Monday, December 23, 2024

ఆధార్‌కు, అడ్మిషన్లకూ బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే చాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు, విద్యాసంస్థల్లో ప్రవేశాలతో పాటుగా పాస్‌పోర్టు, వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఇకపై బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోతుంది.దీనికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన జనన, మరణాల నమోదు(సవరణ) చట్టం అక్టోబర్ 1నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందగా ఆగస్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1నుంచి ఈ చట్టం అమలులోకి రానున్నట్ల కేంద్ర హోం శాఖ గురువారం నోటిఫికేషన్‌లో తెలిపింది.ఈ చట్టం అమలులోకి తేదీనుంచి లేదా ఆ తర్వాత జన్మించిన వారికి బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా ఉపయోగించుకునే వీలుంటుంది. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు నమోదు, వివాహాల రిజిస్ట్రేషన్, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల

, స్థానికప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకూ ఈ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవచ్చని ఆ నోటిఫికేషన్‌లో తెలిపారు. దీనివల్ల జనన మరణాలకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో డేటా బేస్ ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడుతుందని కేంద్రం పేర్కొంది.ప్రభుత్వ సేవలు, సామాజిక పథకాలు, డిజిటల్ రిజిస్ట్రేషన్ల విషయంలో పారదర్శకతకు వీలు ఏర్పడుతుందని తెలిపింది.ఆధార్, పాస్‌పోర్టు, ఇతర అవసరాల కోసం అనేక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రజల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి, పుట్టిన తేదీ, ప్రదేశం వివరాలను ఒకే పత్రంలో సమర్పించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని తెలిపింది. దత్తత తీసుకున్న, అనాథలు, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు, సరొగేట్ పిల్లల నమోదును ఈ చట్టం సులభతరం చేస్తుందని తెలిపింది. అన్ని వైద్యసంస్థలూ మరణ ధ్రువీకరణ పత్రంలో మరణానికి సంబంధించిన కారణాలను తెలియజేయడం తప్పనిసరి చేయడంతో పాటుగా, సమీప బంధువుకు ఒక కాపీని అందజేయాలని ఈ చట్టం సూచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News