Saturday, November 23, 2024

ఘోర దుర్ఘటన

- Advertisement -
- Advertisement -

Editorial on PM Modi-Putin Summit meeting

త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులను మరి 11 మంది సైనికాధికారులను బలి తీసుకున్న బుధవారం నాటి అతి ఘోర హెలికాప్టర్ ప్రమాదం దేశానికి జరిగిన నష్టం రీత్యా అసాధారణమైనది. అలాగే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల రీత్యా ఈ ప్రమాదం అత్యంత కీలకమైనది. భారత సైన్యం చరిత్రలోనే ఇంత పెద్ద హెలికాప్టర్ ప్రమాదం సంభవించలేదు. అందునా మూడు దళాలనూ నడిపిస్తున్న అత్యున్నత సైనిక సారథి ఇలా అంతమైపోయిన దారుణాన్ని గతంలో దేశం ఎన్నడూ ఎదుర్కోలేదు. మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (రక్షణ సిబ్బంది ఉమ్మడి అధినేత) అయిన రావత్ ద్వారా భూ విమాన వాయు సైన్యాలు మూడింటి మధ్య సమన్వయాన్ని, సహకారాన్ని సాధించి దేశ రక్షణ దుర్గాన్ని మరింతగా పటిష్ఠం చేయడానికి భారత ప్రభుత్వం సంకల్పించింది. అది పూర్తిగా నెరవేరక ముందే ఈ ఘోరం జరిగిపోయింది. ఆ విధంగా రావత్ దుర్మరణం మరింతగా పిడుగుపాటు వంటిది.

సైనిక కుటుంబంలో పుట్టి దళాధిపతిగా వివిధ స్థాయిల్లో విశేష అనుభవం గడించి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు కూడా సారథ్యం వహించిన రావత్ మృతి ఊహించనిది, అత్యంత శోచనీయమైనది. పాకిస్తాన్ భూభాగంలోకి గణనీయమైన ధైర్య సాహసాలతో ప్రవేశించి అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను మూలమట్టంగా ధ్వంసం చేసి దేశమంతటి జయజయ ధ్వానాలను అందుకున్న సర్జికల్ స్ట్రైక్ రావత్ కీర్తిని బాగా పెంచింది. అమిత ఎత్తయిన ప్రాంతాల యుద్ధ విద్యలో రావత్ ఆరితేరారు. గతంలో ఒక హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడినప్పుడు తాను ఉత్తరాఖండ్ కొండల్లో పుట్టి పెరిగిన గట్టి పిండాన్నని ఇటువంటి ప్రమాదాలు తననేమీ చేయలేవని రావత్ చెప్పుకున్నారు. రావత్‌తో పాటు బ్రిగేడియర్ స్థాయి ఆ తర్వాతి శ్రేణుల్లోని పది మంది చనిపోడం మన సైనిక బలానికి శరాఘాతమే. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యోధుతు లాన్స్ నాయక్ బి సాయితేజ కూడా మృతుల్లో వున్నారు. రావత్ స్వయంగా కోరి తన అంగరక్షక దళంలో చేర్చుకున్న సాయితేజ ఆణిముత్యం లాంటి సైనికుడని అర్థమవుతున్నది. తమిళనాడులోని సూలూరు నుంచి వెల్లింగ్టన్‌కు జనరల్ రావత్ బృందాన్ని తీసుకు వెళుతూ ఊటీ నీలగిరి కొండల్లో హెలికాప్టర్ కూలిపోయింది. అప్పుడు ఆ అరణ్య ప్రదేశంలో పొగమంచు దట్టంగా కమ్ముకున్నట్టు వార్తలు చెబుతున్నాయి. కాప్టర్ తక్కువ ఎత్తులోనే వెళుతున్నప్పటికీ ఈ ప్రమాదం జరగడానికి యాంత్రిక లోపమా, మానవ తప్పిదమా ఏది కారణమో దర్యాప్తులో తేలవలసి వుంది. ఆకాశంలోనే మండుతూ హెలికాప్టర్ కిందపడడం వల్ల మృతుల్లో చాలా మంది గుర్తు పట్టలేని విధంగా దగ్ధమైపోయారని స్పష్టపడుతున్నది.

గతంలో జరిగిన ఇటువంటి ప్రమాదాల్లో మృత దేహాలో, ఖండిత అవయవాలో దొరికాయి. గుర్తు పట్టలేనంతగా మాడిమసైపోయిన నేపథ్యం ఈ ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. రావత్ బృందం ప్రయాణం చేసిన ఈ హెలికాప్టర్ ప్రపంచ స్థాయి వాయు వాహనం. ఎంఐ సిరీస్‌కు చెందిన ఈ హెలికాప్టర్ (ఎంఐ 17 వి 5) రష్యాలో తయారైన అత్యాధునికమైనది, అతి భద్రతాయుతమైనదిగా ప్రసిద్ధి చెందింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రయాణం చేసే హెలికాప్టర్ సహజంగానే లోపరహితమైనదిగా, మన సైన్యానికున్న అతి శ్రేష్టమైన వాహనాల్లో ఒకటిగా వుంటుంది. దానికి క్రమం తప్పకుండా తనిఖీలు, మరమ్మతులు చేస్తూ వుంటారు. అయినా ఈ ప్రమాదం జరగడాన్ని విధి అనో, మరేదో అనో సరిపుచ్చుకోకుండా దీనిపై అన్ని కోణాల్లోనూ గాఢమైన శోధన చేయవలసి వుంది. దేశంలో గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగి పలువురు ప్రముఖులను బలి తీసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ సాంద్రమైన మేఘాల గుంపులో చిక్కుకొని కూలిపోగా ఆయన దుర్మరణం పాలయ్యారు.

సంజయ్ గాంధీ, బాలయోగి వంటి వారూ ఇలాగే మరణించారు. ప్రమాదాలు జరగవని అనుకోడానికి వీల్లేదు. అయితే వాటిని పరిమితం చేయడానికి నిత్యం కృషి చేస్తూ వుండాలి. పరిశోధన ద్వారా కొత్త కొత్త తరణోపాయాలను కనుగొంటూ వుండాలి. పాతబడిన హెలికాప్టర్లకు, యుద్ధ విమానాలకు ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేస్తూ వాటిని మంచి స్థితిలో వుంచుకోవాలి. రావత్ బృందం ప్రయాణించిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్లను మెరుగుపరుచుకోడంలో చెప్పనలవికాని జాప్యం జరుగుతున్నదనే విమర్శ వుంది. ఎన్నో వేల కోట్ల ధనాన్ని పోసి అత్యాధునిక యుద్ధ విమానాలను, క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసుకుంటున్న మనం ఇప్పటికే మన అమ్ముల పొదిలో వున్న ఇటువంటి హెలికాప్టర్లను, ఇతర యుద్ధ వాహనాలను బాగు చేసుకోలేకపోడంలోని అలసత్వం క్షమించరానిది. రావత్, ఆయన బృందంలోని అనుభవజ్ఞులైన ఇతర సైనికాధికారులను కోల్పోడం వల్ల తక్షణమే చెప్పనలవికాని నష్టం జరిగినా దానిని పూడ్చుకొని భారత సైన్యం మరింత ప్రగతిని సాధించగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News