాయి.

అయితే అంబేడ్కర్ ఒక్కడే తాను నడిపించిన ‘బహిష్కృత్ భారత్’ లో వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల ఇష్టానికి సంబంధించినది. దాంట్లో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని సంపాదకీయం రాసిండు. ఇట్లా ఈ వివాహాన్ని సమర్ధించడం బ్రాహ్మణాధిపత్యులకు కంటంగింపుగా ఉండింది. ఇదే సమయంలో ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’ పత్రిక ఈ వివాహాన్ని సమర్ధిస్తూ ఎక్కడా ఒక్క వ్యాసం కూడా ప్రచురించలేదు. ఇదొక సంఘటన. మరో సంఘటన 1927లో అంబేడ్కర్ ‘మహద్ చెరువు’ పోరాటం చేసిండు. మొత్తం కొంకణ్ మహారాష్ట్రాలో రెండు, మూడు నెలలు ప్రచారం చేసి దళితులను సంఘటితం చేసి మహద్ చెరువు నీళ్ళు దళితులకు దక్కాలని ఉద్యమం చేసిండు. ఆ చెరువు దగ్గర ఒక టెంట్ వేసుకొని నిరసన వ్యక్తం జేస్తూ సత్యాగ్రహం చేసిండ్రు. ప్రజలందరూ అక్కడికే చేరుకునేలా పిలుపునిచ్చిండు.

ఆయన పిలుపునకు స్పందించి వేల మంది దాడులకు సైతం వెరవకుండా అక్కడికి చేరుకున్నరు. అందరూ కలిసి ‘సత్యాగ్రహం’ చేసిండ్రు. అయితే ఇప్పటికీ మీడియా మాత్రం ‘సత్యాగ్రహం’ అనగానే గాంధీని ప్రొజెక్ట్ చేస్తుంది. సత్యాగ్రహానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చెబుతాయి. గాంధీ ఉప్పు సత్యాగ్రహం పేరిట 1930లో ఉద్యమం లేవదీసిండు. 1930కి ముందు గాంధీ చేసిందంతా ‘సహాయ నిరాకరణ’ ఉద్యమమే! గాంధీ కన్నా మూడేండ్ల ముందే సత్యాగ్రహం చేసిన వ్యక్తి అంబేడ్కర్ అనే విషయం మీడియా ఎక్కడ మాట మాత్రంగా కూడా రాయదు. చెప్పదు. 1932 రౌండ్ టేండ్ కాన్ఫరెన్స్ తర్వాత గాంధీ ‘హరిజన’ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిండు. ఈ పదమే పరమ అభ్యంతర కరమైనది. అయినా ఆ పేరుతో పత్రికను నడిపించిండు. దీనికి అనుబంధంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ‘హరిజన సేవక్ సంఘ్’ తరపున పత్రికలు వెలువడ్డాయి. చాలా పత్రికలకు బిర్లాలు, బిజినెస్‌మెన్‌లు ఆర్థికంగా పెట్టుబడి పెట్టిండ్రు.

సాయం అందించిండ్రు. తెలుగులో ‘ఆంధ్రా హరిజన్’ అనే పత్రికను వినయాశ్రమం నుంచి గొల్లపూడి సీతారామ శాస్త్రి మూడు దశాబ్దాలకు పైగా నడిపించారు. అయితే ‘హరిజన’ పత్రికలు పక్కా బ్రాహ్మణీయ దృష్టి కోణంలోనే సంస్కరణను ప్రచారం చేశాయి. సహపంక్తి భోజనాలు, దళితులకు విద్యావకాశాలు, పబ్లిక్ చేదబావులు, ఎస్సీల దేవాలయ ప్రవేశాలు ఇట్లా ఏది చేపట్టినా అది తమ ప్రచారానికి ఉపయోగించుకునేవారు. అప్పటికే కాంగ్రెస్ రాజకీయాలు ఊపుమీద ఉండడం తో అంతిమంగా ఈ కార్యక్రమాలన్నీ అందులోని బ్రాహ్మణులకే ఉపయోగపడ్డాయి.
ఇప్పటి మాదిరిగానే 100110 ఏండ్ల కింద సైతం పత్రికలను మేనేజ్ చేయడం అనేది ఒక అవసరమైన కార్యక్రమంగా చేసిండ్రు. దేశంలో ఎక్కడ పత్రిక ప్రారంభమైనా దాని వెనుక ఉన్న సామాజిక వర్గాల వారు అయితే మార్వాడీలు లేదంటే బ్రాహ్మణులు. వీరిద్దరూ లోపాయకారిగా గాంధీని జాతీయ స్థాయిలో ఒక మెస్సయాగా ప్రచారం చేసిండ్రు. తెలుగులో ఆ పనిని ఆంధ్ర పత్రిక, ఆ తర్వాత ఆంధ్రప్రభ చేసింది. తమిళనాట ‘ది హిందూ’ పత్రిక చేసింది. అయితే ఈ ధోరణిని ధిక్కరించి బలంగా ఎదుర్కొన్నది బ్రాహ్మణేతర ఉద్యమం నుంచి వచ్చిన పత్రికలు.

