Sunday, November 24, 2024

బిపర్‌జాయ్ భీకరం

- Advertisement -
- Advertisement -

కచ్ ప్రాంతంలోని కోట్‌లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకిన తుపాన్

125 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పునరావాస కేంద్రాలకు లక్ష మంది ఆలయాలు మూసివేత రంగంలోకి త్రివిధ దళాలు

అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గత వారం రోజులుగా గుజరాత్ తీర ప్రాంతాలను వణికిస్తున్న తీవ్ర తుపాను ‘బిపర్‌జాయ్’ గురువారం సాయంత్రం గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్‌లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుం డపోత వర్షం కురుస్తోంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి దాదాపు 6 గంటల సమయం పడ్తుందని భారత వాతావరణ శా ఖ( ఐఎండి) అధికారులు వెల్లడించారు. గుజరాత్ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అర్ధరాత్రి 11.30 గంటల సమయానికి తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా, ఆ తర్వాత వాయుగుండంగా బలహీన పడుతుందని తెలిపారు. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయానికి ఇది మరింత పెరిగి గంటకు 120 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు చెప్పారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను కారణంగా కచ్, దేభూమి ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్ జిల్లాల్లో 11.5 సెంటీమీటర్లనుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల దాకా కూడా వర్షం పడవచ్చని, అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు మునకకు గురయ్యే ప్రమాదం ఉందని ఐఎండి డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇప్పటికే ద్వారక, కచ్, పోరుబందర్, జామ్‌నగర్, మోర్బీ తీరప్రాంతాల్లో సముద్రపు అలలు మూడునుంచి ఆరు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి.తీరప్రాంతాల్లోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చిందని ఐఎండి అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల వరకు అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలినట్లు, ముగ్గురు వ్యక్తులు గాయపడినటుసమాచారం అందిందని గుజరాత్ హోం శాఖ సహాయమంత్రి హర్ష్‌సంఘ్వి తెలిపారు.

అయితే ఎవరూ చనిపోయినట్లు వార్తలు రాలేదని ఆయన చెప్పారు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణం కోసం వాడే టిన్‌షీట్లు, ప్లాస్టిక్ రేకులు గాలుల ఉధృతికి కొట్టకు పోయాయి. కచ్ జిల్లాలో ఇప్పటికే 120 గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాతో పాటుగా తుపాను ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న మొత్తం 8 జిల్లాలనుంచి దాదాపు లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.తుపానుపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌లో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కేంద్రంనుంచి 8 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, రాష్ట్రం తరఫున ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు 12, రోడ్లు, భవనాల విభాగంనుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగంనుంచి 397 బృందాలను తీర వెంబడి జిల్లాల్లో మోహరించారు. మరో వైపు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్టుగార్డు బృందాలు బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార పదార్థాలు లాంటి వాటితో సిద్ధంగా ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం దాకా చేపల వేటను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా 76 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుపాను కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన దేవ్‌భూమి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయఆలను గురువారం మూసివేశారు. జామ్‌నగర్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలను శుక్రవారం దాకా నిలిపివేశారు. అయితే అత్యవసర సమయంలో ఎయిర్‌పోర్టును పని చేయించడానికి అవరమైన పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News