మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 141 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో నమోదు చేసిన వెంటనే జనన, మరణ ధ్రువపత్రాలను పొందే విధానం అమల్లోకి తీసుకువచ్చింది. పురపాలక కార్యాలయాలకు వెళ్లకుండానే ధ్రువపత్రాలను పొందేలా ఏర్పాట్లు చేసినట్టు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. జనన, మరణ ధ్రువపత్రాల్లో తక్షణ (ఇన్‌స్టెంట్) రిజిస్ట్రేషన్, తక్షణ అనుమతి, తక్షణ డౌన్‌లోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వారు వివరించారు. జనన ధ్రువపత్రాల కోసం పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇచ్చామన్నారు. ఆసుపత్రిలో జన్మించిన శిశువు వివరాలను నమోదు చేసిన వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుందని అందులోని లింక్ ద్వారా జనన ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా యూజర్ ఐడిలు
మరణ ధ్రువీకరణలకు ఆసుపత్రులతో పాటు శ్మశాన వాటికల నిర్వాహకులకు ప్రత్యేకంగా యూజర్ ఐడిలు ఇచ్చినట్లు పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో మరణించిన వారి వివరాలను వాటి యాజమాన్యాలు నమోదు చేస్తాయన్నారు. ఇళ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాల్లో సహజ మరణం పొందిన వారి వివరాలను శ్మశానవాటిక నిర్వాహకులు మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుల ఫోన్‌కు మరణ ధ్రువపత్రం లింక్ వస్తుందని, దీనిని డౌన్‌లోడ్ చేసుకుని సర్టిఫికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో గత నెల 23 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానంలో జనన, మరణ ధ్రువపత్రాలను 24 గంటల్లోనే అందజేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.