పెరియార్ రామస్వామి నాయకర్ నడిపించిన ‘రివోల్ట్’, జస్టిస్ పార్టీ తరపున నడిచిన ఇంగ్లీషు పత్రిక ‘జస్టిస్’, తెలుగులో ‘ఆంధ్రప్రకాశిక’, తమిళంలో ‘ద్రావిడన్’ అనే పత్రికలు గాంధీ భావజాలాన్ని వ్యతిరేకించాయి. అంబేడ్కర్ నడిపిన పత్రికలు కూడా ఈ కోవలోనివే! బ్రాహ్మణేతర భావజాలాన్ని ప్రచారం చేశాయి. ఈ ఉద్యమ ప్రభావంతో జస్టిస్ పార్టీ 1920వ దశకంలో మదరాసు రాష్ర్టంలో అధికారాన్ని కూడా చేపట్టింది.
ఒకవైపు కమిటీలో స్థానికులకు ప్రాతినిధ్యం లేదు అనే పేరుతో మాంటెగ్ చెవ్‌‌సుఫర్డ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కమిటీకి విజ్ఞాపనలు ఇవ్వకుండా గాంధీ, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రచారం చేసింది. నిజానికి ప్రతి పదేండ్లకోసారి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక మేరకు అణగారిన వర్గాల వారికి అవసరమైన రిజర్వేషన్లు కల్పించడం, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవడం బ్రిటీష్ ప్రభుత్వం బాధ్యతగా చేస్తూ ఉండేది. 1909 నాటి మార్లె మింటో కమిటీ ఫలితంగానే ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు దక్కినాయి. 1919లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌత్‌బరో కమిటీకి అంబేడ్కర్ తన నివేదికలు సమర్పించి, దళిత అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాడు.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మాంటెగ్ చెమ్స్ ఫోర్డ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1921లో భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే దీనివల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్, బ్రాహ్మణ నాయకులు ప్రచారం చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే గుర్తుంచుకోవాలి. పేరుకు ఒకరిద్దరు జగ్జీవన్‌రావ్‌ు లాంటి వారికి పదవులిచ్చినా దాని అణువణువునా బ్రాహ్మణిజం నిండి ఉండింది. అయితే బ్రాహ్మణ మీడియా ఎక్కడ కూడా ఈ విషయాన్ని పత్రికల్లో రాయలేదు. దీంతో తమ వర్గాల వారు బాగుపడాలంటే వారి సమస్యలను లేవనెత్తి, పరిష్కారం కోసం పోరాడేలా చేసే ఒక పత్రిక అవసరం అని అంబేడ్కర్ భావించారు.
ఇట్లా ఆలోచిస్తున్న సమయంలోనే ఆయనకు కొల్హాపూర్ రాజు శాహు మహరాజ్ సహాయం అందింది. దీంతో అంబేడ్కర్ బొంబాయిలో 1920 జనవరి 31న ‘మూక్‌నాయక్’ పత్రిక తొలి సంచికను వెలువరించారు. ఆ తర్వాత ‘బహిష్క్‌ృత్ భారత్’, ‘సమత’, ‘జనత’, ‘ప్రబుద్ధ భారత్’ పత్రికలను తన నేతృత్వంలో నడిపించాడు. ఈ పత్రికలు దళిత, బహుజన సమస్యలను వెలుగులోకి తేవడంలో ముందు వరుసలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పత్రికలను దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నడిపించాడు. వివిధ ప్రాంతాల నుంచి బొంబాయికి చదువుకోవడానికి వచ్చే దళిత విద్యార్థులకు పత్రికాఫీసులోనే ఆశ్రయం ఇస్తూ కాలేజ్ సమయం తర్వాత పత్రికలో పని చేసే విధంగా తర్ఫీదునిచ్చిండు. ఇట్లా మహారాష్ర్టలో తొలితరం దళిత జర్నలిస్టులు తయారుగావడానికి పునాదులేసిండు. అట్లాగే ఆనాటి దళితోద్యమాలకు సంబంధించిన వివరాలను తాను నడిపించిన పత్రికల్లో ప్రచురించేవాడు.

ఎక్కడ సమావేశం జరిగినా వాటి వివరాలు పత్రికల్లో ప్రచురితమయ్యేవి. అయితే దురదృష్టవశాత్తు ఇవ్వాళ అన్ని పత్రికల ప్రతులు అందుబాటులో లేవు. వెతికితే దొరికే అవకాశమున్నది. ఆనాటి దళితోద్యమ చరిత్ర సమగ్రంగా రికార్డు కావడానికి ఈ పత్రికలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే కొంతమంది పరిశోధకులు ఆయా పత్రికల్లోని వార్తాంశాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అంబేడ్కర్ కృషి సమగ్రంగా రికార్డు కావడానికి ఆనాటి పత్రికలు ఒక ప్రధాన వనరు. చరిత్రలో విస్మరింపబడ్డ ఎన్నో అంశాలకు అందులో ఆకరాలున్నాయి.
1920లలో అక్షరాస్యత ఆరేడు శాతం మాత్రమే ఉండేది. అందులో దళితుల అక్షరాస్యత ఒకటీ అరా మాత్రమే. ఇవ్వాళ వందేండ్ల తర్వాత కొంత అక్షరాస్యత శాతం పెరిగింది. అయితే ఆనాడు ‘మూక్ నాయక్’ పత్రిక మూడు వేల వరకు చందాదారులకు చేరేవి. అమ్ముడుబోయేవి. ఇవ్వాళ తెలుగులో ఏ బహుజన పత్రిక కూడా ఐదారు వందలకు మించి ప్రతులు అమ్మడం కష్ట సాధ్యంగా ఉన్నది. అయితే దళిత ఉద్యమంతో మమేకమైన పత్రికలు కొన్ని,

