Thursday, January 23, 2025

పదవ తరగతి పరీక్షలు.. చివరి 15 నిమిషాల ముందు బిట్ పేపర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో చివరి 15 నిమిషాల్లో మాత్రమే ‘బిట్ పేపర్’ ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇస్తారు. సోమవారం(ఏప్రిల్ 3) నుంచి 13 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు(3 గంటలు) పరీక్షలు జరుగనుండగా, ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష, సైన్స్ సబ్జెక్టు పరీక్షలు మాత్రం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50(3 గంటల 20 నిమిషాలు) జరగనున్నాయి. ఇప్పటి వరకు టెన్త్ పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఆ పేపర్లను ఆరుకు కుదించినట్లు విద్యాశాఖ ప్రకటించింది.

2020 వరకు హిందీకి ఒక పరీక్ష ఉండగా.. మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్కో దానికి రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష.. ఒక ప్రశ్నపత్రం మాత్రమే ఉంటుంది. గతంలో ఒక్కో పరీక్ష 40 మార్కులకు నిర్వహించగా ఇప్పుడు 80 మార్కులకు పరీక్ష జరుపుతారు. ఇంటర్నల్ మార్కులు యథావిధిగా ఒక్కో సబ్జెక్టుకు 20 కేటాయిస్తారు. అదేవిధంగా జనరల్ సైన్స్ పరీక్షకు సంబంధించిన రెండు ప్రశ్నపత్రాలను ఒకే సమయంలో కాకుండా నిర్ణీత సమయంలో విద్యార్థులకు వేర్వేరుగా ఇస్తారు. ఇందులో జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్ సైన్స్ కాగా రెండోది బయాలాజికల్ సైన్స్.

విద్యార్థులు ఒక జవాబుపత్రంలో భౌతికశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలను, మరో జవాబుపత్రంలో జీవశాస్త్రం జవాబులను రాయాల్సి ఉంటుంది. ఉదయం 9.30 గంటల పరీక్ష ప్రారంభం కాగానే విద్యార్థులకు మొదట భౌతికశాస్త్రం ప్రశ్నాపత్రం ఇస్తారు. జనరల్ సైన్స్ పేపర్‌కు సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ తర్వాత 20 నిమిషాల సమయంలో ఈ పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను సేకరించి, విద్యార్థులకు రెండో పేపర్ ఇస్తారు. రెండో పేపర్ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇక, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News