Monday, January 20, 2025

తెల్లోళ్లపైకి తొలి ఆదివాసీ బాణం

- Advertisement -
- Advertisement -

బిర్సాముండాని ఒక సైంటిస్టుగా చూడాలని కోరికతో తండ్రి నాటి బీహార్‌లోని చోటానాగ్ పూర్ సమీపంలోని ‘ఉలిహటు’ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేర్పించాడు. ఆ బడిలో చదవాలంటే క్రైస్తవుడిగా మారాలనే నిబంధన ఉండటంతో తండ్రి ముండాకి కూడా మతం మార్చి రికార్డుల్లో బిర్సా డేవిడ్‌గా నమోదు చేశారు. ఒకరోజు హాస్టల్ సిబ్బంది వండిన పశువుల మాంసాన్ని భుజిం చనని తిరస్కరించాడు. అప్పట్లో క్రిస్టియన్ మిషనరీలు చేసే మోసాలను బాల్యంలోనే పసిగట్టిన బిర్సా ముండా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. జీవి తంలో మొదటి ఆందోళనను క్రిస్టియన్ మిషనరీల ఆగడాలపైనే ప్రకటించాడు.

భారతదేశంలోని ఆదివాసీ ప్రజల తొలిపోరాట స్ఫూర్తి ప్రదాత బిర్సాముండా. బ్రిటీష్ పాలనను వ్యతిరేకించిన బిర్సా తొలి ‘స్వయం పాలన’ నినాదం ఆయనసొంతం. బిర్సాముండా పోరాట జీవన గమనం(18751900) కాగా తెలంగాణలో నైజాం నవాబులను ఎదురించిన కుమ్రంభీం పోరాట జీవన కాలం (1901 -1940)లో సమీప సారూప్యత కన్పిస్తుంది.ఇద్దరి పోరాట పంథా పరాయి పాలనను ధిక్కరించే ‘స్వయం పాలన’ నినాదం ఒక్కటే. బిర్సాముండా ఈశాన్య రాష్ట్రాలలో ఆంగ్లేయులపై రణభేరి మ్రోగిస్తే, కుమ్రంభీం తెలంగాణలో నైజాములు,రజాకార్లపై తుడుం మ్రోగించాడు.ఆనాటి ఆదివాసీ పోరాట వీరుల చరిత్రను, విజయ గాథలను స్వతంత్ర భారతదేశం ఇప్పుడిప్పుడే గుర్తింపు తెస్తోంది. 2021 నుండి బిర్సాముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా గుర్తించడంతో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇన్నేళ్ళకైనా ఒక గిరిజన ఆదివాసీ యోధునికి గౌరవం దక్కడం హర్షించదగినది.

దేశంలోని ఆదిమ అణగారిన వర్గాలకు పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి బిర్సాముండా. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా బీహార్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమర శంఖం పూరించాడు. తెల్లోళ్లను తరిమేయటమే జీవిత లక్ష్యంగా బీహార్ గిరిజన ప్రాంతంలోని దోమారి కొండల్లో 18861894 మధ్య విప్లవం నడిపాడు. ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు ఉలిహటులో 1875 నవంబర్ 15న పుట్టిన ఈ యోధుడు భూమి కోసం, భుక్తి కోసం, ఆదివాసీల అటవీ హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఉద్యమించాడు. బిర్సా ముండా ఆదివాసీల ప్రయోజనాల కోసం శ్రమిస్తూనే పేదరికంతో బాధపడుతున్న వర్గాలను ఆదుకోవటానికి శక్తి మేరకు కృషి చేశాడు. ఆరోగ్యం బాగాలేని స్థానికులకు ప్రకృతి వైద్యం అందించాడు. బీహార్, చత్తీస్‌గఢ్ ప్రజలకు బిర్సా సేవా గుణం సాక్షాత్తూ భగవత్ స్వరూపమే. ఇండియాలో ఇతర మతాలు బలోపేతం కావటాన్ని జీర్ణించుకోలేకపోయిన బ్రిటిష్ పాలకులు బిర్సాముండాని ఛోటానాగ్పూర్ ప్రాంతంలో 1895 ఆగస్టు 25న అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు.

జైలు నుంచి బయటకు వచ్చాక బిర్సా ముండా తన తెగ ప్రజలకు నైతిక విలువలను, హిందూ మతాన్ని ఆచరించాల్సిన అవసరాన్ని వివరించాడు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించాడు. స్వయంగా నుదుటన బొట్టు పెట్టుకొని, వీపున జంధ్యం ధరించాడు. ఆ రోజుల్లో తెల్లోళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములకు పన్నులు విధించేవారు. వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలసవెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా ముండా వనజీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్ల కప్పాలపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు. తెల్లోళ్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్ 24న భారీ ‘ఉల్ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు. హిందువులతోపాటు ముస్లింలు కూడా ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపి వెంట నడిచారు. ఇదంతా నూనూగు మీసాల యువకుడిగా ఉన్నప్పుడే బిర్సా సాహసించాడు.

ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర చేసి 1900 సంవత్సరం ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా విషప్రయోగం చేసి బలితీసుకుంది. దీంతో.. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వయసులోనే దేశాన్ని పరాయి పాలన నుంచి విడిపించటం కోసం పరితపించిన ఒక ఆశాజ్యోతి బందిఖానాలో నాలుగు గోడల మధ్య 1900 జూన్ 9న ఆరిపోయింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు హక్కులను సాధించుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజనులకు స్వయం పాలనాధికారం రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ద్వారా లభించింది. తర్వాత వందేళ్లకు (2000) నవంబర్ 15న ఆయన జయంతి నాడే దేశంలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ కూడా ఏర్పడింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో బిర్సాముండా పేరిట ఒక యూనివర్సిటీని, విమానాశ్రయానికి పేరును, ఇతర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పింది. బిర్సా ముండా నాటి బీహార్‌లోని దొమారీ హిల్స్ నుండి తన పోరాటాన్ని అప్పటి బ్రిటిష్ పాలకులపై యుద్ధం ప్రకటించాడు. దీంతో బిర్సా ముండా పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడి కొండల్లో ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి స్మరించుకుంటున్నారు.

గుమ్మడి
లక్ష్మీనారాయణ
7842631972

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News