బహుజన ఉద్యమాలతో మమేకమైన మరికొన్ని పత్రికలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను వివిధ విషయాలపై చైతన్యవంతులని చేశాయి.దురదృష్టవశాత్తు తెలుగులో క్రమం తప్పకుండా వెలువడుతున్న బహుజనపత్రికలు చాలా తక్కువ. నా దృష్టిలో ‘బహుజన కెరటాలు’ అట్లాంటి పత్రికల్లో ముందువరుసలో ఉన్నది. గతంలో వెలువడ్డ ‘ఏకలవ్య’, ‘నలుపు’, ‘ఎదురీత’ ‘గబ్బిలం’ ‘సమాంతర’ లాంటి పత్రికలు ఇవ్వాళ మార్కెట్ మాయాజాలంలో కనుమరుగయ్యాయి.
అంబేడ్కర్ ఐడియాలజిని ముందుకు తీసుకు పోవాలంటే ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్ నుంచి లైక్‌మైండెడ్ బహుజనులు కలిసి లాభాపేక్ష లేకుండా పత్రికలు స్థాపించాలి. ఈ పత్రికలు ప్రధానంగా భావజాల వ్యాప్తికి కృషి చేయాలి. ఇట్లా భావజాల వ్యాప్తి జరిగినట్లయితే దాని స్ఫూర్తితో ఉద్యమాలు ఊపందుకుంటాయి.

ఎంత తక్కువ సర్క్యులేషన్ అయినా వాటిని నడిపించాలి. మనమెవ్వరికీ తీసిపోమని నిరూపించాలి. మనం వెలువరించే పత్రికలు మనం కొని చదివినట్లయితే మరింత సోయితో మెలిగేందుకు అవకాశముంటుంది. ఇప్పటి వరకూ మనం డబ్బులు వెచ్చించి చందాలు కట్టి మనకు వ్యతిరేకంగా వార్తలు వండి వడ్డించే పత్రికలనే చదువుతున్నాము. మన డబ్బులతో వ్యాపారం చేస్తూనే మనకు సంబంధించిన లేదా మన హక్కులకు సంబంధించిన వార్తలు ప్రచురించకుండా పత్రిక యాజమాన్య కులానికి బలం చేకూర్చే విధంగా ఆయా పత్రికలు వార్తలు వడ్డిస్తున్నాయి. మనపై ‘థాట్ పొలిసింగ్’ చేస్తున్నాయి. దీన్నుంచి బయటపడాలంటే ముందుగా చిన్నగానైనా బహుజన మీడియాను ఎవరికివారు నిర్మించుకోవాల్సిన అవసరమున్నది. సోషల్ మీడియాలో సైతం మన వాణిని బలంగా వినిపించే విధంగా కంటెంట్‌ని తయారు చేసుకోవాలి.

యూట్యూబ్, వెబ్‌సైట్‌లను నిర్మించుకోవాలి. ఈ అంశాలను నిరంతరం ప్రచారంలో పెట్టడం ద్వారా ఎవరి వాటాను ఎవరు కాజేస్తున్నారు. అసలు శత్రువులెవరు? వారిని ఎదుర్కునే మార్గమేమిటి? రాజ్యాధికారం సాధించుకునే దారిలో చేపట్టాల్సిన చర్యలేమిటి? చేయాల్సిన త్యాగాలేమిటి? ఇట్లా అన్ని విషయాలను మనదైన మీడియాను నిర్మించుకోవడం ద్వారానే సాధ్యం. ఈ విషయాన్ని అందరికన్నా ముందుగానే అంబేడ్కర్ గ్రహించారు కాబట్టే పత్రికలను స్థాపించాడు. ఇప్పుడు ఆయన ఆశయాలను కొనసాగించడంలో భాగంగానే ప్రింట్/ ఎలక్ట్రానిక్/ డిజిటల్ మీడియాల్లో బహుజనులు తమ వాణిని బలంగా వినిపించాల్సిన అవసరమున్నది. అంబేడ్కర్ ‘మూక్ నాయక్’ వందేండ్ల సందర్భం అదే చెబుతున్నది. ఈ వారం అంబేడ్కర్ 132వ జయంతిని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆయన రచనలు, పత్రికలు అన్నీ తెలుగుతో సహా అన్ని దేశ భాషల్లో పునర్ముద్రణ కావాల్సిన అవసరమున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News