త్రిపుర రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ రాజీనామా పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని ఇంటికి పంపిస్తారని రాజకీయ విశ్లేషకులు చాన్నాళ్ల కిందటే ఒక అంచనాకు వచ్చారు. త్రిపురలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై బిజెపి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అయితే విప్లవ్ దేవ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్థానిక బిజెపి నాయకులు హై కమాండ్‌కు విన్నవించారు. దీనికి కారణం విప్లవ్ దేవ్ పని తీరే. ముఖ్యమంత్రిగా ఆయన పని తీరు సొంత పార్టీ నేతలకు కూడా నచ్చలేదు.
పార్టీ నేతలు ఆయనపై భరోసా పెట్టుకోలేకపోయారు. దీంతో బిజెపిలో లుకలుకలు పెరిగాయి. ఒక ముఖ్యమంత్రిగా పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుని పోవాల్సిన బాధ్యత విప్లవ్ దేవ్ ఉంది. అయితే ఈ విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. సిఎం పోస్టులో వున్నా ఒక ముఠా నాయకుడిగానే వ్యవహరించారు. ఫలితంగా త్రిపుర బిజెపి, గ్రూపులమయం అయింది. ఈ గ్రూపు రాజకీయాల తీవ్రత పతాక స్థాయికి చేరింది. పార్టీలోని ఇంటి పోరు చివరకు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మైనస్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపించాయి. దీంతో బిజెపి హైకమాండ్ అలర్ట్ అయింది. ఏ మాత్రం రిస్క్ చేయదలచుకోలేదు. ఇక లాభం లేదనుకుని విప్లవ్ దేవ్‌ను పక్కన పెట్టింది. మాణిక్ సాహాకు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది.
విప్లవ్ దేవ్ ముఖ్యమంత్రి అయిన కొంత కాలానికే వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువు అయ్యారు. ఒకటి కాదు.. రెండు కాదు.. బోలెడన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. మాజీ ప్రపంచ సుందరి డయానా హేడెన్ ఒంటి రంగుపై ఆయన చేసిన కామెంట్ పొలిటికల్ సర్కిల్స్‌లో దుమారం రేపింది. ఇంత నల్లగా ఉండే డయానా హేడెన్‌ను ప్రపంచ సుందరిగా జ్యూరీ ఎలా ఎంపిక చేసిందో తెలియడం లేదంటూ ఆయన అప్పట్లో కామెంట్ చేశారు. దీనిపై డయానా హేడెన్ రియాక్ట్ అయ్యారు. విప్లవ్ దేవ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డయానా ఒక్కరే కాదు.. మహిళా సంఘాలు కూడా విప్లవ్ దేవ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అలాగే మెకానికల్ ఇంజినీర్లపై ఆయన చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సివిల్స్ పరీక్షలకు సివిల్ ఇంజినీర్లు పనికి వస్తారు కానీ, మెకానికల్ ఇంజినీర్లు ఏమాత్రం పనికి రారని ఆయన కామెంట్ చేశారు. అక్కడితో ఆగలేదు. అసలు మెకానికల్ ఇంజినీర్ల వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు. ఈ కామెంట్స్‌తో సివిల్స్ పరీక్షలపై విప్లవ్ దేవ్‌కు ఏమాత్రం అవగాహన లేదన్న విషయం నిరూపితమైంది.
మిడిల్ క్లాస్ విద్యావంతులలో బిజెపి ప్రతిష్ఠ దెబ్బతిన్నది. మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ అసలు మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందన్నారు. ఇలాంటి తలాతోకా లేని వ్యాఖ్యలతోనే విప్లవ్ దేవ్ నాలుగేళ్ల పాటు కాలం గడిపారు. అంతేకానీ ముఖ్యమంత్రిగా పాలనపై పట్టుసాధించడానికి ఆయన ఏ మాత్రం ప్రయత్నించ లేదు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజంలోని అనేక వర్గాలకు బిజెపి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. పైపెచ్చు పార్టీలో ముఠాలను ప్రోత్సహించడం ఆయనకు మైనస్ పాయింట్ గా మారింది. బిజెపికి మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర.. ఐపిఎఫ్‌టి కూడా విప్లవ్ దేవ్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
బిజెపి గెలుపు వెనుక సునీల్ దియోదర్
త్రిపుర మౌలికంగా సిపిఎంకు పెట్టని కోట. త్రిపుర పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి సిపిఎం దిగ్గజం మాణిక్ సర్కార్ గుర్తుకు వస్తారు. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో బిజెపికి మొదటి నుంచి బలం లేదు. త్రిపురలో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య అరవై. 2013 ఎన్నికల్లో బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అలాంటి త్రిపురలో 2018 ఎన్నికల్లో బిజెపి 40 సీట్లు గెలుచుకుంది. సిపిఎం కేవలం 18 సీట్లకు పరిమితమైంది. దీంతో పాతికేళ్ల సిపిఎం జైత్రయాత్రకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బిజెపి గెలుపులో ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు సునీల్ దియోదర్ ది కీలక పాత్ర. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన వారణాసిలో నరేంద్ర మోడీకి మేనేజర్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే సునీల్ దియోదర్‌పై ఎంతో నమ్మకం పెట్టుకుని ఆయనకు త్రిపుర ఎన్నికల బాధ్యతను నరేంద్ర మోడీ అప్పగించారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సునీల్ దియోదర్ సిపిఎం వ్యూహాలకు దీటుగా వ్యూహాలు రూపొందించారు. సిపిఎం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బిజెపికి అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతం అయ్యారు. పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. దీంతో త్రిపురలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటైంది.
డెంటిస్ట్ నుంచి ముఖ్యమంత్రి వరకు
కొత్త ముఖ్యమంత్రి మాణిక్ సాహా వృత్తిరీత్యా డెంటిస్ట్. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. మౌలికంగా ఆయన కాంగ్రెస్ వాది. అయితే 2016లో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టి బిజెపిలో చేరారు. పార్టీ కోసం పని చేసి అంచెలంచెలుగా ఎదిగారు. 2020లో బిజెపి త్రిపుర శాఖ ప్రెసిడెంట్ అయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్, డెంటల్ కౌన్సిల్లో ఆయన శాశ్వత సభ్యుడు. అలాగే ఆయన మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. నేషనల్ లెవెల్లో ఆడిన అనుభవం ఆయన సొంతం. 2023 ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను హై కమాండ్ మాణిక్ సాహా నెత్తిన పెట్టింది. ముఖ్యమంత్రుల పని తీరుపై బిజెపి హై కమాండ్ కొంతకాలంగా నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఎవరి విషయం లోనూ ఉదాసీన వైఖరి వ్యవహరించడం లేదు. గతంలో ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే ముఖ్య మంత్రులను మార్చి వేసింది. ఏమైనా త్రిపుర వ్యవహారంతో పని తీరు బాగా లేకుంటే మార్పు తప్పదన్న హెచ్చరికను బిజెపి ముఖ్యమంత్రులకు హైకమాండ్ మరోసారి చేసినట్లయింది.
ఎస్. అబ్దుల్ ఖాలిక్, 87909 99335
Biplab Deb Resigned as Tripura CM