Monday, December 23, 2024

తిల్కా మాంఝి – రుధిర తర్పణం

- Advertisement -
- Advertisement -

Biography of Tilka Majhi

అది 1785వ సంవత్సరపు జనవరి 12వ తేది. బీహార్ కు చెందిన భగల్ పూర్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళే రోడ్డు రెండు వైపులా జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ నిలబడ్డ ప్రతి వ్యక్తి ముఖం లోనూ యేదో ఆందోళన కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. జరుగుతున్న ఘోరాన్ని చూడలేనని కాబోలు భానుడు కారు మబ్బుల వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. పంచభూతాలలో ఒక సాక్షిగా నిలవాల్సిన వాయుదేవుడు ఆ భయంకర దారుణానికి తాను సాక్ష్యంగా నిలువలేనని, తన శ్వాసను తానే బంధించికొని యోగ ముద్రలోకి వెళ్ళిపోయడు. ఇంతలో- దూరంగా- గుర్రాల డెక్కల చప్పుడు. నాలుగు గుర్రాలు పక్క పక్కనే పరిగెడుతూ ఆకాశంలో ధూళిని వెదజల్లుతున్నాయి. రోడ్డుకిరువైపులా వున్న జనాలు గుండెల్ని బిగబట్టుకొని ఆ ఘోర దృశ్యాన్ని చూడసాగారు. అందులో కొందరు చూడలేక కళ్ళు మూసుకొంటుంటే మరికొందరు ఆ దారుణాన్ని చూసి తట్టుకోలేక మూర్ఛబడిపోయారు.

అవును అది నిజం- అది ఒక ఘోర దృశ్యం. ఇంకా చెప్పాలంటే అత్యంత ఘోర దృశ్యం. బ్రిటిష్ పాలకుల పాశవిక రాక్షసత్వానికి ప్రతీకగా నిలిచిన ఒక దారుణ దృశ్యం. ఒకే వరసలో పరుగెత్తుకొని వస్తున్న నాలుగు గుర్రాల తోకలు బలమైన తాళ్ళతో కట్టబడి అవే తాళ్ళ రెండవ వైపు ఒక ఒక ముప్పది ఐదేండ్ల యువకుడు బంధించబడి భగల్ పూర్ వీధుల గుండా గుర్రాలచే ఈడ్చుకొని రాబడుతున్నాడు. ఈడ్చుకొని రాబడుతున్న ఆ యువకుడి శరీరం చిందిస్తున్న రక్తం వీధి వీధినీ తడిపేస్తున్నది. ఇక వీధి వీధి తిప్పబడ్డ ఆ యువకుడు చివరకు కలెక్టర్ ఆఫీసుకు తీసికొని రాబడి కలెక్టర్ ముందు ప్రవేశపెట్టబడ్డాడు. తన శరీరంలోని రక్తంతో భగల్ పూర్‌లోని వీధి వీధినీ పునీతం చేసిన ఆ యువకుడు ఇక నిలబడలేక కూలబడిపోయాడు.. తరువాత జనవరి 13, 1785 వ రోజున కొన ఊపిరితోనున్న ఆ యువకుణ్ణి బ్రిటిష్ అధికారులు అక్కడే దగ్గరలో వున్న ఒక మర్రిచెట్టుకు ఉరి తీశారు.

