హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీకి అదనంగా 15 నెలల్లో నిర్మాణం
లక్ష చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
దీనితో హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు
టిఎస్‌ఐఐటి, తెలంగాణ లైఫ్ సెన్సెస్ భాగస్వామ్యంతో నిర్మాణం
బయో ఫార్మాస్యూటికల్స్ పరిశోధన, మందుల తయారీని ప్రోత్సహించడమే లక్షం జినోమ్ వ్యాలీలో అదనపు ప్రయోగశాలతో బిహబ్ అభివృద్ధి : ట్విటర్‌లో మంత్రి కెటిఆర్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో బయో ఫార్మా స్యూటికల్స్ హబ్ ఏర్పాటు కానుంది. ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా ఇది రానుంది. మరో 15 మాసాల్లో ఇది అందుబాటులోకి రానుంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫార్మా నిర్మాణం ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని ఆదివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. టిఎస్‌ఐఐటి, తెలంగాణ లైఫ్ సైన్స్‌స్ భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో బయోఫార్మాస్యూటికల్ పరిశోధన, మందుల తయారీకి ఊపునిచ్చే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జీనోమ్ వ్యాలీలో తదుపరి ప్రయోగశాలతో కలిపి బి-హబ్‌ను అభివృద్ధి చేస్తోందన్నారు.
ఆసియాలోనే ఇది ప్రత్యేకమైన క్లస్టర్‌గా మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. జీనోమ్ వ్యాలీలో జరుగుతున్న అత్యాధునిక శాస్త్రీయ ప్రయత్నాలు భారతదేశంతో పాటు ఆసియాలోని ఏ ఇతర క్లస్టర్‌తోనూ సాటిలేనివన్నారు. ఇది విభిన్న సామర్థ్యాలు కలిగిన కంపెనీలకు నిలయమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా -ప్రీ-క్లినికల్ పరిశోధన, టీకాలు, క్లినికల్ పరిశోధన, ఫార్మా-బయోటెక్ పరిశోధన, జీవశాస్త్రం, వ్యవసాయం-పరిశోధనలో జీనోవ్ వ్యాలికి మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ రంగం అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. అనతి కాలంలోనేఅద్భుతమైన ప్రగతిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని దక్కించుకుంటున్నదన్నారు. ఇప్పుడు దేశానికే నాయక్వతం వహించే స్థితికి మన రాష్ట్రం ఎదిగే దేశగా అడుగులు వేస్తోందన్నారు. ఇది తనకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తోందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం బయో ఫార్మాస్యూటికల్స్ వైపు పయనిస్తోందన్నారు. ఈ రంగంలోభారతదేశం తన సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడం అత్యంత అవసరమన్నారు. ఇందులో హైదరాబాద్‌కు ప్రగతి పథంలో దూసుకపోతున్నదన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రాధాన్యను ఇస్తోందన్నారు. బయో, ఫార్మారంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందన్నారు. దీని కారణంగానే బయో, ఫార్మా రంగంలో పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బయో రంగంలో వార్షిక అమ్మకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీని నుంచి ఆదాయం ఏటా 15శాతం మేరకు స్థిరంగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో దేశంలోనే హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాక్సిన్ హబ్‌గా గుర్తింపు లభించిందన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ల మోతాదులో దాదాపు 33శాతం ఉత్పత్తి చేస్తోందన్నారు. అధునాతమైన శాస్త్రీయ, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన విధాన వాతావరణాన్ని సృష్టించడం ద్వారానే అనితరమైన విజయాలను సొంతం చేసుకుంటున్నదన్నారు. ప్రధానంగా జీనోమ్ వ్యాలీ వంటి లైఫ్ సైన్సెస్ నిర్దిష్ట పారిశ్రామిక క్లస్టర్‌లను స్థాపించడం ద్వారా ఈ ప్రగతిని సాధించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఫార్మాస్యూటికల్ ,బయోటెక్నాలజీలో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్ నగరం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి), సెంటర్ ఫర్ డిఎన్‌ఎ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్ (సిడిఎఫ్‌డి) వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థలతో పనిచేస్తోందన్నారు. దీని కారణంగానే హైదరాబాద్ ఒక ప్రధాన శాస్త్రీయ ఆర్‌అండ్‌డి హబ్‌గా అవతరించిందన్నారు. ఈ నేపథ్యంలో 800కు పైగా లైఫ్‌సైన్సెస్ కంపెనీలు నగరానికి వచ్చాయన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం ఫార్మా ఔషధ ఉత్పత్తిలో 1/3 వంతు గణనీయమైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.