Thursday, January 23, 2025

సీమకు చేరిన రుతు పవనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిపోర్ జాయ్ తుపాను అతి తీవ్రంగా మారిందని దీని ప్రభావం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలపై పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలిసారి ఏర్పడిన ఈ తుపాను ఎంతో వేగంగా గుజరాత్‌వైపు దూసుకొస్తున్నట్టు తెలిపింది. మరో 36గంటల్లో ఇది మరింత బలపడి గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపధ్యంలోనే గుజరాత్ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుజరాత్‌తోపాటు కర్ణాటక, గోవాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర ,తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలు పడవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుపాను ప్రభావంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాలు ,ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. ప్రస్తుతం తూర్పు మధ్యఅరేబియా తీరంలో కేంద్రీకృతమైన బిపోర్ జాయ్ తుపాను గంటకు ఎనిమిది కి.మి వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్టు ఐఎండి వెల్లడించింది. తుపాను తీరందాటే సమయంలో గంటకు 135నుంచి 150కి.మి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. గుజరాత్ తీరంలో అలల ఉధృతి కారణంగా మత్సకారులు జూన్ 15వరకూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి షెల్టర్‌లలోకి తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తీవ్ర రూపం దాల్చిన తుపాను ప్రభావంతో ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలు కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. కొన్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

సీమకు చేరిన రుతుపవనాలు..రేపో మాపో తెలంగాణకు!
నైరుతి రుతుపవనాల గమనంలో వేగం పెరిగింది. ఇవి కర్ణాటకలోని మరి కొన్ని భాగాలు ,కొకంణ్ , తమిళనాడులోని మిగిలిన భాగాలకు ,అంధప్రదేశ్‌లోని మరి కొన్ని భాగాలకు వ్యాపించాయి. రాయల సీమ జిల్లాలకు విస్తరించాయి. రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల 48గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు , మెరుపులు గంటకు 40కి.మి వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News