అయితే అంతటి కఠిన శిక్షకు గురికాబడ్డ ఆ యువకుడు ఒక దోపిడీ దొంగ కాదు, హంతకుడు అంతకన్నా కాదు. మోసగాడు అసలే కాదు. కాని బ్రిటిష్ వారి అకృత్యాలకు బలవుతూ, గురవుతున్న తన ఆదివాసీల దురవస్థను చూడలేక బ్రిటిష్ వారి అన్యాయాల్ని యెదిరించిన ఒక ఆదివాసీ విప్లవకారుడతడు.. ఆ యువకుడే తిల్కా మాంఝి.. ఆ పేరే బ్రిటిష్ వారి గుండెల్లో ఒక సింహ స్వప్నం. సంతాల్ తెగకు చెందిన తిల్కా మాంఝి ఫిబ్రవరి 11, 1750 రోజున బీహార్‌కు చెందిన సుల్తాన్ గంజ్ తాలూకా లోని తిలక్ పూర్ గ్రామంలో జన్మించాడు. అడవినే నమ్ముకొని జీవిస్తున్న వాడవడం వల్ల అందులో ప్రత్యేకంగా సంతాల్ తెగకు చెందిన వాడవడం వల్ల అడవిలోని చెట్టూ పుట్టతో ఆయనకు అన్యోన్య సంబంధమేర్పడింది.. సంతాలులు ముఖ్యంగా పోడు వ్యవసాయం మీద ఆధారపడి అటవీ ఉత్పత్తుల్ని సేకరించి అమ్ముకొని జీవించేవాళ్ళు. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో సహ జీవనం చేసే కల్లకపట మెరుగని జాతివారిది..

ఇక అప్పటికే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపనీ బలపడి అన్ని రంగాల్లో భారతీయుల్ని దోచుకొంటున్న రోజులవి. అన్ని వర్గాల ప్రజల్ని దోచుకొన్న కంపనీ దృష్టి అడవి బిడ్డలైన సంతాలుల మీద వారి పోడు వ్యవసాయ భూముల మీదా పడింది. సంతాలులు పోడు వ్యవసాయం ద్వారా పండించుకొన్న పంటల్ని కంపెనీ దోచుకోవడం మొదలు పెట్టింది. ఎదిరించిన సంతాలుల్ని కాల్చి వేయడం సంతాలుల ఆడబడుచుల మీద, అకృత్యాలు చేయడం మొదలు పెట్టింది. అదే సమయంలో బెంగాల్ ఘోర కరువు సుమారు కోటి మందిని పొట్టన బెట్టుకుంది. ఆ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం దీనికి భిన్నంగా ప్రజల మీద శిస్తుని పెంచింది.

ఇది సహించలేని యువకుడైన తిల్కా మాంఝి కంపనీ మీద సమర శంఖం పూరించాడు. తనతో బాటు తనతోటి యువకుల్ని కూడగట్టుకొని 1772 వ సంవత్సరంలో షానాచార్ అనే ప్రదేశంలో కంపనీ మీద తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. అంతేకాదు తన అనుచరులతో కలిసి కంపెనీ కోశాగారాన్ని దోచుకొని ఆ సంపదను పేదలకు పంచిపెట్టాడు. దీనితో ఉలిక్కిపడ్డ బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 800 మందితో కూడిన సైనిక పటాలాన్ని మాంఝి సేనపైకి పంపాడు. దానితో భగల్ పూర్ సుల్తాన్ గంజ్ రాజ్ మహల్ తదితర ప్రాంతాల్లో మాంఝి విప్లవకారులకు కంపెనీ సిపాయిలకు మద్య పోరాటం ప్రారంభమయింది.. అయితే ఆ ప్రయత్నంలో కంపెనీ సేన విజయం సాధించలేకపోయింది.

పోరాట తీవ్రతని గమనించిన కంపనీ అధికారులు ఆదివాసీలలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడు. అది అర్థం చేసుకొన్న తిల్కా సంతాలుల్నే కాక ఆదివాసీలందరినీ ఏకత్రాటిపైకి తెచ్చి పోరాటం చేయ సాగాడు. ఇక గత్యంతరం లేదనుకొన్న కంపెనీ ఆగష్ట్ క్లీవ్ లాండ్ ని రాజ మహల్ ప్రాంతానికి ఎస్.పిగా నియమించింది.. క్లీవలాండ్ నేతృత్వంలో రాజమహల్ అడవుల్లో పోరాటం ఉధృతంగా కొనసాగింది. అయితే బ్రిటిష్ వారి తుపాకుల ముందు తమ విల్లంబులతో యెదురొడ్డి చాలా కాలం పోరాడలేమని గ్రహించిన తిల్కా గెరిల్ల పోరాటానికి శ్రీకారం చుట్టాడు. ఆ పోరాటంలో ఎస్.పి. క్లీవ్ లాండ్ మరణించడం జరిగింది.
దానితో నిర్ఘాంతపోయిన కంపెనీ అధికారులు ఒక కుట్రకు తెర తీశాడు. తిల్కా అనుచరుల్లోనీ ఒక నాయకుణ్ణి కోవర్ట్‌గా చేసుకొన్నారు. దానితో తిలాపుర్ అడవుల్లో తిల్కా సేన నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి కోవర్ట్ జౌధా తన అనుచరులతో అకస్మాత్తుగా తిల్కా అనుచరుల మీద దాడి చేసి పెక్కు మందిని చంపి వేశాడు.

