సింగపూర్: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం క్రిప్టో కరెన్సీలపైనా పడింది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ సహా అన్ని క్రిప్టో కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. బిట్ కాయిన్ శనివారం ట్రేడింగ్‌లో 20 వేల దిగువకు పడిపోయింది. 2020 డిసెంబర్ తర్వాత అత్యంత కనిష్టం ఇదే. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేయడంతో రిస్క్ అవకాశం ఉన్న అసెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా శనివారం ఉదయం 9.06 గంటల సమయంలో బిట్ కాయిన్ 7.1శాతం నష్టపోయి 18,993 డాలర్లు పలికింది. 2020 డిసెంబర్‌లో18,732 డాలర్ల స్థాయికి పడిపోయిన బిట్ కాయిన్ మళ్లీ ఆ కనిష్ట స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బిట్ కాయిన్ 59 శాతం నష్టపోయింది. బిట్ కాయిన్ తర్వాత స్థానంలో ఉన్న ఎథేర్ కూడా 73 శాతం పతనమైంది. గతేడాది ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రిప్టో కరెన్సీలు ఈ ఏడాది భారీగా నష్టపోయాయి. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 12 రోజులుగా నేల చూపులే చూస్తున్నది. ఈ వారంలో 34 శాతం పతనమైంది. గత 24 గంటల్లో 9శాతం పతనమై 19 వేల మార్క్ వద్ద ట్రేడవుతున్నది.
గత ఏడాది నవంబర్‌లో మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్న క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఇప్పుడు 900 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే మరిన్ని వడ్డీరేట్ల వడ్డింపులు ఉంటాయని అమెరికా ఫెడ్ రిజర్వ్ హెచ్చరికలు జారీ చేసింది.
Bitcoin Down to below 20k dollars