Monday, January 13, 2025

బడిపూలు

- Advertisement -
- Advertisement -

పొద్దుపొద్దున్నే పూలన్నీ
బలవంతంగా వికసిస్తాయి,
కానీ ఆ పరిమళం వాడిపోనిది!

తోటమాలి పూలను ఏరుకున్నట్లు
వీధి వీధినా విరబూసిన పూలను
చదువులమ్మ ఒడికి చేర్చడానికి
వాహనాలబుట్టల్లో నింపుకొని పోతారు!

తేనెతెట్టును భుజాన వేసుకొని
అక్షరాల పుప్పొడితో
తేనెలు పండించడానికి
పసితనం పరిశ్రమిస్తుంది!

విలపిస్తూ మొదలెట్టినా
వాడిపోయి తిరిగొచ్చినా
మట్టిగంధం పూసుకున్నా
బడిపూలు కదా
వీధులన్నీ హరివిల్లులై విరిసి
భలే ముద్దుగా ఉంటారు!

ఒక్కో గూటి నుండి
బరువుగా రెక్కలు విప్పుకొని
కిచకిచమంటూ, బిలబిలమంటూ
గుంపులో కలవడానికి సిద్ధమౌతాయి
అలసట ఎరుగని పక్షులవి!

పొద్దుపొద్దున్నే ఆ బాలభానులు
వెలుగు దృశ్యాలను ప్రసరింపజేస్తుంటే
స్వచ్ఛమైన మనసుగోళం
పసితనం వైపే పరిభ్రమిస్తుంది!

లోకంలో
పసితనమే పవిత్రమైనది
పసిహృదయమే విశాలమైనది!

పుట్టి గిరిధర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News