దీనితో జరుగుతున్నదేమిటో అర్థంకాక అయోమయానికి గురయిన తిల్కా సేన సుల్తాన్ గంజ్ పర్వత శ్రేణుల్లోకి పారిపోయింది.. దానితో పర్వత ప్రాంతానికున్న దారులన్నీ మూసివేసిన బ్రిటిష్ సైనికులు తిల్కా అనుచరులకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు.. అయినా ఆకలి దప్పుల నోర్చుకొంటూ మాంఝి సేన, చాలా కాలం పొరాటం కొనసాగించారు. చివరకు జనవరి 12, 1785 రోజున అనూహ్యంగా పట్టుబడ్డ తిల్కా మాంఝి, బంధించబడి భగల్ పూర్‌కు తేబడి దారుణంగా హింసించబడి జనవరి 13, 1785 రోజున అక్కడే వున్న ఒక మర్రి చెట్టుకు ఉరి వేయబడ్డాడు. భగల్ పూర్ వీధుల గుండా తన రక్తాన్ని చిందించి తిల్కా అమరుడయ్యాడు..

అయితే తిల్కా మాంఝి చేసిన పోరాటం వృధా కాలేదు. భగల్ పూర్ వీధుల్లో చిందించబడ్డ ఒక్కొక్క రక్త బిందువు సంతాల్ జాతిలో ఒక్కొక్క విప్లవకారుణ్ణి సృష్టించింది. ఫలితంగా డెబ్బదేండ్ల తరువాత 1855 లో ముర్ము సోదరుల నాయకత్వంలో అరవై వేలమంది పాల్గొన్న బ్రహ్మాండమైన సంతాల్ తిరుగుబాటకు బాటలు వేసింది. ఇక తరువాతి కాలంలో భారత ప్రభుత్వం తిల్కా బలి దానానికి జోహారులర్పిస్తూ తిల్కా యెక్కడైతే ఉరి తియబడ్డాడో అక్కడే ఆయన విగ్రహాన్ని స్థాపించింది. అంతేకాదు భగల్ పూర్ యూనివర్శిటీ పేరు తిల్కా మాంఝి భగల్ పూర్ యూనివర్శిటిగా మార్చి దేశ ప్రజలకు ఆయన పట్ల వున్న గౌరవాన్ని తెలియ చేసిం ది. వాస్తవంగా భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో గిరిజనుల, అడవి బిడ్డల త్యాగాలు సువర్ణాక్షరాలతో లిఖించ తగ్గవి అందులో యెంత మాత్రం సందేహం లేదు. అయితే విచారించాల్సిన విషయమేమంటే కొందరు ప్రముఖ చరిత్రకారుల వేల పేజీల భారత దేశ చరిత్ర పుస్తకాలలో తిల్కా గురించి గాని, చివరకు సంతాలుల తిరుగుబాటు గురించి గాని ఒక ముక్కయినా లేకపోవడం నిజంగా యెంతో విచారించాల్సిన విషయం. ఆనాటి ఏకలవ్యుడి నుండి ఈనాటి వరకూ అడవి బిడ్డలకు అన్యాయం జరుగుతూనే వుంది. ఈ అన్యాయం సరిదిద్దబడే శుభ దినం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

* బసవరాజు నరేందర్ రావు: 990 851 6549

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News