అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. కానూరులోని ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తం కావడంతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెల రోజులుగా పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత పడుతున్నాయని అధికారులు గుర్తించారు. వెంటనే చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. పౌల్ట్రీల పరిధిలో సెక్షన్ 144 అమలులోకి వచ్చింది. వెంటనే అధికారులతో కలెక్టర్ నాగరాణి సమావేశమయ్యారు. వేల్పూరులోని పౌల్ట్రీలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో మాంసం దుకాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరో రెండు రోజుల్లో శాంపిల్స్ ఫలితాలు రానున్నాయి.
బర్డ్‌ఫ్లూపై ఎలాంటి ఆందోళన చెందవద్దు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు తెలిపారు. వలస పక్షుల కారణంగా బర్డ్‌ఫ్లో సోకి ఉండవచ్చని పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూ సాధారణంగా ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుందని వివరించారు. కేంద్రం ఆదేశాల మేరకు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామన్నారు. నష్టపోయిన పౌల్ట్రీ రైతులకు పరిహారం అందిస్తామని దామోదర్‌నాయుడు స్పష్టం చేశారు.