Monday, January 20, 2025

తుపాన్ బీభత్సం.. గుజరాత్‌లో వేయిగ్రామాల్లో కరెంట్ ఆటంకం

- Advertisement -
- Advertisement -

ప్రాణనష్టం లేకుండా పయనం
తీరం దాటి తుపాన్ బలహీనం
గుజరాత్‌లో వేయిగ్రామాల్లో కరెంట్ ఆటంకం
తీరం వెంబడి ఆస్తినష్టం…హైవేలపై కష్టాలు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ సౌరాష్ట్ర తీరప్రాంతాన్ని తాకిన పెను తుపాన్ బిపొర్‌జాయ్ ప్రభావంతో దాదాపు వేయి గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో ప్రజలు పలు విధాలుగా అల్లాడుతున్నారు. ఈ తుపాన్ ప్రాణనష్టం కల్గించలేదు. అయితే భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. పెనుగాలులతో ముందుగా 5210 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీనితో 4600 గ్రామాలలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 3580 గ్రామాలలో విద్యుత్ పునరుద్ధరించారు.

అయితే ఇప్పటికీ వేయి గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ, సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల ప్రత్యేకించి జాతీయ రహదారులపై భారీ వృక్షాలు కుప్పకూలాయి. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటకు 140 కిలోమీటర్ల వేగపు పెనుగాలులతో తీర ప్రాంత ప్రజలు వణికిపొయ్యారు. పల్లపు ప్రాంతాలలోకి సముద్ర నీరు చొచ్చుకువచ్చింది. జకావూ పోర్టు వద్ద గురువారం తుపాన్ తీరం దాటింది.

దీనితో కచ్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని, ఈ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడటం రాష్ట్ర అధికార యంత్రాంగం సమిష్టి కృషి ఫలితం అని సహాయక చర్యల విభాగం కమిషనర్ అలోక్ కుమార్ పాండే శుక్రవారం విలేకరులకు తెలిపారు. దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓ చోట పశువులకాపర్లు అయిన తండ్రికొడుకు సైక్లోన్ దశలో మృతి చెందారనే వార్తలపై పాండే స్పందించారు. ఈ ఘటన జరిగిన భావ్‌నగర్ తుపాన్ తాకిడికి గురైన జిల్లా కాదని, దీనిని తుపాన్ సంబంధిత చావుల లెక్కల్లోకి తీసుకురావడం కుదరదని తెలిపారు. తీరం దాటిన తరువాత ఈ తుపాన్ క్రమేపీ బలహీనపడింది. తరువాత ఉత్తర తూర్పు దిశగా సాగి అల్పపీడనంగా రాజస్థాన్ దక్షిణ ప్రాంతంలో ఉందని దీనితో అక్కడ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News