పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఒడిశా సిఎం ప్రకటన
భువనేశ్వర్: ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన బిజెపి స్థానిక నాయకుడిపై చేయిచేసుకున్న సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ జగ్‌దేవ్‌ను అధికార బిజూ జనతా దళ్ పార్టీ నుంచి సస్సెండ్ చేసింది. బిజెపికి చెందిన బలుగావ్ నగర్ అధ్యక్షుడు నిరంజన్ సేఠిని చిలిక నియోజకవర్గ బిజెడి ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒడిశా ముఖ్యమంత్రి, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వెంటనే స్పందించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాక ఖుర్దా జిల్లా ప్లానింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్ల చెల్లింపులో జాప్యం, తదితర సమస్యల గురించి తెలియచేయడానికి బలుగావ్‌లోని స్థానిక నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ కార్యాలయానికి వచ్చిన సేఠి తిరిగి వెళుతుండగా ఆయనపై ప్రశాంత్ కుమార్ దాడి చేసినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో సేఠి గాయపడ్డారు.